Share News

Ponguleti : దీపావళి లోపు కొత్త ఆర్వోఆర్‌ చట్టం

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:15 AM

దీపావళి నాటికి కొత్త రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌) చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Ponguleti : దీపావళి లోపు కొత్త ఆర్వోఆర్‌ చట్టం

  • ముసాయిదా చట్టంపై సీఎం రేవంత్‌తో

  • చర్చించిన మంత్రి పొంగులేటి

  • క్యాబినెట్‌ భేటీలోనూ చర్చకు అవకాశం

  • ఆర్డినెన్స్‌ లేదా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల

  • ద్వారా చట్టం అమలులోకి!

  • భూమాత కార్యాచరణ ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దీపావళి నాటికి కొత్త రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌) చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటి వరకు ముసాయిదా ఆర్వోఆర్‌పై వచ్చిన సలహాలు, చేపట్టిన మార్పులు, ఫైలెట్‌ ప్రాజెక్టు కింద వచ్చిన ఫలితాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వివరించినట్లు తెలిసింది. ఈ ఏడాది జూలై చివరిలో కొత్త ఆర్వోఆర్‌ చట్టం ముసాయిదాను ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఆగస్టు 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అభిప్రాయ సేకరణకు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టింది. ఆ తరువాత వెంటనే జిల్లా కలెక్టర్లతో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు.


రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి ప్రాంతాల్లో కొత్త చట్టం తీసుకురానున్న నేపథ్యంలో ఫైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయగా వచ్చిన ఫలితాలను, సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముసాయిదా చట్టంలో మార్పులు, చేర్పులు చేపట్టారు. అలాగే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో భూ కమిషన్ల ఏర్పాటు వంటి అంశాలపై ఎక్కువ మంది నుంచి సూచనలు అందాయి. ముసాయిదాలో చేర్చిన పలు అంశాలపై సీఎంతో పొంగులేటి చర్చించినట్లు తెలిసింది. రాబోయే కేబినెట్‌ సమావేశంలో కొత్త ఆర్వోఆర్‌ చట్టంపై చర్చించే అవకాశం ఉందని, ఆ వెంటనే ఆర్డినెన్స్‌ లేదా ప్రత్యేక సమావేశాల ద్వారా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది.


  • భూమాత కార్యాచరణ షురూ

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ధరణి పోర్టల్‌ స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొస్తామని ప్రకటన చేసింది. ఇప్పటికే ధరణి పోర్టల్‌ నిర్వహణను నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీకి) అప్పగించిన ప్రభుత్వం భూమాత పోర్టల్‌ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసింది. ధరణి పోర్టల్‌ వల్ల పెండింగ్‌లో ఉన్న 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తులను భూమాత పోర్టల్‌ ద్వారా కొత్త ఆర్వోఆర్‌ చట్టంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని రెవెన్యూ చట్టాలను సవరించే పనిలో భాగంగా 2016లో రద్దు అయిన భూ ఆక్రమణ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చేందుకు భూ చట్టాల నిపుణులతో చర్చించారు. అలాగే గ్రామస్థాయి ఉద్యోగుల ఎంపికకు సంబంధించి విధివిధానాలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలో జరగనున్న క్యాబినెట్‌ సమావేశంలో కొత్త ఆర్వోఆర్‌ చట్టం, గ్రామ స్థాయి ఉద్యోగుల నియామకం, భూ చట్టాల సంస్కరణ, కొత్త చట్టాల రూపకల్పనపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 03:15 AM