Share News

మరో 2 వరాలకు

ABN , Publish Date - Feb 23 , 2024 | 04:52 AM

మరో రెండు పథకాల అమలుకు రంగం సిద్ధమవుతోంది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్తు (గృహజ్యోతి), రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరో 2 వరాలకు

గృహ జ్యోతి, 500కే సిలిండర్‌ పథకాల అమలుకు రంగం సిద్ధం

ఈ నెల 27 లేదా 29న మార్గదర్శకాలు విడుదల

నెలకు 200 యూనిట్లలోపు అర్హులకు

మార్చి నుంచి జీరో కరెంటు బిల్లులు

నిరంతరం ప్రజా పాలన దరఖాస్తులు

క్యాబినెట్‌ సబ్‌కమిటీతో సీఎం సమీక్ష

‘సిలిండర్‌’కు మార్గం సుగమం!

సబ్సిడీ సొమ్ము గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లకు

ప్రభుత్వం, ఏజెన్సీల మధ్య ఒప్పందం

లబ్ధిదారుడు 500 చెల్లిస్తే సిలిండర్‌

3 ఏళ్ల వినియోగ సగటును బట్టి కోటా

దాదాపు రూ.1000 కోట్ల భారం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మరో రెండు పథకాల అమలుకు రంగం సిద్ధమవుతోంది. 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్తు (గృహజ్యోతి), రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 27 లేదా 29వ తేదీన ఈ రెండు పథకాల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గ్యారంటీల అమలుకు వేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఇప్పుడు గృహ జ్యోతి, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను అమల్లోకి తేవాల్సి ఉందని చెబుతూ అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. 200 యూనిట్లలోపు వినియోగించే గృహ విద్యుత్‌ వినియోగదారులకు మార్చి నుంచి జీరో బిల్లులు జారీ చే యాలని స్పష్టం చేశారు. అనుమానాలు/అపోహలకు తావు లేకుండా ‘గృహ జ్యోతి’ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు.

తెల్ల రేషన్‌ కార్డు కలిగి.. 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడే వారందరికీ మార్చి మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేయాలని నిర్దేశించారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో రేషన్‌ కార్డు (ఆహార భద్రత కార్డు), యునీక్‌ సర్వీస్‌ నంబర్లను పొందుపరచడంతో తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోకుండా చూడాలని, ఆయా వివరాలను నవీకరించుకునే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్తు బిల్లుల కలెక్షన్‌ సెంటర్లు, సర్వీస్‌ సెంటర్లలో సవరణ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని నిర్దేశించారు. తప్పులను సవరించుకున్న అర్హులందరికీ తదుపరి నెల (మార్చిలో సరి చేసుకుంటే ఏప్రిల్‌లో.. ఏప్రిల్‌లో సవరించుకుంటే మేలో జీరో బిల్లు) నుంచి పథకం అమలు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలందరికీ తెలిసేలా విద్యుత్తు శాఖ తగినంత ప్రచారం చేపట్టాలని సూచించారు. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాల్సిన బాధ్యత అధికారుల మీదే ఉందని స్పష్టం చేశారు. ఇక, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోని వారుంటే .. వారికి తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో అప్లికేషన్లు పెట్టుకునే వెసులుబాటును నిరంతర ప్రక్రియగా అమలు చేయాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించాలని, దీనిపై గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను వెంటవెంటనే వారికి చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, ట్రాన్స్‌కో/జెన్‌కో సీఎండీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితోపాటు ఇత ర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2024 | 04:52 AM