Share News

గురుకులం.. కలకలం..!

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:40 PM

ప్రస్తుతం గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కరువైందని, విద్యార్థులకు ఆరో గ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గురుకులం.. కలకలం..!
ములుగులోని గిరిజన బాలుర వసతిగృహం ఇరుకుగదిలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు

అసౌకర్యాల మధ్య విద్యార్థుల అవస్థలు

‘సంక్షేమం’పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

ప్రశ్నార్థకంగా ఆరోగ్యం, భద్రత

కడుపు నొప్పి, జ్వరం, మానసిక సమస్యలకు అందని వైద్యం

హాస్టల్‌లో ఉండలేక, ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైనం

నాసిరకంగా భోజనం.. తుప్పు పట్టిన బెడ్లు, కిటికీలు

అద్దెభవనాల్లో 500మంది ఉండాల్సిన చోట వెయ్యి మందికిపైగా విద్యార్థులు

పారిశుధ్య కార్మికుల కొరతతో అపరిశుభ్రంగా స్నానాలగదులు, మరుగుదొడ్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

ప్రస్తుతం గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థుల సంక్షేమం గురించి అధికారులు పట్టించుకోవడం లేదని, ఉన్నతా ధికారుల పర్యవేక్షణ కరువైందని, విద్యార్థులకు ఆరో గ్యం, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్వరం బారిన పడినా.. కడుపు నొప్పి వచ్చినా.. మానసిక సమస్యలు ఉత్పన్నమ యినా పట్టించుకునేవారు ఉండక.. ఓదార్చి ధైర్యం చెప్పే వారు లేక విద్యార్థులకు హాస్టల్‌ అంటే హడలి పోతున్నారు. మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నామనే ఆందోళనతో ఆత్మహ త్యలకు కూడా వెనకాడకపోవడం అందరిలోనూ కలకలం రేపుతోంది. వీటికి తోడు నాణ్యత లేని భోజనం.. శుభ్రం చేయని మరుగుదొడ్లు.. తుప్పు పట్టి న బెడ్లను చూస్తే విద్యార్థులకు చదవాలనే ఆసక్తి సన్నగిల్లుతోంది. పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో హాస్టల్‌ గదుల దుర్వాసన నుంచి వారికి విముక్తి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు గురు కులం చదువంటే ఇష్టం.. వసతులు చూస్తే కష్టంగా మారిందనే చర్చ జరుగుతోంది.

భద్రతపైనే భయం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 250కి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. వీటిలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. తల్లి దండ్రులకు దూరంగా ఉం టూ చదువుకు దగ్గరికి కావాలనే విద్యార్థుల ఆశపై అసౌకర్యాలు నీళ్లు చల్లుతు న్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చాలా వరకు అద్దె భవనాల్లోనే గురుకులా లను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లను, భవనాలను గురుకులాలను అద్దెకు ఇచ్చి.. కనీస సౌకర్యాలు లేకపోయినా రూ.50వేల నుంచి రూ.1లక్షకు పైగా నెలనెల అద్దెలు చెల్లిం చారని సమాచారం. ఇప్పటికి 8 నెలలుగా అద్దెలు చెల్లించక పోవటంతో భవన యాజమా నులు కనీస వసతులు కల్పిం చటం లేదు. పాడైన మరుగు దొడ్లను, బాత్‌రూమ్‌లు, కిటికీ లకు మరమ్మతులు చేయించ డం లేదు. తమకు అద్దె రావ టం లేదని, పెట్టుబడి ఎక్కడి నుంచి పెట్టాలంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో అసౌకర్యాల మధ్య విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నా రు. ఇక ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న గురు కులాల్లో ఇంతకంటే దారుణంగా పరిస్థితులు ఉండ టం గమనార్హం. కిటికీలు, తలుపులు కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో పాములు, తేళ్లు, విషకీ టకాలు గదుల్లోకి, ప్రాంగణాల్లోకి వస్తుండటంతో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ మండల కేంద్రంలో 1995లో నిర్మించిన సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులంలో సుమారు 700మంది విద్యార్థులు ఉంటున్నారు. తుప్పు పట్టిన బెడ్స్‌, విరిగిపోయిన కిటికీలకు తోడు ధ్వంసమైన మరుగుదొడ్లతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేకపోవటంతో పిల్లలు స్నానాలకు నరకం చూస్తున్నారు. 10వ తరగతి వరకు 500మంది పిల్లలుఉండేలా గురుకులాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌, డిగ్రీ చదివే పిల్లలకు కూడా గురుకులంలో అవకాశాలను ప్రభు త్వం కల్పిస్తోంది. అయితే వీరికి ప్రత్యేకంగా హాస్టల్‌ సౌకర్యం కల్పించటం లేదు. 10వ తరగతి వరకు విద్యార్థులకు కేటాయించిన భవనాల్లోనే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో 500మంది ఉండాల్సిన భవనాల్లో 800 నుంచి వెయ్యి మందికి వరకు సర్దుబాటు చేయ డంతో తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారనే విమర్శ లు వినిపిస్తున్నాయిు. మరుగుదొడ్లు, తాగునీరు, స్నానాలకు నీరు సరిపడక అవస్థలు పడుతున్నారు. పారిశుధ్య కార్మికులను అన్ని గురుకులాల్లో నియ మించలేదు. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్మికు లనే వినియోగిస్తున్నారు. దీంతో హాస్టళ్లు అపరిశుభ్రత కు కేరాఫ్‌గా మారుతున్నాయి. చలికాలం మొదలైనా విద్యార్థులందరికీ బెడ్‌షీట్స్‌ అందలేదు. దీంతో తలుపులేని కిటికీల నుంచి వచ్చే చలిగాలికి తుప్పు పట్టిన బెడ్స్‌పై భయం భయంగా నిద్రపోవాల్సి వస్తోంది. అలాగే చాలాహాస్టళ్లలో నైట్‌ వాచ్‌మెన్‌లు లేకపోవడంతో రాత్రివేళల్లో బయటి వ్యక్తులు హాస్టళ్ల లోకి వస్తున్న సంఘటనలున్నాయి. ఇది విద్యార్థులకు రక్షణ లేదనడానికి నిదర్శనమన్న విమర్ళలున్నాయి.

నాసిరకంగా భోజనం

హాస్టల్‌ విద్యార్థులకు చాలావరకు నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. భోజనం అందించేందుకు ఒక్కో హాస్టల్‌లో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. బియ్యాన్ని, విజయ పాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, కూరగాయలు, నాన్‌వెజ్‌, కోడిగుడ్లు, ఇతర నిత్యాసరుకులు అందిం చేందుకు వేర్వేరుగా కాంట్రాక్టు అప్పగించటం, వాటిపై పైఅధికారులు పర్యవేక్షణ లేకపోవటంతో నాసిరకం సరుకులు హాస్టళ్లకు చేరుతున్నాయి. కొన్ని గురుకులాలకు ఒకే కాంట్రాక్టర్‌ నుంచి సరుకులు వస్తున్నట్టు సమాచారం. అయితే సరుకులన్నీ ఒకేసారి రావడంతో అవి స్టోర్‌ రూమ్‌లో ఉండి ముక్కి పోతున్నాయని, కొన్ని చోట్ల వాటినే వండి పెడుతుండటంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.

మానసిక ఒత్తిడికి ఓదార్పేదీ?

హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు సవాల్‌గా మారుతున్నాయి. హాస్టల్‌లో తినే ఆహరం పడకనో.. బయట నుంచి తెచ్చుకున్న తిన్న ఫుడ్‌ వికటించో రాత్రి వేళ కడుపు నొప్పి, జ్వరం వస్తే పట్టించుకునే వారు ఉండటం లేదు. కనీసం డాక్టర్ల వద్దకు తీసుకెళ్లేందుకు గురుకులాల్లో సిబ్బంది అందుబాటులో ఉండకపోవటంతో రాత్రంతా నొప్పితో బాధ పడాల్సిందేనని విద్యార్థుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. తెల్లారిన తరువాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో వైద్యం అందక కొన్ని చోట్ల విద్యార్థులు మృతి చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక మానసిక సమస్యలు ఎదుర్కొనే విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు గురుకులాల్లో సైకాలజిస్టులను ప్రభుత్వం నియమించ లేదు. దీంతో చాలాచోట్ల గురుకుల భవనాల పైకి ఎక్కి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ గురుకులాలకు కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నా.. పరిపాలనపైనే వారు ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆదేశాలతో హాస్టళ్లపై కలెక్టర్లు దృష్టి పెడుతున్నారు. అయితే ప్రత్యేకంగా హాస్టళ్ల పర్యవేక్షణ వార్డెన్లు, హెచ్‌ఎంలపైనే ఉంటుంది. బీసీ గురుకులాలను పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. ఒక్కరు ఎన్ని గురుకులాలను పర్యవేక్షించగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమశాఖ అధికారులకు గురుకులాలపై అధికారం లేకపోవటంతో పర్యవేక్షణ కరువవుతోంది. దీంతో హాస్టల్‌ వార్డెన్లు, ప్రిన్సిపాల్స్‌ పైనే భారం పడుతోంది. చాలా చోట్ల వారు కూడా చేతులెత్తేస్తుండటంతో గురుకులాలు

ఆందోళన కలిగిస్తున్న సంఘటనల్లో కొన్ని..

ఫ జూన్‌ 23న జనగామ జిల్లా చిల్పూరులో కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షిణి (14) తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక, హాస్టల్‌లోనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది.

ఫ జూలై 11వ తేదీన కేసముద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌కు చెందిన తొమ్మిదోతరగతికి చెందిన పవిత్ర అనే బాలిక ప్రమాదవశాత్తు హాస్టల్‌ భవనంపై నుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఫ ఆగస్టు 9వ తేదీన ములుగులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక హాస్టల్‌ భవనపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

ఫ ఆగస్టు 14న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలలో ముకేష్‌ అనే విద్యార్థి కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. వార్డెన్‌, హెచ్‌ఎంల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

ఫఅక్టోబరు 27న అర్థరాత్రి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వం గర్ల్స్‌ మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లోకి అర్థరాత్రి ఓ యువకుడు చొరబడ్డారు. అమ్మాయిల అరుపులతో ఆ యువకుడు తిరిగి వెళ్లిన ఘటన భద్రత లోపాన్ని ఎత్తిచూపుతోందన్న చర్చ జరుగుతోంది.

ఫ నవంబరు 14వ తేదీన ములుగు జిల్లా బండారుపల్లి గురుకులంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న రాజేష్‌ అనే విద్యార్థి గడ్డి మందు తాగి ఆత్మహత్మకు పాల్పడటం కలకలం రేపింది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో..

బీసీ గురుకులాలు - 36

ఎస్సీ గురుకులాలు - 33

మైనారిటీ గురుకులాలు - 16

ఎస్టీ గురుకులాలు - 42

Updated Date - Nov 30 , 2024 | 11:40 PM