Share News

TS News: ఒక్క పిల్లర్‌ కుంగితే ఇంత రాద్ధాంతమా? మాపై పగ తీర్చుకోండి.. కానీ రైతులకు నీళ్లివ్వండి

ABN , Publish Date - Mar 02 , 2024 | 03:19 AM

‘‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. వంద అంకాలతో కూడుకున్న మహోన్నత ప్రాజెక్టు. ఒక్క పిల్లర్‌ కుంగితేనే కాంగ్రెసోళ్లు రాద్ధాంతం చేస్తున్నారు.

 TS News: ఒక్క పిల్లర్‌ కుంగితే ఇంత రాద్ధాంతమా? మాపై పగ తీర్చుకోండి.. కానీ రైతులకు నీళ్లివ్వండి

మాపై పగ తీర్చుకోండి.. రైతులకు నీళ్లివ్వండి

కాళేశ్వరం వంద అంకాల్లో మేడిగడ్డ ఒకటి

చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు

ప్రాజెక్టే నిష్ఫలమైనట్లు ప్రచారం చేస్తున్నారు

మరమ్మతులు చేసి నీళ్లివ్వొచ్చని ఇంజనీర్లు

చెప్తున్నా సర్కార్‌ పట్టించుకోవట్లే: కేటీఆర్‌

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని

రేవంత్‌ కుట్ర: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్‌ ‘చలో మేడిగడ్డ’లో ఉద్రిక్తత

గేటును తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు

కేటీఆర్‌ బృందానికి కాంగ్రెస్‌ నిరసన సెగ

వరంగల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు. వంద అంకాలతో కూడుకున్న మహోన్నత ప్రాజెక్టు. ఒక్క పిల్లర్‌ కుంగితేనే కాంగ్రెసోళ్లు రాద్ధాంతం చేస్తున్నారు. చిన్న సమస్యను భూతద్దంలో చూపుతూ మొత్తం ప్రాజెక్టే నిష్పలమైనట్లు ప్రచారం చేస్తున్నారు. రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మాపై పగ ఉంటే తీర్చుకోండి. కానీ, రైతులకు మాత్రం సాగు నీరు ఇవ్వండి’’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ‘‘చలో మేడిగడ్డ’’లో భాగంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో బయలుదేరిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు... సాయంత్రం 4.40 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో పగుళ్లు ఏర్పడి.. కుంగిపోయిన 20వ పిల్లర్‌ను పరిశీలించిన తర్వాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 1.6 కిలోమీటర్లు పొడవున్న మేడిగడ్డ బ్యారేజీలో 50మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఏర్పడితే దాన్ని పెద్దదిగా చూపిస్తున్నారని ఆరోపించారు. మరమ్మతు చేసుకుని బ్యారేజీని వాడుకోవచ్చని ఇంజనీర్లు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకొనైనా సరే వానాకాలంలోపు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కరీంనగర్‌, ఇతర జిల్లాల్లో నీరు లేక పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వం నీటిని ఎత్తిపోస్తే రైతులకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ నిపుణులతో కమిటీ వేసి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, నిపుణుల సలహాలు తీసుకుని బ్యారేజీని పునరుద్ధరించాలని సూచించారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు ప్రాజెక్టులు రెండు సార్లు కొట్టుకుపోయాయని, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో లీకేజీలు వచ్చాయని గుర్తు చేశారు. కానీ, ఆయా అంశాలపై తామెప్పుడూ రాజకీయం చేయలేదని అన్నారు. ఇది ప్రారంభమేనని, కాళేశ్వరం పరిధిలోని మిగతా ప్రాంతాల్లో తమ పార్టీ పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.

అన్నారంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ నుంచి నుంచి అన్నారం బ్యారేజీకి బయలుదేరి వెళ్లిన బీఆర్‌ఎస్‌ బృందం.. అక్కడ లీకేజీలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం అక్కడే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణలో కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేసి బీఆర్‌ఎ్‌సను పడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. గతంలో ప్రగతిభవన్‌ను బాంబులతో పేలుస్తామన్న రేవంత్‌.. ఇప్పుడు కేసీఆర్‌నే లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎ్‌సను పడగొట్టాలంటే కాళేశ్వరాన్ని పడగొట్టాలన్నట్టుగా సీఎం వ్యవహార శైలి ఉంది’’ అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర లేని రేవంత్‌.. కనీసం పరిపాలనైనా సరిగ్గా చేయాలని సూచించారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదన్నారు. కాంగ్రెస్‌ గొప్పగా చెప్పుకొనే ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులో ఓ సర్వేతోపాటు మొబిలైజేషన్‌ పేరిట రూ.1460 కోట్ల బిల్లులు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, 20లక్షల ఎకరాలకు నీరు అందించామని స్పష్టం చేశారు. చెరువులు, కాల్వలకు గోదావరి నీటిని అనుసంధానం చేశామని, ఎండకాలంలోనూ చెరువులు మత్తళ్లు పోశాయని గుర్తు చేశారు.

తమపై ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదని, రైతు ప్రయోజాలను దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజీని వర్షాకాలంలోపు మరమ్మత్తులు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌.. ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కానీ, తాము మేడిగడ్డకు రాగానే మీడియా సమావేశం పెట్టి మేడిగడ్డను రిపేరు చేపిస్తామని చెప్పారని, ఇది తమ పాక్షిక విజయమని పేర్కొన్నారు. దెబ్బతిన్న పిల్లర్లను మరమ్మత్తు చేయాల్సింది పోయి రాజకీయ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే వర్షాకాలంలో వరదలొచ్చి బ్యారేజీకి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సాంకేతిక అడ్డంకులు ఏర్పడడం వల్లే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరానికి అనుమతులు లేవంటూ మంత్రి ఉత్తమ్‌ అబద్ధాలు చెబుతున్నారంటూ.. అనుమతులకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత..

బీఆర్‌ఎస్‌ నేతల మేడిగడ్డ బ్యారేజీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు తమనూ బ్యారేజీపైకి అనుమతించాలంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యారేజీ వైపునకు దూసుకురాగా పోలీసులు ప్రధాన గేటును మూసివేశారు. కానీ పోలీసు బందోబస్తు తక్కువగా ఉండటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు గేటును నెట్టివేసి, లోపలకు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతో పలువురు మహిళ కార్యకర్తలు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

పేలిన బస్సు టైర్‌..

లింగాలఘణపురం: మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఏఆర్‌01టీ0752 నంబరు గల బస్సు వెనుకవైపు టైరు పెద్ద శబ్దం పేలిపోవడంతో బస్సులో ఉన్నవారందరూ భయాందోళనకు గురయ్యారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకోగా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

బీఆర్‌ఎస్‌ నేతలకు నిరసన సెగ

మేడిగడ్డ పర్యటనకు బయలుదేరిన బీఆర్‌ఎస్‌ నాయకులకు హసన్‌పర్తి మండలం దేవన్నపేట వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి నిరసన ఎదురైంది. ‘గో బ్యాక్‌ బీఆర్‌ఎస్‌.. గో బ్యాగ్‌ కేటీఆర్‌’ అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య కాన్వాయ్‌ ముందుకు సాగింది. కాగా, దామెర క్రాస్‌ వద్ద పోలీసుల చేతిలో గాయపడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కేటీఆర్‌ పరామర్శించారు. అక్కడే పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్‌తో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, బాధితులను గృహ నిర్బంధంలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండదని, ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.

Updated Date - Mar 02 , 2024 | 06:28 AM