HYDRA: మూసీ నది సర్వేల వ్యవహారంపై హైడ్రా కీలక ప్రకటన
ABN , Publish Date - Sep 30 , 2024 | 05:59 PM
మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్: మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చివేయాలని సర్కారు నిర్ణయించడం, ఆ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని వివరించారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని, మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని, దీనిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోందని వివరించారు.
హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదు..
కూల్చివేతలు కాదు..చెరువుల పునరుద్దరణ హైడ్రా లక్ష్యమని ఆయన చెప్పారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకేనని ఆయన స్పష్టం చేశారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ‘‘ కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక మాధ్యమాలు గుర్తించాలి. ప్రకృతి వనరుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడడం, వర్షాలు, వరదల సమయంలో రహదారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చర్యలు’’ అనిఆయన వివరించారు.