Share News

విస్తరణకు నోచుకొని హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారి

ABN , Publish Date - Jun 27 , 2024 | 11:20 PM

హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిత్యం హైదరాబాద్‌ నుంచి ఈ రహదారి మీదుగా వేల వాహనాలు, లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

విస్తరణకు నోచుకొని  హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారి

విస్తరణ ఎప్పుడో

2014లో జాతీయ రహదారిగా హైదరాబాద్‌ - శ్రీశైలం రోడ్డు

నాలుగింతలు పెరిగిన వాహనాల రద్దీ

ఫ రోడ్డు విస్తరించక పెరిగిపోతున్న ప్రమాదాలు

రెండు లేన్ల రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

రోడ్డు విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం వినతి

ఆమనగల్లు, జూన్‌ 27 :హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిత్యం హైదరాబాద్‌ నుంచి ఈ రహదారి మీదుగా వేల వాహనాలు, లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రహదారి విస్తరణ చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి విస్తరించాలని ఏళ్ల కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు మార్గాన తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల, ఆమనగల్లు, వెల్దండ, కల్వకుర్తి, డిండి మీదుగా శ్రీశైలం, కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్‌ మీదుగా నంద్యాలకు వెళ్లే ఈ రహదారి పదేళ్ల కాలంగా విస్తరణకు నోచుకోలేదు. రెండులేన్ల ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని చాలా కాలంగా ప్రయాణికులు కోరుతున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డిలు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ ్కరీని పలుమార్లు కలిసి నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించాలని కోరారు. గత ఎంపీ పోతుగంటి రాములు, ప్రస్తుత ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, జాతీయ బీసీ కమీషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారిలు కూడా మంత్రిని కలిసి రోడ్డు విస్తరణ ఆవశ్యకత గురించి వివరించారు. అయినా నేటికి ఎలాంటి స్పందన లేదు. ఈ జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణకు కేంద్రం రెండేళ్ల క్రితమే రూ.1,275 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినా నేటికీ నిదులు విడుదల కాలేదు.

2013 జాతీయ రహదారిగా గుర్తింపు

ఆర్‌అండ్‌బీ శాఖలో ఉన్న హైదరాబాద్‌ -శ్రీశైలం రహదారిని 2013లో 765వ నంబర్‌ జాతీయ రహదారిగా గుర్తించారు. తెలంగాణలో రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పరిధిలో 191 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తోకపల్లి వరకు ఉన్న 270 కిలోమీటర్ల రోడ్డును రూ.320 కోట్లతో అభివృద్ధి చేశారు. అప్పట్లోనే నాలుగు లేన్లుగా రోడ్డును విస్తరించాలని స్థానిక నాయకులు, ప్రజలు, వాహనదారులు కోరినా అప్పటి వాహనాల, ప్రయాణికుల రద్దీకనుగుణంగా రెండు లేన్ల రోడ్డుగా నిర్మాణం చేసి మైసిగండి, హాజిపూర్‌ల వద్ద టోల్‌గేట్లు ఏర్పాటు చేశారు. రహదారి జాతీయ రహదారిగా మారడంతో ప్రయాణానికి ఇబ్బందులు తొలుగుతాయని భావించిన ప్రయాణికులు ఇటీవల ఈ రహదారిపై ప్రయాణమంటేనే భయపడుతున్నారు.

765కు అనుసంధానంగా 167కే జాతీయ రహదారి నిర్మాణం

కల్వకుర్తి సమీపంలోని కొట్రగేటు నుంచి కొల్లాపూర్‌లోని సోమశిల, కరివెన మీదుగా ఏపీలోని నంద్యాల వరకు కొత్తగా 167 కే జాతీయ రహదారిని గుర్తించి ఏడాది క్రితం పనులు చేపట్టారు. కొత్తగా ప్రకటించిన 167 కే జాతీయ రహదారి హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో ముందుగా ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తే తప్ప ప్రయోజనం ఉండదని ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. సోమశిల మీదుగా కొత్తగా నిర్మించే జాతీయ రహదారి పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి మీదుగా తిరుపతి వెళ్లడానికి దూరం తగ్గనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరిస్తేనే శ్రీశైలం, తిరుపతి జాతీయ రహదారులు అనుసంధానం అయి వాహనాల రద్దీని తట్టుకోగలుగుతుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చిన వినతిపత్రంలో ప్రస్తావించారు.

పెరిగిన రోడ్డు ప్రమాదాలు

హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. తుక్కుగూడ మొదలు కల్వకుర్తి వరకు ఏడాది కాలంలో సుమారు 50మంది వరకు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డు లేకపోవడం, ఉన్న రోడ్డులో డివైడర్‌ లేక ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కూడా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

సీఎం దృష్టికి తీసుకెళ్లాం

హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగులేన్లుగా విస్తరించాలని సీఎంకు విన్నవించాం. ప్రధాని, కేంద్రమంత్రి గడ్కరీని సీఎం కలిసి రహదారి విస్తరణ గురించి వివరించారు. కేంద్రంపై చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నాం. 765 జాతీయ రహదారిని విస్తరించడానికి కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

- కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే

కేంద్రంపై ఒత్తిడి తెస్తా

శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో రోడ్డును విస్తరించాల్సి ఉంది. రహదారి విస్తరణ గూర్చి ప్రధాని, కేంద్రమంత్రి గడ్కరీకి విన్నవిస్తా. పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా. రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యల గురించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల దృష్టికి తీసుకు వెళతా.

- డాక్టర్‌ మల్లు రవి, నాగర్‌కర్నూలు ఎంపీ

Updated Date - Jun 27 , 2024 | 11:20 PM