Share News

గురుకుల విద్యార్థుల ఇంటిదారి

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:48 AM

పెద్దాపూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులకు భయం పట్టుకుంది. దీంతో ఒక్కొక్కరుగా ఇంటి దారి పడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది.

గురుకుల విద్యార్థుల ఇంటిదారి
పెద్దాపూర్‌ గురుకుల పాఠశాల ఆవరణంలోని చెత్తను తొలగిస్తున్న పంచాయతీ కార్మికులు

వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 10 (ఆంధ్రజ్యోతి) : పెద్దాపూర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులకు భయం పట్టుకుంది. దీంతో ఒక్కొక్కరుగా ఇంటి దారి పడుతున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. గురుకుల పాఠశాలలో 416, కళాశాలలో 130 మంది విద్యారులు చదువుతున్నారు. వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడం వాటికి కారణాలు తెలయక పోవడంతో తల్లిదండ్రులు భయంతో తమ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. కళాశాల విద్యార్థులు మినహా పాఠశాల విద్యార్థులు దాదాపు ఖాళీ అయ్యారు. నాలుగు నెలల క్రితం గురులంలో జరిగిన ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తాజాగా మళ్లీ ఇద్దరు విద్యార్థులకు పాముకాటు అనే అనుమానాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టి భరోసా కల్పించేంత వరకు తమ పిల్లలను పంపించమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు తల్లిదండ్రులు తెలిపారు.

ముమ్మరంగా పారిశుధ్య పనులు

గురుకులం ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో పాములు, కిటక పురుగులు రాకుండా తిరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలలో గదుల వేనుక పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి, పాత గదులను తొలగించి, పాఠశాలలో పారిశుధ్యం పనులు చేసి అన్ని వసతులను కల్పించేందుకు అధికారులు పనులు చేపట్టారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పర్యవేక్షణలో అధికారులతో గురుకులంలోని చెత్త, పిచ్చి మొక్కలు, ప్రహరీ గోడకు ఉన్నరంధ్రాలు మూసివేయడం, శానిటేషన్‌ పనులు చేపట్టారు. గురుకులం పెద్ద చెట్లు ఉండడంతో కోతులు బెడద నుంచి రక్షణ కోసం వాటిని తొలగిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించి పనులు చేయిస్తున్నారు.

చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థుల డిశ్చార్జి

గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు ఓంకారి అఖిల్‌, బోడ యశ్వంత్‌ డిశ్చార్జి అయినట్లు మెడికల్‌ అధికారి అంజిత్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు కోరుట్లలోని వేరువేరు ఆసుపత్రులకు తరలించారు. ఆర్డీవో శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిలను గమనించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు సమాచారం అందించారు. రెండు రోజుల నుంచి చికిత్స పొందుత్ను వారి ఆరోగ్యం కుదటపడడంతో శుక్రవారం వైద్యులు డిశ్చార్జి చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 12:48 AM