Share News

స్నేహితులను మింగేసిన మృత్యువు

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:50 AM

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. రెండుచోట్లా బైక్‌ మీద వెళుతూ మృత్యు ఒడిలోకి జారిపోయిన వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే స్నేహితులే. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా

స్నేహితులను మింగేసిన మృత్యువు

రెండుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

చేర్యాల/హవేళిఘణపూర్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. రెండుచోట్లా బైక్‌ మీద వెళుతూ మృత్యు ఒడిలోకి జారిపోయిన వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే స్నేహితులే. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన ఏనుగుల కరుణాకర్‌ (38), దూసరి సాయిలు (32) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇద్దరి పొలాలు సోలామైల్‌ సమీపంలో పక్కపక్కనే ఉండటంతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి స్నేహితులయ్యారు. మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి తమ పిల్లలకు స్కూలు బ్యాగులు కొనడంతో పాటు ఇతర పనుల కోసం బైక్‌పై చేర్యాలకు వచ్చారు. పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ముస్త్యాల శివారు ప్రగతి హాస్టల్‌ సమీపంలో మూలమలుపు వద్ద కారు ఢీకొని ఇద్దర్నీ కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఘటనలో.. మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం జక్కన్నపేట శివారులో బైక్‌ అదుపు తప్పి మామిళ్ల మహేష్‌ (24), శీల ప్రభాకర్‌ (22) చనిపోయారు. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే కావడంతో స్నేహితులయ్యారు. ఏ పని చేయాలన్నా ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లేవారు. మంగళవారం మెదక్‌-సర్దన మార్గం మీదుగా జక్కన్నపేట నుంచి మెదక్‌ వెళ్లి వస్తుండగా ఫరీద్‌పూర్‌ చెరువు మూలమలుపు వద్ద వారి బైక్‌ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రభాకర్‌ అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మహే్‌షను మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో అతను చనిపోయాడు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూమారులు కావడంతో ఆ రెండు కుటుంబాల వారు విలపిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ప్రభాకర్‌కు భార్య సౌందర్య ఉంది.

Updated Date - Nov 20 , 2024 | 04:50 AM