సరిహద్దుల్లో.. అప్రమత్తం
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:37 PM
ఓ వైపు ఆపరేషన్ కగార్, మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో నష్టాలు, ఇంకో వైపు మహారాష్ట్రలో ఎన్నికల హడావిడి లాంటి పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ల్లో చురుగ్గా కదులుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటె లిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న సూ చనలు కనిపిస్తుండటంతో సరిహద్దు జిల్లాల పోలీసులు పూర్తిస్థాయి లో అప్రమ త్తమయ్యా రు.
మావోయిస్టుల కదలికలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసుల అలెర్ట్
ఆపరేషన్ కగార్‌తో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో దళాలపై పెరిగిన ఒత్తిడి
‘మహా’ ఎన్నికల వేళ అలజడికి అవకాశం ఉందని అనుమానం
ధ్రువీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
రంగంలోకి దిగిన గ్రేహౌండ్స్ బృందాలు
ఇటీవలే సరిహద్దు జిల్లాల ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)
ఓ వైపు ఆపరేషన్ కగార్, మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో నష్టాలు, ఇంకో వైపు మహారాష్ట్రలో ఎన్నికల హడావిడి లాంటి పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ల్లో చురుగ్గా కదులుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర ఇంటె లిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం లో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న సూ చనలు కనిపిస్తుండటంతో సరిహద్దు జిల్లాల పోలీసులు పూర్తిస్థాయి లో అప్రమ త్తమయ్యా రు. ముఖ్యం గా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న తెలంగా ణలోని భద్రా ద్రి-కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశించి నట్టు సమాచారం. ఇందు కు సంబంధించి ఇప్పటికే సంబంధిత సరిహద్దు జిల్లాల పోలీసులతో మహారాష్ట్రలోని సరి హద్దు జిల్లాల ఉన్నతాధి కారులు పక్షం రోజుల క్రితమే కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలకు తగ్గట్టుగానే ఇటీవల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వట్టేవాగు అటవీ ప్రాంతంలో ఆ పార్టీ డంపు వెలుగులోకి రావడం కలకలం రేపింది. అంతేకాదు ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసు లు అదుపులోకి తీసుకోవడం ఈ సందర్భంగా గమనార్హం. 2026 నాటికి మావోయిస్టు పార్టీని తుద ముట్టించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు దళాలపై భీకర దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. అటు ఛత్తీస్‌గఢ్, ఇటు మహా రాష్ట్ర తెలంగాణ పోలీసులు సమన్వయంతో మావోయిస్టు దళాల ఆచూకీ కనిపెడుతుం డటంతో ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో పోలీసుల దాడుల నుంచి రక్షించుకోవడం కోసం మావో యిస్టు దళాలు సరిహ ద్దులు దాటి పొరు గునే ఉన్న ములు గు, భూపాలపల్లి, మంచిర్యా ల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. మావోయి స్టుల కదలికలకు సంబంధించి మంచిర్యాల కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర నిఘా సంస్థతో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించ డంతో సరిహద్దు జిల్లాల పోలీసులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో స్పెషల్ పోలీసు బృందాలు, గ్రేహౌండ్ దళాలను రంగంలోకి దింపి అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు పార్టీకి దండకారణ్యం కీలకమైనది కావడంతో ఇక్కడ వారు తమ ఉనికిని చాటుకునేందుకు ఏవైనా అలజ డులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ సరిహద్దు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించి ఎస్పీల ను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశా లు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 15 రోజుల క్రితం సరిహద్దు జిల్లాల పోలీసులతోపా టు మహారాష్ట్ర ఉన్నతాధికారులు సుదీర్ఘంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మావోయిస్టు దళాలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న పక్కా సమాచారం తోపాటు ఇందులో కేంద్ర కమిటీ అగ్రనాయకులు కూడా ఉన్నట్లు అనుమా నిస్తున్నారు. అయితే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో పెరుగు తున్న ఒత్తిడి కారణంగా షెల్టర్ కోసం తెలంగాణలోకి ప్రవేశించారా... లేక మహారాష్ట్ర ఎన్నికల వేల ఏదైనా అలజడి కోసం ప్రయత్నిస్తున్నారా? అనే అంశంపై పోలీసు వర్గాలు క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వారి వ్యూహం ఏమిటనేది పసిగట్టేందుకు ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగి ఇన్‌ఫార్మర్ల నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
వరస నష్టాలతో ఉక్కిరిబిక్కిరి
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఇటీవల జరిగిన వరస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో వందల సంఖ్యలో కేడర్‌ను కోల్పోయి ఆ పార్టీకి భారీగా నష్టం వాటిల్లింది. ఈ కారణంగానే మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవే శించి పార్టీ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ అడవి ప్రాంతంలో కేంద్ర బలగాల సంఖ్య రోజురోజుకూ పెరగడం, ఇటు ఇంద్రావతి పరిసరాల్లోనూ మహారాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా నిఘా, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వంటి అంశాలు మావోయిస్టు దళాల ఉనికికి ముప్పుగా పరిణమించాయని ఆ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు అడుగులు ముం దుకు, ఒక అడుగు వెనక్కి అనే మూల సూత్రాన్ని ఆధారంగా తెలంగాణను షెల్టర్ జోన్‌గా మార్చుకు నేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించించి ఉంటుందని భావిస్తున్నారు. ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ కోల్‌బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్, ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఇటీవల హెచ్చరికలు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ అంశాలన్నీ విశ్లేషించి చూస్తే మావోయిస్టులు ఉన్నట్లుండి తెలంగాణ ప్రాంతంలో కార్యకలాపాలు పెంచడం వెనక వ్యూహం ఏమిటనేది ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసుల దృష్టిని మరల్చి ఏదైనా భారీ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మావోయిస్టు దళాల కదలికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్న నేతలకు భద్రతను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెల్లంపల్లి శాసన సభ్యుడు గడ్డం వినోద్‌కు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు రావడంతో ఆయనకు భద్రతను పెంచారు. అలాగే ఇటు భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం, కాటారం, మల్హర్, మంథని ప్రాంతాలకు చెందిన పలువురు అధికార, విపక్ష నేతలకు కూడా లేఖలు విడుదల కావడంతో వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.