ఆయిల్‌పామ్ రైతులకు శుభవార్త
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:36 AM
వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక బద్ధంగా ముం దుకు సాగుతున్నాయి.
దిగుమతి సుంకం శాతాన్ని పెంచిన కేంద్రం
పెరగనున్న పామాయిల్ గెలల ధర
ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణానికి ప్రోత్సాహం
నియోజకవర్గాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మధ్యలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు
నల్లగొండ, సెప్టెంబరు 15: వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక బద్ధంగా ముం దుకు సాగుతున్నాయి. రైతులను ఆయిల్‌పామ్ సాగువైపు పూర్తిగా మళ్లించేలా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని తీసుకొంది. ఈ మేరకు దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5శాతాని కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ.14,392 ఉండగా అది టన్నుకు రూ.1500 నుంచి రూ.1700వరకు అదనంగా పెరిగే అవకాశాలున్నాయి. ఆయిల్ పామ్ గెల ల ధర టన్నుకు రూ.16,500కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నల్లగొండ, సూర్యాపేట జిల్లా లో ఊపందుకుంటున్న ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలున్నాయి. గత ఏడాది నుంచి ప్రారంభమైన యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం నాలుగైదు ఏళ్లలో దిగబడులు రానున్నాయి. మొదటి స్థానంలో నల్లగొండ జిల్లా, రెండో స్థానంలో సూర్యాపేట జిల్లాలు, మూడో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆయిల్‌పామ్ విస్తీర్ణం ఉంది. కొద్ది రోజుల వరకు ఆయిల్‌పామ్ దిగుబడిపై సుంకం ఎత్తి వేయడంతో గెలల ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ నెలకొనడంతో పాటు ఈ పంట సాగు చేయాలన్నా ఆసక్తి ఉన్న రైతులపై ప్రభావం చూపినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రైతులకు అధిక ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దిగుమతి చేస్తున్న ముడి పామాయిల్‌పై సుంకం శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో కేంద్రం స్పందించి సుంకం శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయిల్ పామ్ రైతులకు భరోసా కలిగింది.
ఉమ్మడి జిల్లాలో 17వేల ఎకరాలకు పైగా సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17,500 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 10వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో నాలుగు వేల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3500ఎకరా ల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో నాలుగేళ్ల క్రితం సాగుచేసిన 1500ఎకరాల ఆయిల్‌పామ్ తోటల నుంచి దిగుబడి మొదలైంది. దీం తో ఉత్పత్తి అవుతున్న మూడు వేల టన్నులను విజయవాడ సమీపంలోని అంపాపురం ఫ్యాక్టరీకి పతాంజలి కంపెనీ నిర్వాహకులు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తులు భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పతాంజలి కంపెనీ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మధ్య జాతీయ రహదారి వెంట సుమారు 200ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైతులతో పాటు సరిహద్దు జిల్లాల రైతులకు కూడా ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ఆయిల్‌పామ్ ఉత్పత్తులను క్రషింగ్ చేయడంతో పాటు రాజేంద్రనగర్ వంటి వ్యవసాయ క్షేత్రం మాదిరిగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ కంపెనీ ఆవరణలో సైతం 50 ఎకరాల వరకు ఆయిల్‌పామ్ సాగును చేసి రైతుల ఆసక్తి పెంచడం కోసం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయం ప్రకారం జిల్లాలో అధికార యంత్రాంగం కూడా ఆయిల్‌పాంసాగు పెంచాలని ప్రణాళిక రూపోదిస్తోంది. నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం ఐదు వేల ఎకరా ల వరకు ఉంది. అదేవిధంగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఆయిల్‌పాం సాగును విస్తరించేందుకు ఆయా కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ సాగు తోటల పెంపుపై దృష్టిసారించిన నేపథ్యంలో పంట ల సాగును విస్తరింపచేయడంతో పాటు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నల్లగొం డ జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సదస్సులు మొదలయ్యాయి. ఈ సదస్సు లకు ఉద్యానశాఖ అధికారులతో పాటు ఆయిల్‌పాం కంపెనీల ప్రతినిధుల, ఇతర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు హాజరవుతున్నారు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఇప్పటికే పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తున్న విషయం తెలిసిందే. సబ్సిడీలు ఇవ్వడం ద్వారా రైతులను సాగుపట్ల ఆసక్తిని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వరికి బదులు పామాయిల్ సాగు చేస్తే మేలు కలుగుతుందనేది ప్రభుత్వం యోచిస్తూ అందుకు అనుగుణంగా ప్రోత్సాహాకాలను అందిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహాకం విస్తీర్ణంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆర్ధికంగా బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుంది. రైతులకు అధిక ధరలను అందించి ఆయిల్‌పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తు న్నాయి. అవగాహన సదస్సుల్లో పెట్టుబడుల విషయంతో పాటు భూమిలోని మట్టి స్థితిగతులు వాడాల్సిన ఎరువులు, నీటి వనరులు ఇంకా ఇతర అంశాలన్నింటినీ రైతులకు సవివరంగా తెలియజేస్తూ అవగాహన సదస్సులు కొనసాగిస్తున్నారు. వచ్చే రోజుల్లో మండలాల వారీగా కూడా సదస్సులు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాల్లో విస్తీర్ణం ఉండగా మరో ఐదు వేల ఎకరాల్లో విస్తీర్ణం పెంచనున్నారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా తోటల విస్తీర్ణాన్ని పెంచడం మూలంగా రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ రైతులకు మహార్ధశ చేకూరనుంది.
ఆయిల్‌పాం రైతులకు ప్రోత్సాహం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పామ్ రైతులను ప్రోత్సహిస్తుండడంతో జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం కానుంది. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆయిల్‌పాంపై రైతులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయిల్‌పామ్ గెలల ధరలు పెరిగాయి. త్వరలో ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఫ్యాక్టరీ ఏర్పాటైతే రైతులకు ఎంతగానో ఉపయోగం కానుంది.
- వీవీఎస్ సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్ ఉద్యానశాఖ నల్లగొండ.