RB - X: బుల్డోజర్ రాకముందే దందా బంద్
ABN , Publish Date - Oct 06 , 2024 | 11:18 AM
మూసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు, గోదాములు, షెడ్లను ఖాళీ చేస్తున్నారు.
ముందే సర్దుకుంటున్న అక్రమార్కులు
స్వచ్ఛందంగా పరికరాలు, సామగ్రి తరలింపు
మూసీ వెంట ఖాళీ అవుతున్న గోదాములు
ఆర్బీఎక్స్ మార్కింగ్‌తో మొదలైన భయం
ధ్వంసం కాకముందే నిర్వాహకుల అప్రమత్తం
హైదరాబాద్: మూసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన హైడ్రా కూల్చివేతలు అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు, గోదాములు, షెడ్లను ఖాళీ చేస్తున్నారు. ఆర్బీఎక్స్ మార్కింగ్ చేసిన భవనాల్లో పరికరాలు, సామగ్రిని స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ధ్వంసం కాకముందే నిర్వాహకులు వేగంగా సర్దుకుంటున్నారు. మట్టిపోసి ఇన్నాళ్లు ఆయా స్థలాలను తమ ఆధీనంలో ఉంచు కాని లీజు పేరుతో ఆదాయం పొందుతున్న అక్రమార్కుల దందాకు క్రమేణా తెరపడుతోంది. ఏ క్షణమైనా బుల్డోజర్ రావచ్చనే భయం ఆక్రమణదారులకు పట్టుకుంది. లీజుకు తీసుకున్న స్థలాల్లో లక్షలు వెచ్చించి ప్రముఖ ఆటోమోబైల్ సంస్థల డీలర్లు సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎంతో ఆధునీకరించిన సర్వీసు సెంట ర్లపై బుల్డోజర్ వస్తే ఏమి మిగలదని భావించి ముందే ఖాళీ చేస్తున్నారు. మూసారాంబాగ్ బ్రిడ్జి దాటగానే దిల్‌సుఖ్‌నగర్ వైపు మొదటి ఎడమ భాగంలో షెడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. చైతన్యపురి ఫణిగిరికాలనీలో బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పూర్తిగా తొలగించారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇష్టానుసారంగా పూడ్చివేత
హైదరాబాద్‌కు మూసీ మణిహారం లాంటిది. దీని వెంట చిన్న స్థలం దొరికినా నివాసానికి, వాణిజ్యానికి యథేచ్ఛగా వాడుకుంటున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసిన కొందరు వ్యక్తులే ఆక్రమణలకు ఆజ్యం పోశారు. ఆ ప్రాంతంపై పట్టుండడంతో రోజుకింత నిర్మాణ వ్యర్థాలను పారపోస్తూ క్రమంగా మూసీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలను చాలావరకు మూసికే తరలించారు. డంపింగ్ చేసేందుకు నగరంలో ఎక్కడా చోటులే దంటూ రాత్రి సమయాల్లో ఇష్టానుసారంగా వ్యర్థాలను డంప్ చేశారు.
స్థలం మాదే పరిహారమివ్వండి..
మూసీని ఆక్రమించిన వారు ఆ స్థలం తమదేనని, కొన్నేళ్లుగా ఉంటున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని భావిస్తున్నారు. తమ స్థలాల వద్ద కాపలా ఉంటూ రివర్‌బెడ్ మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులకు స్థలం తమదేనని చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కాకుండా పరిహారం కావాలని కోరుతున్నారు.
మట్టిపోసి వాణిజ్య సముదాయాలు
మూసీ వెంట మట్టిని పోసి చదును చేసి స్థలాలుగా మార్చారు. ఆయా స్థలాలను వాణిజ్య, వ్యాపారాలకు లీజుకు ఇచ్చారు. అడ్వాన్స్ లక్షల రూపాయలు తీసుకోవడంతోపాటు ప్రతినెలా ఆదాయం పొందుతున్నారు. ప్రధానంగా మూసీ వెంట మూసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో భారీగా షెడ్లు వెలిశాయి. అందులో ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీలు సర్వీసు సెంటర్లను ఏర్పాటు చేశాయి. చైతన్యపురి ఫణిగిరికాలనీ సమీపంలో ఓ వ్యక్తి ఏకంగా క్రికెట్ బాక్స్ మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి ప్రతినెలా లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్కు సమీపంలో మూసీలో ప్రైవేటు బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి గేటు ఎదురుగా ఏకంగా మూసీలోనే పార్కింగ్ దందా సాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ రివర్బైడ్ దాదాపు 2వేల వరకు షెడ్లు, గోదాములు, వ్యాపారాలకు సంబంధించిన సముదాయాలు ఉన్నాయి.
Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి.
కుర్రాళ్లకు సువర్ణావకాశం
For Latest News and Business News click here