Share News

10-12 స్థానాలు గెలిస్తే ఏడాదిలోగా కేసీఆర్‌ తెలంగాణను శాసిస్తారు

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:32 AM

బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు

10-12 స్థానాలు గెలిస్తే ఏడాదిలోగా  కేసీఆర్‌ తెలంగాణను శాసిస్తారు

అప్పుడు అధికారులూ.. మాట వింటారు

అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ఓడించుకున్నాం

అధికారం లేక ఊళ్లో సుంకరి కూడా పలకట్లే

పార్టీ కార్యకర్తలతో సమావేశంలో కేటీఆర్‌

వేములవాడ/కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 28: బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రల నుంచి తెలంగాణను కాపాడుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అదే జరిగితే ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్‌ తెలంగాణను శాసించే రోజు వస్తుందని చెప్పారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీల సభ్యులు, ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ జూన్‌ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నందున హైదరాబాద్‌ను కనీసం పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని చేయాలని, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాల్లో స్థానాలు తగ్గించి అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ఇక్కడి అవసరాలకు ఇవ్వకుండా కర్ణాటకు తరలిచేందుకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. ఇలాంటి కుట్రలు సాగకుండా, తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి ఒక్క గులాబీ కండువాకే ఉందన్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ సన్నాసులు నోరు తెరుస్తారా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దును అడ్డుకునేది కేసీఆర్‌ మాత్రమేనని అన్నారు. గత పదేళ్లలో ‘బడే భాయ్‌’ ప్రధాని మోదీ అనేక విధాలుగా ప్రజలను మోసం చేశారన్నారు. నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చి మోసగించారన్నారు. ఇక రాష్ట్రంలో ‘ఛోటా భాయ్‌’ రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారెంటీల పేరుతో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలూ మాయమవుతాయని పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని ప్రజలు ఓడించలేదని, మనల్ని మనమే ఓడించుకున్నామన్నారు. నాయకుల మధ్య విభేదాలు, పంచాయతీలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని, కేవలం 2ు ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. అధికారం లేకపోవడంతో ఊళ్లల్లో సుంకరి కూడా పలకని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రె్‌సకు తొత్తులుగా మారిన అధికారులు, తోకజాడిస్తున్న పోలీసులు మళ్లీ మన మాట వినాలంటే కనీసం 10-12 ఎంపీ సీట్లు సాధించుకోవాలన్నారు. పంచాయితీలు, పగలు పక్కనపెట్టి, పనిచేయాలని కార్యకర్తలను కోరారు.

ఫస్ట్‌ జంప్‌ జిలానీ రేవంత్‌ రెడ్డే

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు రాగానే జూన్‌ 4న మొట్టమొదటి ‘జంప్‌ జిలానీ’ అయ్యేది చోటా భాయ్‌ రేవంత్‌ రెడ్డేనని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని బీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు కరీంనగర్‌, మల్కాజిగిరి, నిజామాబాద్‌, చేవెళ్ల, మరికొన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను రేవంత్‌ రెడ్డి పోటీలో నిలిపారని ఆరోపించారు. జీవన్‌ రెడ్డి కరీంనగర్‌ టికెట్‌ అడిగితే ఆయనకు ఇష్టంలేని నిజామాబాద్‌లో పోటీకి దింపారని, స్థానికంగా ఉండే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారన్నారు. ఇది బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోసం రేవంత్‌ రెడ్డి చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని, అదే జరిగి ఉంటే మన ఇంటి ఆడపడుచును జైలులో పెడతారా అని ఆయన అడిగారు.

బండి సంజయ్‌.. చర్చకు సిద్ధమా?

ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏమీ చేయలేదని కేటీఆర్‌ విమర్శించారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలకు ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదని, ఐదేళ్లలో చేసిన పనులపై చర్చకు సిద్ధమా? అని సంజయ్‌కు సవాల్‌ విసిరారు. సంజయ్‌ ఐదేళ్లలో జడ్పీ, మునిసిపల్‌, మండల సమావేశాలకు హాజరు కాలేదని, చివరకు పార్లమెంట్‌కు కూడా వెళ్లి మాట్లాడేందుకు ఆయనకు ఏ భాషా రాదని ఎద్దేవా చేశారు. శ్రీరాముడు అందరివాడని, మనం కూడా జై తెలంగాణ, జై భారత్‌తో పాటు జై శ్రీరామ్‌ అందామని పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యనే పోటీ ఉందని ఆయన చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 05:32 AM