Harish Rao: రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా.. హరీశ్ రావు ధ్వజం
ABN , Publish Date - Aug 19 , 2024 | 11:35 AM
కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ రైతు రుణమాఫీ పేరుతో ప్రజలను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల అరెస్ట్ అన్యాయమని వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అరిగోస పడుతున్నారు..
"రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య. పోలీసు యాక్ట్ (30 Act) పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమే. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ ఖండిస్తోంది. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఒకవైపు రైతు బంధు రాక, మరోవైపు రుణమాఫీ కాకపోవడంతో అన్నదాత ఆవేదనలో ఉన్నాడు.
వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు అయిన రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుంది" అని హరీశ్ హెచ్చరించారు.
KTR: కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు
For Latest News and National News click here