Share News

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:44 AM

జూబ్లీహిల్స్‌లో 2022లో కారు ప్రమాదంతో ఓ చిన్నారి మరణం, ఇద్దరు తీవ్ర గాయాలపాలవ్వడానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ అలియాస్‌ సాహిల్‌ బెయిల్‌ కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.

Road Accident Case: జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌ కేసు..ముందస్తు బెయిల్‌కు రాహిల్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో 2022లో కారు ప్రమాదంతో ఓ చిన్నారి మరణం, ఇద్దరు తీవ్ర గాయాలపాలవ్వడానికి కారకుడైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ అలియాస్‌ సాహిల్‌ బెయిల్‌ కోసం బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. రాహిల్‌ గత ఏడాది ప్రజాభవన్‌ వద్ద జరిగిన ప్రమాదం కేసులోనూ నిందితుడే. పంజాగుట్ట కేసులో తన స్థానంలో మరో వ్యక్తిని అరెస్టు చేయించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే..! ఆ కేసులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లతోపాటు.. 15 మంది జైలుపాలవ్వగా, రాహిల్‌ దుబాయ్‌ పారిపోయాడు. పోలీసులు అతణ్ని వెనక్కి రప్పించి, అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే 2022 నాటి జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులోనూ రాహిల్‌ నిందితుడని తేల్చారు.


జూబ్లీహిల్స్‌ కేసులో పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే ప్రమాదం ఉందని గుర్తించిన రాహిల్‌.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తన తండ్రి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అని, రాజకీయ కక్షతోనే పోలీసులు తనను టార్గెట్‌గా చేసుకున్నారని రాహిల్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. పాత కేసును చూపుతూ తన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించాడు. ఇటీవల ఇదే హైకోర్టు తనను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఆదేశాలిచ్చిందని, ముందస్తు బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించిందని గుర్తుచేశాడు. ఈ పిటిషన్‌ త్వరలో హైకోర్టు ఎదుట విచారణకు రానుంది.

Updated Date - Jun 13 , 2024 | 03:44 AM