Hyderabad : ప్రభుత్వాలు మారుతున్నా దక్కని ‘క్షమాభిక్ష’!
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:56 AM
అర్హులైన ఖైదీల ఎంపికపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. ఫలితంగా క్షమాభిక్షకు అర్హులైన వారు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పీబీవీ గణేశ్ ఉదంతమే దీనికి నిదర్శనం.
26 ఏళ్లుగా జైల్లోనే గణేశ్.. వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ఖైదీల ఎంపికపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. ఫలితంగా క్షమాభిక్షకు అర్హులైన వారు జైళ్లలోనే మగ్గిపోతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పీబీవీ గణేశ్ ఉదంతమే దీనికి నిదర్శనం. గణేశ్ విద్యార్థి దశలో 1985లో మావోయిస్టు పార్టీలో చేరారు. మాగుంట హత్య కేసులో 1995 డిసెంబరులో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆగస్టు 4, 2000లో కోర్టు శిక్ష ఖరారు చేసింది.
గణేశ్ 26 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 200 మందికిపైగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. ఆ జాబితాలో గణేశ్ పేరు ఉన్నట్లు చెప్పిన జైలు అధికారులు.. ఖైదీల విడుదలకు కొద్ది సమయం ముందు లేదన్నారు. గతంలో పలుమార్లు గణేశ్‌కు ఇలాగే నిరాశ మిగిలింది. ఏదైనా కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నిందితులపై మోపిన అభియోగాల మేరకు క్షమాభిక్షకు అనర్హులని, అయితే రాష్ట్ర ప్రభు త్వం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకొని విడుదల చేయవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. గణేశ్ విషయంలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.
అయినా ఉమ్మ డి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో జైల్లోనే ఉండాల్సి వస్తోంది. అప్పుడప్పుడు పెరోల్‌పై బయటకొస్తున్నా షరతులతో కాలం వెళ్లదీస్తున్నారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న గణేశ్.. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కవులు,కళాకారులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.