గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 24 , 2024 | 12:03 AM
జిల్లాలో గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
- సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలి
- వేడుకల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 23: జిల్లాలో గణతంత్ర దినోత్సవ నిర్వహణకు అవసరమైన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకలపై జిల్లా అదనపు కలెక్టర్‌లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమిలతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నిగ్రామాల్లో వేడుకలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలు, తహసీల్దార్లదేనని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా జిల్లా విద్యాధికారి తగు అదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం రోజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భారీగా ఏర్పాట్లు చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డిలకు సూచించారు. వేడుకలకు సంబంధించిన ప్రొటోకాల్ పాటిస్తూ సీటింగ్‌లను ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం జిల్లాలోని వీఐపీలందరికీ తప్పనిసరిగా గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గణతంత్ర దినోత్సవ సంక్లిప్త సందేశాన్ని సిద్ధం చేయాలని డీపీఆర్వో మామిండ్ల దశరథంకు సూచించారు. జిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించాలని నిర్ణయించామని ఇందుకు అనుగుణంగా ప్రతీ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు జనవరి 24 వతేదీలోగా కలెక్టరేట్ ఏవో కు అందించాలని సూచించారు.
- సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి..
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు బండ్ పార్క్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులతో దేశభక్తి, జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వంను పెంపోందించే నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేయాలని విద్యాధికారిని ఆదేశించారు. అక్కడే పోషకాహార ప్రాముఖ్యం, చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని తెలియజేసేలా మిల్లేట్ పుడ్‌ఫెస్టివెల్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంకు సూచించారు. సమావేశంలో అర్డీవో అనంద్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, చేనేత జౌళీశాఖ ఏడీ సాగర్, సిరిసిల్ల తహసీల్దార్ షరీఫ్ మోహినోద్దీన్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- ఫిబ్రవరిలో రాజన్న వాలీబాల్ పోటీలు
వచ్చే ఫిబ్రవరిలో రాజన్న వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పేరుతో జిల్లా స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అదేశించారు. మంగళవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మినీ సమావేశ మందిరంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమావేశం నిర్వహించారు. సభ్యులు జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఔత్సాహిక బృందాలనుంచి దరఖాస్తులను తీసుకోవాలని ఒక్కో టీం నుంచి వెయ్యి రూపాయల ఫీజు వసూలు చేయాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియాన్ని యువత, ప్రజలను అకర్షించేలా సద్వినియోగం చేసుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేయాలని మున్సిపల్ యువజన క్రీడా అధికారులకు సూచించారు. మినీ స్టేడియం నిర్వహణ క్రీడాకారుల్లో నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. క్రీడా నైపుణ్యాల పెంపుదలకు స్టేడియం కేంద్ర బిందువు కావాలన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిఽధిలో నిర్వహిస్తున్న మినీస్టేడియం నిర్వహణకు అవసరమైన ఆదాయం కూడా సమకూరే విధంగా చూడాలన్నారు. స్టేడియానికి సంబంధించిన ఎనిమిది దుకాణాలను బహిరంగ వేలం వేసి లీజుకు ఇవ్వాలని అన్నారు. బహిరంగ వేలానికి ఎవరూ ముందుకు రాకపోతే కౌన్సిల్ తీర్మానంతో నిర్ణీత రుసుము నిర్ణయించి కేటాయించాలని అన్నారు. మినీస్టేడియంలో ప్రచార ప్రకటన ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. స్టేడియంలో ఉడెన్ బ్యాడ్మింటన్ కోర్టు, స్నూకర్, ఇండోర్ క్రీడలకు వచ్చే వారి నుంచి నెలవారి రుసుము వసూలు చేయాలన్నారు. బ్యాడ్మింటన్ మినహా మిగతా అన్నీ ఇండోర్ క్రీడలకు ఒకే కార్డు చందాదారులకు ఇవ్వాలని అన్నారు. స్కేటింగ్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా కోర్టును తీర్చిదిద్దాలని, అర్చరీ శిక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. స్టేడియానికి సంబంధించి పెండింగ్ విద్యుత్ బకాయిలు చెల్లించాలని అన్నారు. సిరిసిల్ల నెహ్రూపార్కు వద్ద ఉన్న స్విమింగ్ పూల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా క్రీడా అధికారి రాందాస్, పంచాయ తీరాజ్ ఈఈ సూర్యప్రకాష్, డీఈవో రమేష్, సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ అయాజ్, టీపీవో అన్సారీ పాల్గొన్నారు.