వాళ్లు గేమ్ మొదలుపెడితే.. నేను తగ్గేదే ఉండదు!
ABN , Publish Date - Jan 07 , 2024 | 03:44 AM
ఓటుకు నోటు కేసులో జరిగిన పరాభవం మరిచిపోయారా? మరిచిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు.
నాకై నేను మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించను
ప్రజాతీర్పునకు కేసీఆర్ కట్టుబడి ఉంటారనే భావిస్తున్నా
ఆయన విజ్ఞుడనే అనుకుంటున్నా.. రంగస్థలం సిద్ధం చేస్తే తెగబడటమే
అధికారం అండ కోసం కేసీఆర్ బీజేపీతో చేతులు కలపొచ్చు
అలాగైతే మా నెత్తిన పాలు పోసినట్టే.. రాహుల్ వల్లే నాకంత ధైర్యం
హామీలు నెరవేర్చి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతాం
ఏపీ సీఎం జగన్ నాకు ఫోన్ కూడా చేయలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
ఆర్కే: ఓటుకు నోటు కేసులో జరిగిన పరాభవం మరిచిపోయారా? మరిచిపోయే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆ రోజు జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చినప్పుడు తొడగొట్టి.. పడగొడతాం అని సవాలు విసిరారు కదా. ఆ సన్నివేశాన్ని ప్రస్తుతం అందరూ గుర్తు చేసుకుంటున్నారు. తొడగొట్టి పడగొట్టారు. మొన్న ఆస్పత్రిలో కేసీఆర్‌ను పలకరిస్తే.. ఆయన రియాక్షన్ ఎలా ఉంది?
సీఎం: సరే. ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా.. నేను బాధ్యతలో ఉన్నా కాబట్టి పలకరించినా. ఆ రోజు రాత్రి ఆయన పడంగానే నాకు సమాచారం వచ్చింది. అధికారులకు చెప్పి తక్షణమే గ్రీన్‌ఛానల్ (అంబులెన్సు మార్గంలో ఏ వాహనమూ అడ్డు రాకుండా ఏర్పాటు) ఏర్పాటు చేయమని ఆదేశించా.
అసెంబ్లీలో తను కూర్చుండే (ముఖ్యమంత్రి) సీట్లో తనకు అసలు ఇష్టం లేని రేవంత్‌రెడ్డి కూర్చోవడం చూడలేక, కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనేది నాకున్న సమాచారం. ఆయన పడ్డాడని పలకరించడానికి వెళ్లినా పుండు మీద కారం చల్లినట్లు ఉంటుంది కదా? అలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నారా?
మనసులో ఉండొచ్చు. నన్ను అణిచివేయాలనుకుని ఆయన చేసిన అన్ని రకాల ప్రయత్నాలు అందరికీ తెలుసు. ఆ పరిస్థితి నుంచి.. సీఎం హోదాలో నేను వెళ్లి కలవడం అనేది... చాలా భావోద్వేగాలు ఉన్నా, అన్నింటినీ కంట్రోల్ చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించా. నచ్చని వ్యక్తుల ముఖాలు చూడటానికి కేసీఆర్ ఇష్టపడకపోవచ్చు. ఒకరకంగా నాకు ఆయన్ను కలిసి నేను ముఖ్యమంత్రిని అయ్యానని, ఎదురుగా నిలబడి చెప్పే అవకాశం వచ్చినట్లే కదా. విజయం అనే ఆత్మసంతృప్తి ఉంటుంది. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ పార్లమెంట్‌కు వెళ్తే తారసపడే సందర్భం రాకపోవచ్చు. ఓడిపోతడు వందశాతం అని గతంలో చెప్పిన. బరిలో నుంచి తప్పుకోవడం మంచిది అని కూడా చెప్పిన. ఇది జరుగుతుంది.
నిజంగానే అధికారంలోకి వస్తామని నమ్మారా మిత్రమా?
వందశాతం నమ్మినా.
అధికారంలోకి వస్తామని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఇలా చెప్పుకోలేకపోయారు. తేదీ, సమయంతో సహా చెప్పడం అసాధారణం. ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది. రాహుల్‌గాంఽధీ వల్లేనా?
రాహుల్‌గాంధీయే. నేను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని చెప్పి అయ్యాను. ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి అయ్యాను. ఇవి జరగడానికి కారణం రాహుల్‌గాంధీ గారే. ఆయనకు చాలా స్పష్టత ఉంది. నువ్వు అందరినీ కలుపుకొని పోవాలి అని రాహుల్‌గాంధీ చెప్పారు. దాంతో క్లారిటీ ఉండె. కేడర్‌కు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలె. వార్ జోన్‌లో ఉన్నప్పుడు వార్‌ను లీడ్ చేస్తున్నప్పుడు నాదే ఆ బాధ్యత. అందుకనే తేదీలతో సహా ముందే చెప్పా. డిసెంబరు 9వ తేదీన ప్రమాణ స్వీకారం అని చెప్పిన. అయితే, 7వ తేదీనే చేశాం. 9వ తేదీన అసెంబ్లీని ప్రారంభించాం. ఆరు గ్యారంటీల అమలు గురించి కూడా ప్రకటించాం. అసెంబ్లీ సమావేశాల్లో వారికి (ప్రతిపక్షానికి) ఎక్కువ అవకాశం ఇచ్చాం. వాళ్లు పోడియంలోకి వచ్చి అల్లరి చేసినప్పుడు సస్పెండ్ చేస్తామని స్పీకర్ చెబితే... వాళ్లను సస్పెండ్ చేయొద్దు.. మైక్ ఇచ్చి మాట్లాడనివ్వాలి అని చెప్పిన. వాళ్లు చేసిన పాపాలను మనం చెబుతుంటే వినడమే వారికి శిక్ష. కాబట్టి వాళ్లను కూర్చోబెట్టాలి అన్నా. నేను కూడా సభలో కూర్చున్నా. దాంతో బావాబామ్మర్దులిద్దరూ కదలకుండా కూర్చునే పరిస్థితి కల్పించినం.
ఫలితాలు వచ్చిన తర్వాత కొంతమంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు కదా!
నిజమే. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. నేను కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పా. అది ప్రజాస్వామిక ప్రక్రియ. సీఎల్పీ సమావేశంతోపాటు సీపీఐ అభిప్రాయం కూడా తీసుకోమని చెప్పా.
నాకు తెలిసి 49 మంది ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి పేరు చెప్పారు. 8 మంది అధిష్ఠానానికి వదిలేయమన్నారు. నలుగురు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించమన్నారు.
నెంబర్ నాకు తెలియదు. తెలిసినా చెప్పలేను. పార్టీ పరంగా చూసుకున్నా, ఎమ్మెల్యేల పరంగా చూసుకున్నా మనకు ప్లస్. పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం, ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించడం కలిసొచ్చే అంశాలు అని భావించా.
కాంగ్రె్‌సకు వచ్చిన మెజార్టీ చాలా తక్కువ. చిన్న రాష్ట్రం. 119 మంది. మీకు 64, సీపీఐకి ఒకటి. ఒక అర డజను మంది అటు ఇటు అయితే ఖేల్‌ఖతం.
ఇట్లాంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారితీస్తదో ఎవరూ ఉహించలేరు. నేనైతే జానారెడ్డిని మాత్రం కాను. అంతవరకు మీకు క్లారిటీ ఉంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. బాధ్యత ఇచ్చారు. దానికి మాతోపాటు అందరూ గౌరవించాలని కోరుకుంటున్నా. ఒక వేళ తెగపడటం మొదలుపెడి తే..
మీ ముందు ఎవరూ నిలబడలేరంటారు. కేసీఆర్‌కు సమఉజ్జీ కదా.
నిలబడలేరని అనను. కానీ, ఆ పరిస్థితే వస్తే మాత్రం నేనైతే ఎక్కడాతగ్గేది ఉండదు.
కేసీఆర్ కూడా 2014లో తక్కువ మెజార్టీ ఉంది.. సుస్థిర ప్రభుత్వం కోసం అంటూ అన్ని పార్టీల వారిని చేర్చుకున్నారు.
ఆయన ఒక కారణం చూపించారు కానీ తన అరాచకత్వానికి ఎవరూ అడ్డు ఉండకూడదనే విధానంతో అలా చేశారు. రాజశేఖర్‌రెడ్డి గారికి 2009లో 153 సీట్లు వచ్చినప్పుడు... 148 కదా నెంబర్ గేమ్..
అప్పటికే ఆయన (వైఎస్) ప్లాన్ చేశారు కదా. ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టీఆర్‌ఎస్ నుంచి కొంతమందిని తీసుకోవడానికి అంతా స్కెచ్ వేసుకున్నారు. కానీ, నేను మాత్రమే అనే దానికి ప్రకృతి ఒప్పుకోదు.
ఔను ప్రకృతి ఒప్పుకోదు. కేసీఆర్ అన్ని పార్టీల నాయకులను తీసుకొని పోయినా పదేళ్ల తర్వాత నిలదొక్కుకున్నారా? చంద్రశేఖర్‌రావు దేశాన్ని కాదు... ప్రపంచాన్ని ఏలుతారు.. ప్రధానమంత్రియే కాదు.. చంద్రమండలానికి కూడా రాజు అవుతాడని ఆయన చుట్టూ ఉన్నవారు చెప్పారు కదా. ఏమైంది. యశోదా ఆస్పత్రిలో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా.
మీ పార్టీలో నుంచి కొంత మందిని లాగేయడానికి చూస్తే.. ప్లాన్‌ఏ, ప్లాన్ బీ?
గేమ్ మొదలుపెడితే ఎటు దారి తీస్తుందో ఆ రోజే తెలుస్తుంది. ఇట్లైతే అట్లయితది.. అట్లైతే ఇట్లయితది అని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఇవన్నీ చెబితే అహంభావం అనుకుంటారు. లేకపోతే, చూడబ్బా 30 రోజులు కూడా కాలేదు ఆ బలుపు మాటలు ఏందని చర్చకు దారితీస్తుంది. ఆ చర్చలకు నేను పోదల్చుకోలేదు. చంద్రశేఖర్‌రావు విజ్ఞుడు అని భావిస్తున్నా. ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటారని భావిస్తున్నా. పిల్లలు, అల్లుడు దుందుడుకుగా ప్రవర్తిస్తే చంద్రశేఖర్‌రావే నిలువరిస్తారని అనుకుంటున్నా. అలా కాకుండా.. రంగం సిద్ధం చేసి రంగస్థలాన్ని తయారుచేస్తే..
కాలు దువ్వుదామంటే దువ్వుదామనుకోవడమే..
నాకు కొత్తగా పోయేది ఏముంది సార్.. చెప్పండి.. తెలంగాణ రాష్ట్రానికి రెండో సీఎం రేవంత్ రెడ్డి అనేది కేసీఆర్‌కి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, వాళ్ల కుటుంబానికి కష్టమైనా.. కొంతమందికి అసలే నచ్చక పోయినా సీఎంను అయినా కదా. 30 రోజులు నేను నా బాధ్యతలు నెరవేర్చి మీ ముందుకు వచ్చి కూర్చున్నా కదా. ఈ 30 రోజుల్లో నేను బ్యాలెన్స్‌గా వ్యవహరించానని మీరు భావిస్తున్నారు కదా. ఇక ముందు కూడా నేను ఇలాగే ఉందామనుకుంటున్నా.
ఉంటే మంచిది..
ఉంటే అందరికీ మంచిది. నిజంగా ప్రజల తీర్పు కోసం వెళ్లినప్పుడు కొట్లాడు. రేపు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి. కొట్లాడు. నువ్వేం గెలుస్తావ్, నేనేం గెలుస్తా, మోదీ ఏం గెలుస్తారు, కిషన్‌రెడ్డి ఏం గెలుస్తారు.. లెట్ దెం డిసైడ్ (ప్రజలే నిర్ణయించనీ).
పార్లమెంట్ ఎన్నికలు మీకు మెయిన్ టెస్ట్. కాంగ్రె్‌సకు మెజార్టీ స్థానాలు గెలిపించుకోలేని పక్షంలో సీఎంగానూ, పార్టీలోనూ మీరు బలహీనమవుతారు కదా?
అత్యంత కీలక బాధ్యత. దాని మీద దృష్టి పెడుతున్నాం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలిస్తామని ప్రకటించి.. ఇప్పటికే రెండు అమలు చేశాం. మిగతా వాటికి ధరఖాస్తులు తీసుకున్నాం. ఇవాల్టితో ముగిశాయి. నిన్నటికి ఒక కోటి రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ కూడా 15 లక్షలు వచ్చి ఉంటాయి. వీటన్నింటినీ అమలు చేసి ఒక పాజిటివ్ వైబ్‌తో ఓట్లు అడగాలని నేను అనుకుంటున్నా.
బీజేపీ బీఆర్‌ఎస్ లోక్‌సభకు పొత్తు పెట్టుకుంటే?
పరోక్షంగా పొత్తు పెట్టుకుంటారు. ప్రత్యక్షంగా పెట్టుకోరు. ప్రత్యక్షంగా పెట్టుకుంటే మా నెత్తిన పాలు పోసినట్లే. ప్రజలకు స్పష్టత వస్తుంది. ముసుగు తీసినట్లు. కర్ణాటకలో ఏమైంది.. అసెంబ్లీ ఎన్నికల వరకు జేడీఎస్ బీజేపీ దూరంగా ఉన్నాయి. ఎన్నికల్లో దూరంగా ఉండి అధికారం సాధించాలనుకున్నారు. విడిపోయి కొట్లాడినట్లు చేశారు. కాంగ్రె్‌సకు మెజారిటీ వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పని చేస్తామంటున్నారు. కానీ, కర్ణాటకలో మైనార్టీలు, లెఫ్ట్ అంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ కలిస్తే కేసీఆర్ ఏం చెప్పి ఓట్లు అడగాలి. మోదీని ప్రధాని చేయాలని అడిగితే.. నీకెందుకయ్యా, మోదీని ప్రధాని చేయాలనుకుంటే ఆయనకే ఓటు వేస్తాం నీకెందుకు వేయాలి అనుకుంటరు. రాహుల్‌కి ఓటేయాలని అడిగే నాకు ఓట్లు వేస్తారు. కేసీఆర్ చివరికి ఆటలో అరటి పండుగా మిగిలిపోతారు.
నేను ఫౌల్‌గేమ్ మొదలుపెట్టను. తప్పుడు పనులను ప్రొత్సహించను. ఒకవేళ వాళ్లు గేమ్ మొదలు పెట్టారనుకో.. రేసులో పరిగెత్తడం అనేది ఇక స్టార్ట్ అయితది కదా ఎవరికైనా.
ఈ పిలగాడు చేస్తడు.. ఈ పిలగాడు కష్టపడతడు.. ఇతనికి అవకాశం ఇస్తే రాష్ట్రానికి మేలు జరుగుతది.. అని ప్రజలు అండగా ఉంటే ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కోగలం. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మా వద్ద పెట్టుబడులు, అధికా రం, దుర్వినియోగం ఏమీ లేవు కదా. నల్లప్యాం టు, తెల్లషర్టు వేసుకుని ఊరూరూ తిరగడం, ప్రజలతో కలవడం. వారి తో (బీఆర్‌ఎ్‌సతో) పోల్చితే మనదగ్గర మందీమార్బలం లేదు కదా...
ఫిరాయింపుల వంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారితీస్తదో ఎవరూ ఉహించలేరు. నేనైతే జానారెడ్డిని మాత్రం కాను. అంతవరకు మీకు క్లారిటీ ఉంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. బాధ్యత ఇచ్చారు. దానికి మాతోపాటు అందరూ గౌరవించాలని కోరుకుంటున్నా. ఒక వేళ తెగపడటం మొదలుపెడి తే.. నేనైతే ఎక్కడాతగ్గేది ఉండదు.
పదేళ్లు సీఎంగా ఉండగా ఆయనకు అంబులెన్స్ అవసరం పడలేదు. దిగిపోగానే అంబులెన్స్ అవసరం పడింది. తక్షణమే ఆరోగ్యశాఖ కార్యదర్శిని, డీజీని అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పా.
పొత్తు లేకపోతే మీరిద్దరు కలిసి
(బీఆర్‌ఎ్‌సను) మింగేస్తారు కదా. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు మీరు పవర్‌లో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. మీ ఇద్దరి మధ్య బీఆర్‌ఎస్ పరిస్థితి?
మీరు చెప్పింది ఆలోచించదగ్గదే. ఏదో ఒక అధికారం అండ లేకుండా కాంగ్రె్‌సను ఎదుర్కోలేమనే భావన కేసీఆర్‌లో కనిపిస్తోంది. ఆ భావన బీజేపీకి దగ్గర చేయడానికి అవకాశం ఉంది. మీరు చెప్పాక ఆ లాజిక్ నాకు అర్థమవుతోంది.
ప్రాంతీయ పార్టీలు బీజేపీని కాదని బతకలేని పరిస్థితులు వచ్చాయి.
ఆ ప్రమాదం ఉంది. నెత్తి మీద వేలాడుతున్న కత్తి. కేంద్రం అండ ఉంటే ఎదుర్కోవచ్చనే భావన, కొన్ని బాధలు తప్పుతాయనే అభిప్రాయం ఏపీలో కూడా ఉంది కదా!
ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు అది తప్పని పరిస్థితి.
బీజేపీతో కేసీఆర్ కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. బీజేపీకి కూడా ఇక్కడ పెద్ద హోప్ లేదు కదా. ఏపీలో ఓ నమ్మకమైన పార్టనర్, తెలంగాణలో ఓ నమ్మకమైన పార్టనర్ ఉంటే దక్షిణాదిలో వాళ్ల నంబర్ యాడ్ అవుతది. కేసీఆర్‌తో వాళ్లకు ఉన్న పాత మిత్రుత్వం, బంధుత్వం కూడా పొత్తుకు అవకాశం కలిగిస్తుంది.