అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:35 AM
వైన్‌షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
గుర్రంపోడు, కొండమల్లేపల్లి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వైన్‌షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కొండమల్లేపల్లి సీఐ ధనుం జయ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబరు 12న నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలకేంద్రంలోని ఆదిత్య వైన్స్‌లో అర్ధరాత్రి సుమారు రూ.10.80లక్షల నగదు చోరీకి గురైందని వైన్‌షాప్ యజమాని నర్సింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేలిముద్రల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని కాపువీధిచెరువుకట్ట నివాసి బిస్తు రమేష్‌గా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ఎస్పీ శరత్ చంద్రపవార్, దేవ రకొండ డీఎస్పీ గిరిబాబు పర్యవేక్షణలో నల్లగొండ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సోమనర్సయ్య, కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు బిస్తు రమేష్ బుధవారం ఉదయం కొండమల్లేపల్లి బస్టాండ్‌లో తిరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు సీఐ ధనుంజయ, గుర్రంపోడు ఎస్‌ఐ పసుపులేటి మధు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, కిరణ్‌బాబు, దశరథ అతనిని అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ను విచారించగా రాష్ట్ర వ్యాప్తంగా 20 వైన్ షాపుల్లో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టు సీఐ తెలిపారు. అతని వద్ద రూ.1.85లక్షల నగదు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అభినందించి రివార్డులు అందజేశారు.