మత్స్యోత్సాహం
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:41 AM
జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గత నెల 7న జిల్లాలో ప్రారంభమైన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తికావస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.
1.36 కోట్ల చేప పిల్ల పంపిణీ లక్ష్యం
ఇప్పటికే 1.13కోట్ల చేప పిల్లల సరఫరా
జిల్లాలో 83.50శాతం పూర్తి
తుది దశకు చేప పిల్లల పంపిణీ
ఈసారి లక్ష్యాన్ని సగానికి తగ్గించిన ప్రభుత్వం
మత్స్యకారుల్లో అసంతృప్తి
జనగామ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గత నెల 7న జిల్లాలో ప్రారంభమైన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తికావస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. గత ఏడాది బిల్లులు రాకపోవడంతో ఈ ఏడాది పంపిణీ చేసేందుకు ఫిష్ ఫార్మర్లు(కాంట్రాక్టర్లు) ముందుకు రాలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరపడంతో ముందుకొచ్చి టెండర్లు వేశారు. జిల్లావ్యాప్తంగా 9 రిజర్వాయర్లు, 723 చెరువులు, కుంటల్లో ఈ ఏడాది 1.36 కోట్ల చేప పిల్లలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. జనగామ జిల్లాలో 169 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 141 పురుషుల సంఘాలు కాగా.. 28 మహిళల సహకార సంఘాలు ఉన్నాయి. 169 సంఘాల్లో 16,868 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. కాగా.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.36 కోట్ల చేప పిల్లలను వదలాలను లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 1.13 కోట్ల చేప పిల్లల పంపిణీని పూర్తి చేశారు. కాగా, లక్ష్యాన్ని 83.50శాతం పూర్తి చేసి జనగామ జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని అధికారులు చెబుతున్నారు.
లక్ష్యం సగానికి కుదింపు
ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం 50శాతానికి కుదించింది. చెరువుల్లో నీరు లేకపోవడంతో, నిధులు లేమి కారణంగా అధికారులు టార్గెట్ సగానికి కుదించారు. ప్రతీ ఏటా జిల్లాలో 2.72 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదలాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈసారి 1.36 కోట్లకే పరిమితం చేశారు. నిధుల లేమి కారణంగా ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించి రావాల్సిన సుమారు రూ.100 కోట్ల బిల్లులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇంకా మంజూరు చేయలేదు. దీనికి తోడు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సైతం తక్కువగా కురిసాయి. దీంతో రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరు అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది చెరువులు నిండుగా ఉన్న సమయంలో వంద శాతం చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం చెరువుల్లో నీరు లేకపోవడంతో అదే వంద శాతం పిల్లలను వేస్తే చేప పిల్లలు బతికే అవకాశం తక్కువగా ఉంటుంది. దీంతో లక్ష్యాన్ని సగానికి తగ్గించారు.
మత్స్యకారుల్లో అసంతృప్తి
చేప పిల్లలను గత ఏడాది కంటే సగానికి తగ్గించి ఇవ్వడంతో మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఏటా పూర్తిస్థాయిలో చేప పిల్లలను ఇవ్వగా ఈసారి సగానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. గత ఏడాది పూర్తి స్థాయిలో ఇచ్చిన చేప పిల్లల్లో చాలా వరకు చనిపోయేవని, చివరి వరకు తమకు పెద్దగా గిట్టుబాటు అయ్యేది కాదని వాపోతున్నారు. కాగా.. ఇప్పుడు సగానికిపైగా తగ్గించి ఇవ్వడం వల్ల చివరకు పెద్దగా మిగిలేది ఏమీ ఉండదని అంటున్నారు. పభుత్వం తగ్గించిన మిగతా 50శాతం టార్గెట్‌కు సంబంధించిన అమౌంట్‌ను ప్రభుత్వం తమ ఖాతాల్లో వేయాలని కోరుతున్నారు. దీంతో తాము సొంతంగా చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వేసుకుంటామని చెబుతున్నారు.
నాలుగైదు రోజుల్లో వందశాతం పూర్తి
- రాణాప్రతాప్, జిల్లా మత్స్యశాఖ అధికారి, జనగామ
జిల్లాలో చేప పిల్లల పంపిణీ చివరి దశకు చేరుకుంది. జిల్లాలో ఈ ఏడాది 1.36 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 1.13 కోట్ల చేప పిల్లల పంపిణీ పూర్తి చేశాం. 83.50 శాతంతో చేప పిల్లల పంపిణీలో జనగామ జిల్లా రాష్ట్రస్థాయిలో 6వ స్థానంలో ఉంది. మరో నాలుగైదు రోజుల్లో పంపిణీ పూర్తి చేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం.