RB-X: ఈ మార్క్ చూస్తే వణుకుతున్న హైదరాబాదీలు..
ABN , Publish Date - Sep 28 , 2024 | 03:26 PM
మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ‘RB-X’ అనే గుర్తు వేస్తున్నారు. అసలు ఈ RB-X అంటే ఏంటో తెలుసుకుందాం.
హైదరాబాద్: భాగ్యనగరంలో చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి.. తమ ఇంటిని కూల్చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు.. నగరవాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ‘RB-X’ అనే గుర్తు వేస్తున్నారు. సర్వే పేరుతో అనేక ఇళ్లపై ఈ గుర్తు వేశారు.
ముందుగా సర్వే చేపట్టి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా RB-X అని రాస్తున్నారని.. ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లతో వచ్చి.. తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ఈ RB-X అంటే ఏంటో తెలుసుకుందాం.
హైడ్రా అధికారులా?
మూసీ నది పరివాహక ప్రాంతంలో రెండుమూడు రోజులుగా కొందరు అధికారులు పర్యటిస్తున్నారు. మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై RB-X అని పెద్ద అక్షరాలతో పెయింట్ వేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి.. నంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి.. అధికారులపై తిరగబడుతున్నారు. అయితే, మార్కింగ్ వేస్తున్న వారు హైడ్రా అధికారులు కాదు. వారు రెవెన్యూ శాఖకు చెందిన వారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది.
అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. అయితే డబుల్ బెడ్రూమ్‌లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి.. గుర్తించి ఇళ్లపై RB-X అని రాశారు. ఆర్బీఎక్స్ అంటే 'Riverbed Extreme'. అంటే పునరావాసం కల్పించాల్సిన ఇల్లు అని అధికారులు తెలిపారు.
Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here