ప్రభుత్వ ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Jan 10 , 2024 | 12:00 AM
నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ ప్లాట్లపై అక్రమార్కుల కన్నుపడింది. పేదలకు అందాల్సిన ప్లాట్లు అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణదారుల పాలవుతున్నాయి.
మర్రిగూడ, జనవరి 9 : నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ ప్లాట్లపై అక్రమార్కుల కన్నుపడింది. పేదలకు అందాల్సిన ప్లాట్లు అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణదారుల పాలవుతున్నాయి. నకిలీ పత్రాలతో ప్లాట్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు నీరుగారుతోంది. మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలోని 724, 725 సర్వే నెంబర్లలోని 9.30 ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాల కోసం ప్లాట్లతో లేఅవుట్ చేసింది. మొత్తం 293 ప్లాట్లు సిద్ధం చేసి అందులో 50 మంది నిరుపేదలకు ప్లాట్లను పంపిణీ చేశారు. మిగిలిన 243 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ ప్లాట్లపై అక్రమార్కుల కన్ను పడింది. గ్రామానికి చెందిన కొందరు దళారులుగా మారి నకిలీ పట్టాలు సృష్టించి, ప్లాట్లను ఆక్రమించారు. మరికొందరు కొనుగోలుచేసిన ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టారు. కొన్నాళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ఒకటి ఆర నుంచి మొదలై అన్ని ప్లాట్లు ప్రస్తుతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ వ్యవహారంపై 2020లో విచారణ చేపట్టి, న్యాయం చేయా లని పలుమార్లు గ్రామస్థులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా ప్లాట్ల ఆక్రమణలపై ఈ నెల 1వ తేదీన గ్రామానికి చెందిన కొంతమంది తహసీల్దార్ శ్రీనివా్‌సకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారయంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిరుపేదలకు ప్రభుత్వ ప్లాట్లు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కబ్జాదారులు ఇష్టానుసారంగా రెండు, మూడు ప్లాట్లను ఆక్రమించారు. వెంటనే ఆక్రమణలపై విచారణ చేపట్టి నిరుపేదలకు న్యాయం చేయాలి.
- శ్రీరామదాసు శ్రీనివాస్
అధికారులు పట్టించుకోవడం లేదు
గ్రామంలో నిరుపేదల కోసం సిద్ధం చేసిన ప్రభుత్వ ప్లాట్లను కొంత మంది ఆక్రమించారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. ఇష్టానుసారం ప్లాట్లు ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది. వెంటనే అధికారులు ప్రభుత్వ ప్లాట్లను స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలి.
- మాడం శాంతమ్మ, సర్పంచ
ఆక్రమణదారులపై చర్యలు చేపడతాం
యరగండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్లాట్లను కొంతమంది కబ్జా చేస్తూ ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చా యి. వాటిపై త్వరలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాస్, తహసీల్దార్