GruhaJyothi: 200 దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిందే!
ABN , Publish Date - Feb 29 , 2024 | 05:10 AM
గృహజ్యోతి ఉచిత విద్యుత్తు పథకం కేవలం 200 యూనిట్లలోపు వినియోగానికే ఉంటుందని, ఆపైన ఒక్క యూనిట్ వాడకం పెరిగినా.. మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం
ఒక్క యూనిట్ ఎక్కువ వచ్చినా అంతే..
200 యూనిట్లలోపు వినియోగం ఉంటేనే ఫ్రీ
బకాయిలు చెల్లించకున్నా ఉచిత కరెంట్
సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వాలంటున్న అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి (GruhaJyothy) ఉచిత విద్యుత్తు పథకం కేవలం 200 యూనిట్లలోపు వినియోగానికే ఉంటుందని, ఆపైన ఒక్క యూనిట్ వాడకం పెరిగినా.. మొత్తానికి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే.. ఎవరైనా లబ్ధిదారుడు ఒక్క యూనిట్‌ను అదనంగా వాడినా.. 201 యూనిట్లకూ డబ్బు చెల్లించాలి. అంతేకాదు.. 200 యూనిట్లు దాటితే టారిఫ్ మారిపోయి, బిల్లు మొత్తం తడిసి మోపెడవుతుంది. ఆధార్ అనుసంధానం జరిగిన తెల్లరేషన్/ఆహార భద్రత కార్డులున్న వారంతా ఈ నెల విద్యుత్తు వాడకానికి సంబంధించి జీరో బిల్లు(మార్చి 2 నుంచి జారీ చేస్తారు) పరిధిలోకి వస్తారు. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడు ఈ నెల 200లోపు విద్యుత్తు వాడి, జీరో బిల్లు తీసుకున్నా.. వచ్చేనెల ఎక్కువ కరెంటు వాడితే.. బిల్లు చెల్లించాల్సిందే. ఆ పైనెల మళ్లీ 200లోపు యూనిట్ల వినియోగం నమోదైతే.. జీరో బిల్లు జారీ అవుతుంది. ఉత్తర డిస్కమ్(టీఎ్‌సఎన్‌పీడీసీఎల్) కీలక అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పథకం అమలుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిస్కమ్‌లు కోరుతున్నట్లు వివరించారు. బిల్లుల జారీకి ఒక్క రోజే మిగిలి ఉండడంతో.. మార్గదర్శకాలపై అధికారుల్లోనూ ఉత్కంఠ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో బిల్లుల జారీలో కాస్త ఆలస్యం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ పథకం మాదిరిగా..
రాష్ట్రంలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు అమల్లో ఉంది. ఈ పథకంలో వినియోగదారులు ఒక్క యూనిట్ దాటి-- 102 యూనిట్లను వాడినా.. మొత్తం బిల్లు కట్టాలి. ఇదే పథకం మాదిరిగానే గృహజ్యోతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ పథకంలో ఉన్నవారు కూడా ఇకపై గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకోవచ్చు. అయితే.. రజకులకు ఇస్త్రీ/లాండ్రీ షాపులు లేదా దోభీఘాట్‌లకు, క్షురకులకు హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు పథకం అమల్లో ఉంది. వీరు ఒకవేళ 400 యూనిట్లను వాడితే.. మొత్తానికి బిల్లు అనే నిబంధన ఉండదు. 250 యూనిట్లను ఉచితంగా ఇవ్వగా.. మిగతా 150 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాలి. అయితే.. గృహజ్యోతి ఈ కోవలోకి రాదని అధికారులు చెబుతున్నారు.
బకాయిలు ఉన్నా.. గృహజ్యోతి
బకాయిలకు, గృహజ్యోతికి ముడిపెట్టడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే.. తొలుత బకాయిలను చెల్లించాలని వినియోగదారులను కోరనున్నట్లు వివరించారు. తొలుత బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్తు అందించాలనే ప్రతిపాదనను డిస్కమ్‌లు పెట్టినా.. ప్రతికూల స్పందనలు రావడంతో వెనక్కి తగ్గాయి.
ఒక్క యూనిట్ దాటినా టారిఫ్ మారుతుంది
200కు ఒక్క యూనిట్ పెరిగినా.. వినియోగదారుల టారిఫ్ మారుతుంది. అంటే.. 200 యూనిట్లలోపు యూనిట్‌కు రూ.4.80గా ఉండే టారిఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. వేర్వేరు కేటగిరీల టారిఫ్ ఈ కింది విధంగా ఉంది..