Share News

Judicial Commission on Districts : జిల్లాలపై జ్యుడీషియల్‌ కమిషన్‌

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:29 AM

కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Judicial Commission on Districts : జిల్లాలపై జ్యుడీషియల్‌ కమిషన్‌

  • సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి సారథ్యంలో ఏర్పాటు

  • జిల్లాల విభజన సరిగా జరగలే.. కమిషన్‌తో శాస్త్రీయ అధ్యయనం

  • అసెంబ్లీలోనూ చర్చిస్తాం.. వందరోజుల్లోపు మంత్రివర్గ విస్తరణ

  • మైనారిటీల్లో ఒకరికి, కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం

  • నామినేటెడ్‌ పదవులు ఈ నెల 31 లోపు భర్తీ చేస్తాం

  • రైతు రుణమాఫీకి నిధుల కోసం కార్పొరేషన్‌

  • రైతుబంధులో మార్పులపై అసెంబ్లీలో చర్చిస్తాం

  • కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం

  • గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టారు

  • కేసీఆర్‌ను పరామర్శించాలని రాహులే చెప్పారు

  • ఏపీతో పరిష్కరించుకోవల్సినవి చాలా ఉన్నాయి

  • జగన్‌ మర్యాదకు కూడా ఫోన్‌ చేయలేదు

  • షర్మిల ఏపీలో కాబోయే పీసీసీ అధ్యక్షురాలు

  • పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది

  • బిగ్‌ డిబేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను కూడా అడ్డగోలుగా ఏర్పాటు చేశారని అన్నారు. దీనిని సరిదిద్దేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి పునర్విభజన చేపడతామని చెప్పారు. శనివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై రేవంత్‌ స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణ, కేంద్రంతో సంబంధాలు, పార్టీ వ్యవహారాలు వంటి వివిధ అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు సీఎం శుభవార్త చెప్పారు. ఈ ఏడాది డిసెంబరులోపే రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగానే 22 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకాలపై స్పష్టత రాగానే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. నామినేటెడ్‌ పదవుల్లో నియామకాలను ఈ నెలాఖరులోపే పూర్తి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ చేపడతామని, మైనారిటీ వర్గం నుంచి ఒకరిని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని అన్నారు. వందరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపుల కోసం బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే తాను ఎక్కడా తగ్గబోనని, అది ఎక్కడికైనా దారితీసే అవకాశం ఉంటుందని చెప్పారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంగా సత్సంబంధాలను కోరుకుంటున్నానని, పార్టీ పరంగా మాత్రం రాజకీయాలు వేరేగా ఉంటాయని స్పష్టం చేశారు.

కంగ్రాచులేషన్స్‌.. ఫైనల్లీ యూ ఎచీవ్డ్‌.. ఏమనిపిస్తుంది?

మాటల్లో చెప్పలేను. తెలంగాణకు రెండో సీఎం కావడం అసాధ్యం అని చెప్పుకొన్న నేపథ్యంలో సాధ్యం కావడం. కాంగ్రెస్‌ వంటి పార్టీలో సజావుగా ఈ బాధ్యతలోకి రావడం, 30 రోజులు పూర్తి చేసుకోవడం... ఇవన్నీ నిజమా? అని అనిపిస్తుంది. గతంలో మీతో చర్చ జరిగినప్పుడు డిసెంబరు 9న ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పిన. ఆ తర్వాత మీ వద్దకు తప్పకుండా వస్తానని చెప్పిన. అప్పుడే రావాలనుకున్నా. కానీ జాతీయ నాయకులంతా ఇక్కడే ఉన్నారు. కుదురుకున్నాక వద్దామని అనుకున్నా.

రేవంత్‌ ఇదివరకటి రేవంత్‌ కారని, కొంత తేడా కొడుతుందని అంటున్నారు?

నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు నా ఆలోచనా సరళి జెడ్పీటీసీ స్థాయిలోనే ఉంటుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు... నా పరిధి, ఆలోచన దానికి అనుగుణంగానే ఉంటాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ ఇవ్వడంతో పార్టీలో బాధ్యత పెరిగింది. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడూ బాధ్యత మారింది. మూడోసారి ఎమ్మెల్యేగా ఓడినా ప్రజలు ఎంపీగా గెలిపించి, ఢిల్లీకి పంపించడంతో అవగాహన, పరిస్థితులు, ప్లాట్‌ఫామ్‌ మారిపోయింది. ఆ తర్వాత పీసీసీ వచ్చింది. ఈ పరిణామ క్రమంలో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ, నేర్చుకుంటూ ముందుకొచ్చాను. ఎన్టీఆర్‌, మర్రి చెన్నారెడ్డిలను వదిలేస్తే... చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌చాలా పట్టున్నవారు, అనుభవజ్ఞులు. ఈ ముగ్గురితో పోల్చుకుంటే నేను నిర్వర్తించాల్సిన బాధ్యత చాలా బరువైంది. ఎప్పటికప్పుడు, మొదటిసారి కాలేజీకి వెళ్లినట్లు నేర్చుకోవాల్సి వస్తోంది. నిత్యం కష్టపడాలి, నేర్చుకోవాలి, ప్రజల్లో ఉండాలి అని నేను అనుకుంటా.

1978లో చంద్రబాబు ఎమ్మెల్యే, 1995లో సీఎం. మీరు 2006లో జెడ్పీటీసీ, 2023లో సీఎం అయ్యారు. రాజకీయాల్లోకొచ్చిన 17 ఏళ్లకు గురు శిష్యులిద్దరూ సీఎంలయ్యారు..

కరెక్టే. ఆ సారూప్యత ఉంది.

నెల రోజులు చూశాక.. రేవంత్‌రెడ్డిలో ఇద్దరున్నారు. రేవంత్‌ కాకుండా, ఒకరు చంద్రబాబు, మరొకరు రాజశేఖర్‌రెడ్డి.. కరెక్టేనా?

వారిఇద్దరిదీ బలమైన ముద్ర. దాచినా దాగేది కాదు. లైఫ్‌లో ఒక లక్ష్యం ఉండాలి, నిరాశ చెందకుండా పని చేయాలి. కష్టమే అయినా తట్టుకుని నిలబడగలిగాను.

ఈ నెల రోజులు మంచి మార్కులే వచ్చాయి.

అవును.. మీలాంటివారందరూ గుర్తించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిశాను. పార్టీ కానివారిని, విరుద్ధమైన సిద్ధాంతమున్నవారిని, రాజకీయంగా ప్రధానమైన ప్రత్యర్థులనూ కలిశాను. వాళ్లు కూడా కొంత ప్రోత్సహించినట్లుగానే చూశారు.

పీఎం ఏమన్నారు?

ప్రధాని కార్డియల్‌గానే మాట్లాడారు. వ్యక్తిగత చర్చలు ఉంటాయి కదా.. కొన్ని చెప్పలేము. కానీ... ప్రధాని ఒక్కమాట మాత్రం చెప్పారు. బీజేపీ ప్రభుత్వాలు లేని సీఎంల విషయంలో పక్షపాతం ఉంటుందన్న చర్చ బయట జరుగుతుందని నేను ఆయనకు గుర్తుచేస్తే.. అలా ఉండదని ప్రధాని చెప్పారు. దానికి ఉదాహరణ రాష్ట్ర శకటాలే. ఉమ్మడి ఏపీ తరపున గణతంత్ర దినోత్సవం రోజు శకటం ఉండేది. తెలంగాణ వచ్చాక... ఒక్కసారి మాత్రం ఉంది. ఆ తర్వాత లేదు. వాళ్లేమో ఒక నమూనా చెబితే... అలాంటిదేమీ లేదు... తన ఇష్టారాజ్యంగా చేస్తానని.. లేకపోతే లేదన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరించారు. నేను సీఎం అయ్యాక అధికారులను అడిగితే... కేంద్రం, రాష్ట్రాల మధ్య సఖ్యత లేక అలా జరుగుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి శకటానికి అవకాశం లేదని, మూడు నెలలు ముందుగానే నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. మేము కేంద్రాన్ని అడిగాం. కర్ణాటక విషయంలో కూడా ఏదో సమస్యతో వారి శకటానికి ఆమోదం లభించలేదు. మాకు మాత్రం లెటర్‌ పెట్టమన్నారు. కర్ణాటక లెటర్‌ పెట్టింది. ఈ రెండు లెటర్లు ప్రధాని వద్దకు వెళ్లాయి. ప్రధాని తెలంగాణకు అనుమతి ఇచ్చారు. కర్ణాటక లెటర్‌ రిజెక్ట్‌ అయింది.

పీఎంను కూడా ఇంప్రెస్‌ చేశారు...

ఇది మా హానర్‌, మాకు గౌరవం అని చెప్పాను. మా తెలంగాణకు సంబంధించిన శకటం అక్కడ లేకపోవడమనేది మీ గౌరవానికి సంబంధించినదని ఆయనతో అన్నాను. మీరిస్తే మేము గొప్పగా చెప్పుకొంటామని.. ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తామని అన్నాను. ఇప్పుడు జనవరి 26న తెలంగాణ శకటం ఉంటుంది. అమిత్‌షా వద్దకు వెళ్లి 29 మంది ఐపీఎస్‌ అధికారులను అడిగాను. మంజూరైన పోస్టులు 79 ఉన్నాయని, ఇవి సరిపోవడం లేదని, 33 జిల్లాలు అయ్యాయని వివరించాను. 40 శాతమైనా పెంచాలని అడిగాను.. ఇది ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనే 30 ఐపీఎ్‌సలను నియమించామని, నార్కోటిక్స్‌, సైబర్‌ క్రైమ్‌, టెర్రరిస్టు కార్యకలాపాలు వంటివాటిని అడ్రస్‌ చేయాలని.. ఇతర కార్యకలపాలు కూడా ఉంటాయని చెప్పగానే... 2024 బ్యాచ్‌ నుంచి 10 మంది ఐపీఎస్‌ అధికారులను అదనంగా ఇస్తామని చెప్పారు. నిర్మలా సీతారామన్‌ వద్దకు వెళ్లి లెక్కలు, కష్టాలు, అప్పులన్నీ చెప్పాను. కొత్త అప్పులొద్దు.. మీరు జోక్యం చేసుకుంటే 2, 3 శాతానికి జైకా, ఏడీబీ బ్యాంకు వంటి సంస్థలు అప్పులిస్తాయని చెప్పాను. అక్కడి నుంచి లోన్‌ తీసి, ఇక్కడికి మార్చాలని అడిగిన. వెంటనే ఆమె కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను పిలిచి, రాష్ట్ర అధికారులతో మాట్లాడి, పరిశీలించాలని చెప్పారు. ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ వద్దకు వెళ్లాను. కంటోన్మెంట్‌ విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పాను. తన శాఖాపరమైన అంశాలను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. యంగ్‌స్టర్‌కు అవకాశం వచ్చిందని, తాను కూడా 49 ఏళ్లకే యూపీ ముఖ్యమంత్రి అయ్యానని ఆయన అన్నారు. గవర్నర్‌ వద్దకు వెళ్లి కూడా ఇదే చెప్పిన. ఇన్ని రోజుల పాటు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరని చెప్పాను. రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థలు, వీటిని అగౌరవపరిస్తే ఏమొస్తుంది, మీకున్న పెండింగ్‌ సమస్యలేమిటో మాకు చెప్పడి అని అడిగాను. ఆమె చాలా సంతోషంగా ఫీల్‌ అయ్యారు. హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సను కలిశాను. వారికి 2009 నుంచి సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కోర్టు భవనం, బడ్జెట్‌ వంటి చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబరు 31 లోపు సమస్యలను పరిష్కరిస్తానని చెప్పాను. అన్ని సమస్యలు పరిష్కరించాం. జీవోలు ఇచ్చేశాం. రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో ఒకే రూఫ్‌ కింద క్వార్టర్లు, కోర్టు నిర్మించనున్నాం. హైకోర్టు ప్రస్తుత బిల్డింగ్‌ను నల్సార్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయించాం.

‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని ప్రధాని అంటున్నారు. వారు రావాలనుకున్న స్టేట్‌లో మీరు సీఎం అయ్యారు. 2024 ఎన్నికల తర్వాతా ఇలాంటి పరిస్థితి ఉంటుందా?

అరాచక విధానాలు, హైహ్యాండెడ్‌నె్‌సను చూసి ఆయన విసిగిపోయారని అనిపిస్తోంది. వ్యక్తులు కాకుండా, వ్యవస్థలను గౌరవించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కలవకపోవడం(కేసీఆర్‌), అగౌరవపర్చడం జరిగాయి. నవీన్‌ పట్నాయక్‌ చాలా పరిమితంగా కలుస్తారు. కానీ... అవసరం లేకున్నా... గోకి, నువ్వెంత, నేనెంత అని అనరు. గోడ మీదున్న రాయిని నెత్తి మీదేసుకున్నట్లు... రాష్ట్రానికి నష్టం చేశారు. ఈ పోకడలను కేంద్రంలోనివారు చూశారు. నేను వెళ్లగానే కాలేజ్‌ స్టూడెంట్‌ వచ్చినట్లుగా చూశారు. రేపు ఎన్నికలొస్తే కాంగ్రెస్‌ లైన్‌లోనే రాజకీయాలుంటాయి. కానీ... రాష్ట్ర అభివృద్ధి విషయానికొస్తే రాష్ట్ర ప్రతినిధిగా కేంద్రంతో సహకారాన్ని తీసుకోవాలని చూశా. వాళ్లు కూడా అలాగే చూశారు. నేను కేసీఆర్‌ను పరామర్శించడానికి వెళ్లినప్పుడు చర్చ జరిగింది. కానీ... రాహుల్‌ మాత్రం వెళ్లి చూడాలన్నారు. వాళ్ల దృష్టిలో మనం కొంత హుందాగా వ్యవహరించాలన్నది రాహుల్‌ సూచనల్లో కనిపించింది.

రాహుల్‌ నుంచి అన్‌కండీషనల్‌ సపోర్ట్‌ ఉంది కదా?

దానిలో ఎలాంటి అనుమానం లేదు. మేడం సోనియాతో పాటు అందరూ ఓ కుటుంబ సభ్యుడిగా చూస్తారు.

రాష్ట్రంలో 33 జిల్లాలు అవసరమా? ఒకటి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు జిల్లా ఇస్తే సంతృప్తి ఉంటుందా?

మనకుండే శక్తి అంతా సన్నగిల్లిపోయే విధానమిది. 33 జిల్లాలు ఉండాలా? వద్దా? అనే చర్చ కంటే.. ఎవరు ఏది అడిగినా.. చలో లేలో అన్నట్లుగా ఇచ్చారు. నేను ఎంపీగా చేసిన స్థానంలో 35 లక్షల ఓటర్లు ఉన్నారు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. అక్కడ జిల్లా పరిషత్‌ మీటింగ్‌కు వెళ్లి, డయాస్‌ మీద కాకుండా కింద కూర్చున్నా. ఇంకా ఎవరొస్తలేరని చూస్తుంటే... అందరం వచ్చేశామని, కింద కూర్చునే వారెవరూ లేరని చెప్పారు. అంతకుముందు మహబూబ్‌నగర్‌ జెడ్పీ సమావేశానికి వెళితే 64 మంది జెడ్పీటీసీలు ఉండేవారు. అసెంబ్లీకి వెళ్లిన ఫీలింగ్‌ ఉండేది.

దానిపై ఏమీ ఆలోచించడం లేదా?

తప్పకుండా... రేపు అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌లో చర్చిస్తాం. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి హయాంలో నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కోసం ఒక కమిషన్‌ను వేశారు. అందులో ఎలాగైతే రిటైర్డు జడ్జిలను సభ్యులుగా పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేశారో... మేర ఒక హైకోర్టు లేదా సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జిని, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులను పెట్టి, జిల్లాలు, మండలాలను పరిశీలిస్తాం.

33 జిల్లాల పేర్లు చెప్పగలరా?

ఆయన(కేసీఆర్‌) కూడా చెప్పలేరు. నామీద కోపంతో నా నియోజకవర్గాన్ని అటింత, ఇటింత చీల్చి కాకులకు, గద్దలకు వేసినట్లు చేశారు. నా నియోజకవర్గంలోని మూడు మండలాలు ఓ జిల్లాలో, మరో మూడు మండలాలు మరో జిల్లాలో ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ డీఈలతో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదు. ఐదు మండలాలను కాస్త ఎనిమిదో తొమ్మిదో చేశారు. మొత్తం రీ-ఆర్గనైజేషన్‌కు ఓ కమిషన్‌ను వేస్తాం. ప్రజాభిప్రాయాలను తీసుకుని, పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో, రాజకీయ జోక్యం లేకుండా, కమిషనే పూర్తిగా 119 నియోజకవర్గాలను తిరిగేలా చూస్తాం. అక్కడ మునిసిపాలిటీలు, మండలాలు ఎన్ని ఉన్నాయి? అర్బన్‌ ఏరియాలు, రూరల్‌ ఏరియాలు ఎలా ఉన్నాయన్న వివరాలన్నింటీని తెలుసుకునేలా చేస్తాం. మండలాలను చేశారే తప్ప... కానీ మండల కార్యాలయంలో కుర్చీలు లేవు. సత్రంలో తిని, మఠంలో పడుకున్నట్లు ఉంది పరిస్థితి. ఒక పాఠశాల, ఆస్పత్రి, జూనియర్‌ కాలేజీ, పోలీస్‌ స్టేషన్‌ ఏవీ లేవు. దానిని మండలం అంటారు. కొడంగల్‌ నియోజకవర్గంలోనే ఎన్నికలకు ముందు హడావుడిగా మూడు మండలాలు ఇచ్చి, గోడలకు బోర్డులు తగిలించారు. ఇలాంటి వ్యవస్థ ఎప్పటికీ మంచిది కాదు. ఒకప్పుడు మా నారాయణ్‌పేట్‌ డివిజన్‌లో 18 మండలాలు ఉండేవి. ఒక డీఎస్పీ కింద 18 మండలాలు ఉండేవి. ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఆరు మండలాలను ఎనిమిది మండలాలు చేశారు. ఆ ఎనిమిది మండలాలకు ఒక ఎస్పీ ఉన్నారు. ఒక గంటలో రౌండు కొట్టి రావొచ్చు. రాజకీయంగా చేస్తే ఎన్నో ఆరోపణలు వస్తాయి. అందుకే జ్యుడీషియల్‌ కమిషన్‌ను వేస్తే... ఇండిపెండెంట్‌గా వస్తారు. డీలిమిటేషన్‌ తర్వాత పెద్దగా వివాదాలు రాలేదు. అందుకే అదే పద్ధతిలో చేస్తాం.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను దూకుడుగా ఉండాల్సిందే.

ఆ పాత్ర అలాంటిది. ఈ రోజు అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి హోదాలోకి మారాను. కళ్లు మూసి తెరిచే లోపు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా, తేడా వచ్చినా రాష్ట్రానికి నష్టం వస్తుంది.

బీజేపీ ప్రభుత్వాలు లేని సీఎంల విషయంలో పక్షపాతం ఉంటుందన్న చర్చ బయట జరుగుతుందని నేను గుర్తుచేస్తే.. అలా ఉండదని ప్రధాని చెప్పారు. రాష్ట్ర అవసరాలను, సమస్యలను తమ దృష్టికి తెస్తే, నిబంధనల మేరకు అన్నింటినీ

చేస్తామని అన్నారు.. అలాకాకుండా మా దగ్గరికి రాకుండా బయటే రాజకీయంగా మాట్లాడితే తాము చెప్పడానికి ఏముండదనీ అన్నారు.

జిల్లాలు అస్తవ్యస్తం.. ఇదే ఉదాహరణ

మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం ఏడు జిల్లాలకు విస్తరించి ఉంది. ఆ ఎంపీ ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్‌ఈలతో మాట్లాడాలి. 25 ప్రధాన శాఖలు ఉన్నాయి. ఇలా ఎవరితో ఆ ఎంపీ మాట్లాడాలి? ఎన్ని జిల్లా పరిషత్‌ సమావేశాలకు వెళ్లాలి. అందుకే కమిషన్‌ను ఏర్పాటు చేసి, వాళ్లిచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చించి, డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై పేపర్లలో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలను స్వీకరిస్తాం. 6 నెలల గడువు పెట్టుకుని చేయాలనుకుంటున్నాం.

ఎప్పుడైనా రాహుల్‌ మొహంలోకి చూస్తే... ఏదైనా విషయం ఉందా? అని అడిగి తెలుసుకుంటారు. నా విషయంలో చాలా క్లారిటీతో ఉన్నారు. ఆ స్థానానికి రీచ్‌ కావడానికి కాంగ్రె్‌సలో ఎన్నేళ్లు పడుతుందో నాకు తెలియదు. రాహుల్‌గాంధీ నమ్మే వ్యక్తులు, అత్యంత దగ్గరగా చూసే ఇద్దరు, ముగ్గురు మనుషుల్లో నేను ఒకడిగా ఉన్నానని మాత్రం చెప్పగలను.

Updated Date - Jan 08 , 2024 | 11:38 AM