Share News

ప్రాణాలు తీస్తున్న ఎండలు

ABN , Publish Date - May 05 , 2024 | 04:59 AM

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ, ఉక్కపోత, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఎండల వల్ల అస్వస్థతకు గురై, వడదెబ్బ బారిన పడి మరణిస్తున్న వారి

ప్రాణాలు తీస్తున్న ఎండలు
వేసవి తాపానికి తాళలేక పైప్‌లైన్‌ నీటి వద్దకు చేరిన పిచ్చుక

ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు సహా వడదెబ్బకు 15 మంది మరణం

కొనసాగుతున్న ఎండల తీవ్రత

కరీంనగర్‌ జిల్లాలో 46.8 డిగ్రీలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఎండ, ఉక్కపోత, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ఎండల వల్ల అస్వస్థతకు గురై, వడదెబ్బ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. ఎన్నికల విధులకు హాజరైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సహా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం యాటకార్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లకావత్‌ రామన్న.. సిద్దిపేటలో శుక్రవారం జరిగిన ఎన్నికల శిక్షణకు హాజరయ్యారు. ఎండతీవ్రతకు అక్కడ అస్వస్థతకు గురై శనివారం మరణించారు. అలాగే, యాదాద్రి భువనగిరి జిల్లా జమ్మాపురం గ్రామపంచాయతీలో వాటర్‌మెన్‌గా పనిచేస్తున్న మాదాసు కసప రాజు (65) గ్రామానికి నీటిని సరఫరా చేస్తుండగా వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పలువురు ఉపాధి కూలీలు, రైతులు వడదెబ్బకు బలైపోయారు. కాగా, మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం లక్ష్మీపురంలో శనివారం సాయంత్రం సుమన్‌(26) పిడుగుపాటుకు గురై చనిపోయాడు.


వీణవంకలో అత్యధికంగా 46.8

రాష్ట్రంలోనే అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా వీణవంకలో శనివారం 46.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనూ, ఈ సీజన్‌లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత. ఆ తర్వాత నల్లగొండ జిల్లా తెల్లేవర్‌పల్లి, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌తోపాటు వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 46.3 డిగ్రీలు, ములుగులో 46.2 డిగ్రీలు, జనగామ, వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కేతేపల్లి, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాల, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిల, మహబూబాబాద్‌ జిల్లాలో, హనుమకొండలో 46.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌, చందానగర్‌లో శనివారం అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

ఎండలు మండిపోతుండడంతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగం భారీగా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏప్రిల్‌ 30న అత్యధికంగా 4,214 మెగావాట్ల డిమాండ్‌ రికార్డయింది. మే 3న ఏకంగా 89.71 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. గతేడాది మే 3న నమోదైన 58.34 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో పోలిస్తే ఇది 53.7 శాతం అధికం. శనివారం రాష్ట్రమంతటా 10,880 మెగావాట్ల డిమాండ్‌ రికార్డయ్యింది. ఇందులో దక్షిణ డిస్కమ్‌ వాటా 6,516 మెగావాట్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ డిమాండ్‌ 4,209 మెగావాట్లుగా ఉంది. మే నెలాఖరు దాకా విద్యుత్‌ డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉండడంతో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే ఇంజనీర్లంతా క్షేత్రస్థాయికి వెళ్లాలని ద క్షిణ డిస్కమ్‌ సీఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం ఓ సమీక్ష నిర్వహించిన సీఎండీ... వేసవి సీజన్‌ ముగిసే దాకా ప్రతీ 11 కేవీ ఫీడర్‌కు ఒక ఇంజనీర్‌ను ఇన్‌చార్జిగా నియమించాలని తెలిపారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - May 05 , 2024 | 04:59 AM