Harish Rao: సీఎంఆర్ఎఫ్ చెక్కుల కాజేతపై స్పందించిన హరీశ్ రావు కార్యాలయం..
ABN , Publish Date - Mar 27 , 2024 | 03:33 PM
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) చెంత పీఏగా పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కాజేశారన్న ఆరోపణలపై హరీశ్ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) చెంత పీఏగా పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కాజేశారన్న ఆరోపణలపై హరీశ్ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటనలో ఏముందంటే..
"హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేశాడనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏంటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ కార్యాలయంలో పనిచేసేవారు. మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత 06-12-2023 రోజున కార్యాలయ సిబ్బందిని పంపేశాం. ఆ రోజు నుంచి నరేష్‌తో కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు.
అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకువెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే మా కార్యాలయం స్పందించి, అతనిపై 17-12-2023న నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. కాబట్టి, ఆ వ్యక్తితో హరీశ్ రావుతో గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సాయం చేశాం. వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నాం"అని ఆ ప్రకటనలో ఉంది.