కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు
ABN , Publish Date - Apr 01 , 2024 | 05:46 AM
రాష్ట్రంలో ప్రస్తుత కరువు.. దానికదే వచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివితక్కువతనం వల్ల వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించి ఆదుకునే ఆలోచన ముఖ్యమంత్రికి,
వంద రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్యలు
రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి
ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి
లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతాం
సొల్లు పురాణాలు చెప్పి అధికారంలోకి వచ్చారు
ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు
గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులు చేస్తున్నారు
ఎందరితోనో పోరాడాం.. ఎందరినో పాతరేశాం
పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిది: కేసీఆర్
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మాజీ సీఎం పర్యటన
ఎండిన పంట పొలాల పరిశీలన.. రైతులకు ఓదార్పు
కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన పోలీసులు
నల్లగొండ/జనగామ/మోత్కూరు/తుంగతుర్తి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత కరువు.. దానికదే వచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, తెలివితక్కువతనం వల్ల వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించి ఆదుకునే ఆలోచన ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందని, సీఎంకు ఢిల్లీకి తిరగ డానికే సరిపోతోందని విమర్శించారు. ఎవరో ఒకరిద్దరిని పార్టీలో చేర్చుకొని చిల్లర రాజకీయాలు చేయడం కాదని, రైతుల బాధలపై ప్రభుత్వం స్పందించాలని హితవు పలికారు. ప్రజల సమస్యల్ని వదిలేసి అడ్డగోలు మాటలు, గత ప్రభుత్వాన్ని బదనాం చేసే చిల్లర పనులు చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎందరితోనో పోరాడామని, ఎందరినో పాతరేశామని, గద్దెనెక్కి పదేళ్లు పాలించామని చెప్పారు. ప్రజలు తమకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని, వారి తరఫున పోరాడుతామని అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని, వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి, సూర్యాపేట జిల్లాలోని తుంగుతుర్తి నియోజకవర్గాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి, గోస పడుతున్నారని తెలిపారు. రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించి ఆదుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. తక్షణమే కరువుపై స్పందించాలని, పంటలు ఎండిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చింది?
గత పదేళ్లలో ఎనిమిదేళ్లపాటు తాము వ్యవసాయాన్ని స్థిరీకరించామని కేసీఆర్ తెలిపారు. రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించామని, రైతులకు అవసరమైన సందర్భంలో పెట్టుబడులకు ఉపయోగపడేలా రైతుబంధు అందించామని, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందించామని, రైతులు పండించిన పంటలను మద్దతు ధరలకు కొనిపించామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక వందరోజుల్లో ఇవన్నీ ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు. ఇక్కడ రాజకీయాలు ప్రధానం కాదని, ఉన్నత స్థితికి వెళ్లిన రాష్ట్రంలో మళ్లీ ఈ దుస్థితి ఎందుకు తలెత్తుతోందని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కింద తాగునీరెందుకు అందడం లేదని, ట్యాంకర్లు మళ్లీ ఎందుకు రోడ్లమీదకు వచ్చాయని నిలదీశారు. హైదరాబాద్ లో తాము 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తే ఈ ప్రభుత్వం మళ్లీ నీటి బిల్లులు వసూలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాము రూ.35 వేల కోట్లు ఖర్చుచేశామని, న్యూయార్క్, లండన్‌లలో కరెంటు పోయినా హైదరాబాద్‌లో రెప్పపాటు సమయం కూడా కరెంటు పోని స్థితికి తెచ్చామని అన్నారు. టెక్నోక్రాట్స్‌తోనే విద్యుత్తు వ్యవస్థను నడిపామని, ఈ ప్రభుత్వం వచ్చాక వారి స్థానంలో ఐఏఎ్‌సలను నియమించిందని, విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నడిపేందుకు మంత్రులకు, ఐఏఎ్‌సలకు తీరికలేదని మండిపడ్డారు. రైతుబంధు డబ్బులను 10, 12 రోజుల్లో రైతుల ఖాతాల్లో వేశామని, ఇప్పుడు ఎకరాల పేరుతో రైతులను ఒత్తిళ్ల గురిచేసి ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలు సొల్లు పురాణాలతో అధికారంలోకి వచ్చారని కేసీఆర్ ఆరోపించారు. నాలుగో నెల కావస్తోందని, ఇప్పుడు ప్రజల పక్షాన తన గొంతు విప్పుతున్నానని అన్నారు. వ్యవసాయర రంగంపై కనీస సమీక్ష నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. తాము రాజకీయాల కోసం రాలేదని, ఇది రైతుల బాధ అని చెప్పారు. రైతులను ఆదుకొనేంతవరకు మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీస్తామన్నారు. బీఆర్‌ఎస్ దళాలు ఇప్పటికే గ్రామగ్రామాన తిరుగుతున్నాయని, రైతుల బాధలు తెలుసుకుంటున్నాయని చెప్పారు. చీప్ ట్రిక్కులతో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సీపేజీ వాటర్ లీక్ అయ్యేచోట లంగ కథలు అల్లి డ్రామాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. గోదావరిలో పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోతే దానికి చిల్లర కథలు అల్లుతున్నారని, అప్పుడప్పుడు ఇంజనీర్ల తప్పిదాలతో ఇలాంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. రైతులు అరిగోస పడుతున్నారని తెలిపారు. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, డిసెంబరు9 వెళ్లిపోయి ఎన్నిరోజులైందో సీఎంకు గుర్తుందా? అని నిలదీశారు. ‘‘రైతులు వారి ఇబ్బందులను మాతో చెప్పవద్దని కాంగ్రెస్ నేతలు బెదిరించారట. సోషల్ మీడియాలో సమస్యలను ప్రస్తావించే యువకులను పోలీసులు బెదిరిస్తున్నారు. పోలీసులు పరిమితుల్లో ఉండడం మంచిది. మా ప్రభుత్వంలో మేం ఇలాగే చేస్తే ఈ ప్రభుత్వం వచ్చేదా?’’ అని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ప్రభుత్వం క్వింటాకు 500బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 2న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 6న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష చేయాలన్నారు.
కేసీఆర్ వాహనం తనిఖీ
కొడకండ్ల/జగదేవ్‌పూర్: కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటనకు వెళ్లే క్రమంలో మొండ్రాయిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. కాగా, ఉదయం ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌కు బాల్యమిత్రుడు జహంగీర్ దట్టీ కట్టారు.
అధైర్య పడకండి.. అండగా ఉంటా
పంటలు ఎండిన రైతులు ఎవరూ ధైర్యం చెడవద్దని, వారికి అండగా ఉంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్‌తండాలో ఎండిపోయిన వరి పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వద్ద రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆంగోతు సత్తెమ్మ అనే మహిళా రైతు.. తాను 6 ఎకరాల్లో వరి నాటు వేశానని, ఉన్న ఒక్క బోరూ ఎండిపోవడం వల్ల పంటంతా ఎండిపోయిందని చెప్పారు. దీంతో నెల క్రితం రూ.2 లక్షలు వెచ్చించి నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4న తన కొడుకు రాజేందర్ పెళ్లి ఉందని, ఇదే సమయంలో పంట ఎండిపోయాయని, బోర్లు వేసినందుకు రూ.2 లక్షలు అప్పులు అయ్యాయని కేసీఆర్‌కు తెలిపారు. దీంతో కేసీఆర్ స్పందించి సత్తెమ్మ కొడుకు పెళ్లి ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎండిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. ఎండిపోయిన వరి చేనులో గొర్రెలను మేపుతున్న దయ్యాల వెంకటనారాయణ పొలాన్ని పరిశీలించారు. పలువురు రైతులు పొలాల్లో ఎండిన వరిని కట్టలు కట్టి తెచ్చి కేసీఆర్‌కు చూపించగా.. వారిని కేసీఆర్ ఓదార్చారు. కాగా, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. నల్లగొండ జిల్లా నిడమనూరులోనూ కేసీఆర్ పర్యటించాల్సి ఉండగా.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, విలేకరుల సమావేశంలో మాట్లాడుటప్పటికి సాయంత్రం కావడంతో ఆ పర్యటన రద్దయింది.
ఈ ప్రభుత్వంలో కరెంటు పోతా వస్తా ఉంటది
సూర్యాపేటలో కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. దీంతో, ‘‘ఈ ప్రభుత్వంలో ఇలా కరెంటు వస్తూ పోతూ ఉంటది. కరెంటు కోతలని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగిందనే ప్రచారం అవాస్తవమని సూర్యాపేట ఎస్‌ఈ పాల్‌రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ కోసం బీఆర్‌ఎస్ కార్యాలయం బయట టెంట్లు వేశారని, 125 కెవీఏ డీజిల్ జనరేటర్ ద్వారా విద్యుత్తు వినియోగం జరిగిందని తెలిపారు. మైక్ కనెక్షన్‌లో చిన్న సమస్య ఉండడం వల్ల 22 సెకన్లు మైకులు పని చేయలేదని, దానిని ఎలక్ర్టీషియన్ వెంటనే సరిచేశాడని తెలిపారు.