Share News

తెరపైకి గుంజపడుగు మండలం

ABN , Publish Date - Dec 26 , 2024 | 01:13 AM

మంథని మండలంలోని గుంజపడుగును మండల కేంద్రంగా చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే మరో 12 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు కూడా సంబంధిత శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

తెరపైకి గుంజపడుగు మండలం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మంథని మండలంలోని గుంజపడుగును మండల కేంద్రంగా చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. అలాగే మరో 12 కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు కూడా సంబంధిత శాఖాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచనల మేరకు రెవెన్యూ, పంచాయతీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉన్న సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లి మండల ఏర్పాటు ఊసెత్తడం లేదు. మంథని మండలంలో గల గుంజపడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా పెద్దపల్లి జిల్లాను 14 మండలాలతో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రామగుండం మండలాన్ని రామగుండం, అంతర్గ్గాం, పాలకుర్తి మండలాలుగా విభజించారు. అలాగే కమాన్‌పూర్‌ మండలాన్ని కమాన్‌పూర్‌, రామగిరి మండలాలుగా విభజించారు. పాలకుర్తి మండలాన్ని 13 పంచాయతీలతో కలిపి ఏర్పాటు చేశారు. ఇందులో కమాన్‌పూర్‌ మండలానికి చెందిన కన్నాల, రాణాపూర్‌ పంచాయతీలను, వెల్గటూర్‌ మండలంలోని ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండేడ గ్రామాలను కలుపుకుని మండలాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడ్డ రామగిరి మండలంలో ముత్తారం మండలంలోని బుధవారంపేట్‌, ఆదివారంపేట్‌, లద్నాపూర్‌, రాజాపూర్‌ గ్రామాలను విలీనం చేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలోనే సుల్తానాబాద్‌ మండలంలోని గర్రెపల్లిని గర్రెపల్లి, గొల్లపల్లి, నారాయణరావుపల్లి, సాంబయ్యపల్లి, ఐతరాజుపల్లి, దుబ్బపల్లి, భూపతిపూర్‌, నర్సయ్యపల్లి, బొంతకుంటపల్లె గ్రామపంచాయతీలతో పాటు ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేట గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వచ్చింది. అలాగే మంథని మండలంలోని గుంజపడుగు, ఉప్పట్ల, పోతారం, విలోచవరం, మల్లెపల్లి, నాగారం, కన్నాల, రచ్చపల్లి, ఆడ్యాల, అక్కెపల్లి, సిద్ధపల్లి, సిరిపురం, దుబ్బపల్లి, చిప్పపల్లి, బెస్తపల్లి, రామగిరి మండలంలోని చందనాపూర్‌, సింగిరెడ్డిపల్లి, పెద్దంపేట్‌, సుందిళ్ల, ముస్త్యాల గ్రామాలను కలిపి గుంజపడుగు మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ మంథని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైన నాటి నుంచి ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో గుంజపడుగులో ప్రజలు దశల వారీగా ఉద్యమించారు. గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ మండలాలు ఏర్పాటు కాలేదు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తప్పకుండా గుంజపడుగును మండలంగా చేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు గుంజపడుగును మండలంగా ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి.

15 గ్రామాలతో గుంజపడుగు మండలం..

గుంజపడుగు మండలాన్ని మంథని మండలంలోని 12 గ్రామాలతో పాటు రామగిరి మండలంలో గల మూడు గ్రామాలు మొత్తం 15 గ్రామాలతో మండలంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గుంజపడుగు, అక్కెపల్లి, రచ్చపల్లి, కన్నాల, నాగారం, చిల్లపల్లి, దుబ్బపల్లి, బెస్తపల్లి, సిరిపురం, ఉప్పట్ల, పోతారం, విలోచవరం, రామగిరి మండలంలోని జల్లారం, చందనాపూర్‌, పెద్దంపేట గ్రామాలను కలుపుకుని గుంజపడుగు మండలాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంజపడుగుకు చుట్టు పక్కల ఉన్న గ్రామాలనే తీసుకున్నారు. మంథని ఆర్డీవో దీనికి సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు ఇప్పటికే పంపించారు. ఒక మండలంలో కనీసం తొమ్మిది రెవెన్యూ గ్రామాలు ఉండాలనే నిబందనను అనుసరించి రూపకల్పన చేస్తున్నారు. అలాగే సర్వే అండ్‌ ల్యాండ్స్‌ రికార్డ్స్‌ శాఖ దీనికి సంబంధించిన మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నది. రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన నివేదికను జిల్లా అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు..

జిల్లాలో మరో 12 గ్రామాలను గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గంలోని మంథని మండలంలో శాస్త్రులపల్లి, స్వర్ణపల్లి, ముత్తారం మండలం కాసర్లపల్లి, రంగయ్యపల్లె, సర్వారం, కాజీపల్లి, శుక్రవారంపేట, రామగిరి మండలం వకీల్‌పల్లి, గడ్డంపల్లి, కమాన్‌పూర్‌ మండలం కిష్టంపల్లి, ముల్కలపల్లి, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని లబాడితండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 267 గ్రామపంచాయతీలు ఉండగా, నెలరోజుల క్రితం మంథని మండలం తోట గోపయ్యపల్లి, ముత్తారం మండలం జిల్లెల్లపల్లి పంచాయతీలుగా ఏర్పాటు కావడంతో 269కి పెరిగాయి. తాజాగా ప్రతిపాదించిన 12 పంచాయతీలు ఏర్పాటైతే పంచాయతీల సంఖ్య 281కి చేరుకోనున్నది.

గర్రెపల్లి మండలం ఊసెత్తని అధికారులు..

జిల్లాలు ఏర్పాటైన నాటి నుంచే గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, అధికారులు దాని ఊసెత్తడం లేదు. గర్రెపల్లి గ్రామం రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామంలో సర్వేనంబర్లు 1603, 1614, 1643, 1645లలో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడ ఇప్పటికే సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలతో పాటు ఆదర్శ పాఠశాల, కస్తూర్బాగాంఽధీ బాలికల గురుకుల విద్యాలయం, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువుల దవాఖాన, జిల్లాలోనే అతి పెద్ద చెరువు, దీని పరిసరాల్లో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఎంబీఏ, తదితర కళాశాలలున్నాయి. అలాగే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, అన్ని రకాల వసతులున్నాయి. కానీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం కావడం లేదు. ఈ విషయమై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్పందించి గుంజపడుగుతో పాటు గర్రెపల్లిని కూడా మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గర్రెపల్లి ప్రాంత వాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 01:13 AM