Telangana : బీర్లకు బార్లా నిజమే!
ABN , Publish Date - May 29 , 2024 | 06:10 AM
బీరు వార్‌పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలో సరఫరా చేసుకోవడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చినట్లు ఎట్టకేలకు వెల్లడించారు.
తెలంగాణలో సరఫరాకు
సోం డిస్టిలరీస్‌కు అనుమతి
నిబంధనల మేరకే
బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది
రాష్ట్రంలో బీర్లకు కొరత ఉన్నందునే..
20 ఏళ్లుగా ఆ కంపెనీ
దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది
బీఆర్‌ఎస్ హయాంలోనూ
నాలుగేళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే
బీసీఎల్ రోజువారీ కార్యకలాపాలు
మా దృష్టికి రావు: మంత్రి జూపల్లి
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): బీరు వార్‌పై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలో సరఫరా చేసుకోవడానికి మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చినట్లు ఎట్టకేలకు వెల్లడించారు. రాష్ట్రంలో బీరు కొరత నేపథ్యంలోనే కొత్త బ్రాండ్ల సరఫరాకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. కొత్త బ్రాండ్లకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషనే అనుమతి ఇచ్చినట్లు వివరణ ఇచ్చారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోకి కొత్త బీరు బ్రాండ్ల రాకపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొత్త మద్యం బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, ఇప్పటి వరకూ ఎవరికీ అనుమతి ఇవ్వలేదని వారం రోజుల కిందట మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కానీ,
తెలంగాణలో తమ కంపెనీ బ్రాండ్ల సరఫరాకు అధికారికంగా అనుమతి లభించినట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన సోం డిస్టిలరీస్ సోమవారం స్టాక్ మార్కెట్‌కులేఖ రాసింది. ఈ అంశంపై బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. దీనిపై ‘బీర్.. వార్’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ కథనమూ ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు స్పందించారు.
ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని గతంలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ‘‘ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బేవరేజ్ కార్పొరేషన్‌కు ఉంది.
అందులో భాగంగానే సోం డిస్టిలరీ్‌సకు అనుమతి ఇచ్చింది. బీసీఎల్ (బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్) రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు. వాస్తవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయి’’ అని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో హోల్‌సేల్ మద్యం సరఫరాలో భాగంగా కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని, డిమాండ్, సరఫరాను బట్టి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు.
ఆరు వారాలుగా బీరు కొరత ఉన్నందునే..
వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో బీరు కొరత తలెత్తిందని, దాంతో ఆరు వారాలుగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, ఇందులో భాగంగానే కమిషనర్, ఎండీలు సోమ్ డిస్టిలరీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై స్పందించారని వివరించారు. ఆ కంపెనీ 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మిలట్రీ యూనిట్లకు రెండు దశాబ్దాలుగా మద్యం సరఫరా చేస్తోందని తెలిపారు. ‘‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారు.
2020-21లో 50 లిక్కర్ బ్రాండ్లకు, 5 బీరు బ్రాండ్లకు; 2021-22లో 75 మద్యం బ్రాండ్లు; 8 బీరు బ్రాండ్లు; 2022-23లో 122 మద్యం బ్రాండ్లు, 11 బీరు బ్రాండ్లు; 2023-24లో 41 బ్రాండ్ల మద్యం, 9 బ్రాండ్ల బీరుకు అనుమతి ఇచ్చారు’’ అని వివరించారు. ఐఎంఎ్‌ఫఎల్, బీర్ల తయారీ, సరఫరాకు సంబంధించి 97.44 శాతం విదేశీ కంపెనీల చేతిలోనే ఉందని గుర్తు చేశారు. మన దేశానికే చెందిన సోమ్ డిస్టిలరీకి అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. దీన్ని కూడా బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను బీఆర్‌ఎస్ మానుకోవాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.