Share News

Hyderabad: హైదరాబాద్‌లో జెనోమిక్‌ వెల్నెస్‌ క్లినిక్‌

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:37 AM

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జెనోమిక్‌ వెల్నెస్‌ క్లినిక్‌కు అక్టోబరు 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు జీనోమ్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Hyderabad: హైదరాబాద్‌లో జెనోమిక్‌ వెల్నెస్‌ క్లినిక్‌

  • అక్టోబరు 9న శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

  • జీనోమ్‌ ఫౌండేషన్‌ వెల్లడి.. సీఎంను కలిసిన వైద్యులు

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జెనోమిక్‌ వెల్నెస్‌ క్లినిక్‌కు అక్టోబరు 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు జీనోమ్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. డాక్టర్‌ కేపీసీ గాంధీ నాయకత్వంలో నగరంలోని జీనోమ్‌ ఫౌండేషన్‌ (జీఎ్‌ఫ)కు చెందిన ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం గురువారం సీఎం రేవంత్‌ రెడ్డితో ఆయన కార్యాలయంలో సమావేశమైంది. జీనోమ్‌ ఫౌండేషన్‌లో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి వైద్యులు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్‌ సర్కారు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో జీనోమ్‌ ఫౌండేషన్‌కు 4.13 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రతిపాదిత కేంద్రానికి అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కొత్త భవన సముదాయానికి శంకుస్థాపన చేయాలని బృందం ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, తమ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని జీనోమ్‌ ఫౌండేషన్‌ పేర్కొంది.


ఈ అధునాతన వైద్య సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉప్పల్‌, వరంగల్‌ హైవే జోన్లో, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామీణ రోగులకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. సీఎంను కలిసిన బృందంలో ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ బి. సోమరాజు, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి. ప్రసాదరావు, బయోఏషియా, ఎఫ్‌ఏబీఏ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ పి. రెడ్డిన్న, అమెరికాకు చెందిన ప్రముఖ క్లినికల్‌ ఇమ్యునాలజిస్ట్‌ డాక్టర్‌ కొసరాజు ఆర్‌. రావు, నేచురోపతి సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కార్తీక్‌ ఉన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 03:37 AM