Share News

కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:56 AM

ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాప్టర్‌లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి

కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం

ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌-2041కు ఆమోదం

మహిళాశక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన

వరంగల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు హెలికాప్టర్‌లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్న సీఎం.. రూ.95 కోట్ల వ్యయంతో నిర్మించిన కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహాన్ని డ్రోన్‌ కెమెరాతో ఆవిష్కరించారు. అనంతరం కాళోజీ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఆర్ట్స్‌ గ్యాలరీలోని కాళోజీ రచనలు, పుస్తకాలను పరిశీలించారు. కాళోజీ డాక్యుమెంటరీని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీక్షించారు. కాళోజీ కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. అంతకుముందు వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌-2041ను సీఎం ఆవిష్కరించి ఆమోదం తెలిపారు. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో పనిచేసే నార్కోటిక్‌ పోలీ్‌సస్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రజాపాలన విజయోత్సవ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆర్ట్ప్‌ కాలేజీ మైదానంలో మహిళా సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించి.. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. సభలో ప్రసంగం ముగిసిన అనంతరం 22 జిల్లాల్లో రూ.105 కోట్లతో నిర్మించే మహిళాశక్తి భవనాలను వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులకు రూ.35 కోట్ల బీమా చెక్కులను అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తన సెంటిమెంట్‌గా హనుమకొండలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ విజయవంతమయింది. ఉమ్మడి వరంగల్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా మహిళలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సీఎం రేవంత్‌ ప్రసంగానికి క్యాడర్‌ నుంచి భారీగా స్పందన లభించింది. అంచనాలకు తగ్గట్టుగా సభా ప్రాంగణం నిండిపోవడం కాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ను నింపింది.

ఎమ్మెల్యే మాధవరెడ్డి మళ్లీ డుమ్మా...

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రెండోసారి డుమ్మా కొట్టారు. తొలి నుంచి రేవంత్‌రెడ్డితో ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. జూన్‌ 29న హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి కూడా ఎమ్మెల్యే మాధవరెడ్డి హాజరు కాలేదు. స్థానికంగా ఉండి కూడా సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన సభలో కూడా ఎమ్మెల్యే పాల్గొనకపోవటం చర్చనీయాంశంగా మారింది.

విపక్ష, విద్యార్థి సంఘాల నేతల అరెస్టు

హనుమకొండ టౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. నిరసనలకు సిద్ధమైన వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్టు చేశారు. కుడా మైదానం నుంచి ఇందిరా మహిళా శక్తి విజయోత్స సభ జరిగే ఆర్ట్స్‌ కళాశాల మైదానం వరకు అడుగడుగునా పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్‌ సభాస్ధలికి వచ్చే సమయంలో స్వేరోస్‌ ఆఽధ్వర్యంలో అదాలత్‌ వద్ద అందోళనకు సిద్ధమవుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కాళోజీ కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ కాళోజీ జంక్షన్‌లో సౌత్‌ ఇండియా స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌, తెలంగాణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఽఽఽధ్వర్యంలో నిరసనకు ప్రయత్నిస్తుండగా వారిని అరెస్టు చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 04:56 AM