Share News

ఇదిగిదిగో.. భక్త రామదాసు!?

ABN , Publish Date - Jan 27 , 2024 | 04:23 AM

రామనామం మాదిరిగానే కంచర్ల గోపన్న కీర్తనలూ ‘ఎంతో రుచి’! మరి.. ఆ రాములోరికి గొప్ప ఆలయాన్ని నిర్మించి, భక్త రామదాసుగా వినుతికెక్కిన ఆయన ఎలా ఉంటారు? శ్రీరామదాసు సినిమాలో చూపించినట్లుగానే ఉండేవారా? అంటే..

ఇదిగిదిగో.. భక్త రామదాసు!?

నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎప్పట్నుంచో రావిచెట్టు నీడన విగ్రహం

నేలకొండపల్లి, జనవరి 26: రామనామం మాదిరిగానే కంచర్ల గోపన్న కీర్తనలూ ‘ఎంతో రుచి’! మరి.. ఆ రాములోరికి గొప్ప ఆలయాన్ని నిర్మించి, భక్త రామదాసుగా వినుతికెక్కిన ఆయన ఎలా ఉంటారు? శ్రీరామదాసు సినిమాలో చూపించినట్లుగానే ఉండేవారా? అంటే.. ఇదిగో ఈ విగ్రహం మాదిరిగనే ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 16వ శతాబ్దకాలం నాటి ఈ విగ్రహం ఆయనదేనని స్పష్టం చేస్తున్నారు!! చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌లోని ఓ రావిచెట్టు కింద ఎప్పట్నుంచో ఉంది. ఇన్నాళ్లూ ఎవ్వరూ పట్టించుకోని ఆ విగ్రహాన్ని ఇటీవల ఓ వ్యక్తి ఉత్సుకత కొద్దీ ఫొటోతీసి ‘కొత్త తెలంగాణా చరిత్ర’ బృంద సభ్యులైన రామోజుహరగోపాల్‌, కట్టా శ్రీనివా్‌సకు పంపాడు. వారొచ్చి పరిశీలించి విగ్రహం భక్త రామదాసుదేనని చెబుతున్నారు. చక్కని మీసకట్టు, అప్పుడే స్నానం చేసినట్టు తల వెనుక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడి.. ఎడమ భుజాల మీద శంఖు చక్ర ముద్రలతో కూడిన విగ్రహం వైష్ణవ భక్తుడిదని పేర్కొన్నారు. శిల్పం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్నదో లేదంటే మాదన్నదో అనుకునే అవకాశమే లేదన్నారు. వారి మేనల్లుడు, భద్రాచల రామాలయ నిర్మాత, నేలకొండపల్లి వాసి అయిన కంచర్ల గోపన్నది అవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఈ పురాతన విగ్రహాన్ని శుక్రవారం రామదాసు ధ్యాన మందిరానికి తరలించారు. రామదాసు పదోతరం వారసుడైన కంచర్ల శ్రీనివాసరావు సమక్షంలో ఆ విగ్రహాన్ని ధ్యాన మందిరంలో ఉంచి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jan 27 , 2024 | 04:23 AM