Share News

కేసీఆర్‌, హరీశ్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:19 AM

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

కేసీఆర్‌, హరీశ్‌కు హైకోర్టులో ఊరట

భూపాలపల్లి కోర్టు నోటీసుల సస్పెన్షన్‌

జిల్లా కోర్టు పరిధి మీరిందన్న హైకోర్టు

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారం

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. జిల్లా కోర్టు తన అధికార పరిధిని మీరి వ్యవహరించిందని పేర్కొంది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్‌ తదితరుల అవినీతే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట భూపాలపల్లి మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దాన్ని విచారించే పరిధి తమకు లేదంటూ ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఫిర్యాదుదారు భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించే అధికార పరిధి జిల్లా కం సెషన్స్‌ కోర్టుకు లేదని కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది.

అయితే ఈ అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా కోర్టు... పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌, హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ సీఆర్పీసీకి విరుద్ధంగా రివిజన్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు స్వీకరించిందని తెలిపారు. జిల్లా కోర్టు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను, నోటీసులను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇది పిటిషనర్లకు ప్రైవేటు ఫిర్యాదుదారుకు మధ్య వ్యవహారమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని వ్యాఖ్యానించింది. రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జనవరి 7కు వాయిదా వేసింది.

Updated Date - Dec 25 , 2024 | 03:19 AM