Share News

భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:26 AM

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని మరో నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది స్థానాలకుగాను నాలుగు స్థానాలు భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్‌ టికెట్‌ను పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ

భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కిరణ్‌కుమార్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నిహితుడికి టికెట్‌

నిజామాబాద్‌కు జీవన్‌రెడ్డి, మెదక్‌కు నీలం మధు

ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణకు చాన్స్‌

నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఖరారు

కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం

ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలు ఇంకా పెండింగ్‌లోనే

న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని మరో నాలుగు స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది స్థానాలకుగాను నాలుగు స్థానాలు భువనగిరి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌లకు అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్‌ టికెట్‌ను పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డికి కేటాయించగా, తీవ్ర పోటీ నెలకొన్న భువనగిరి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. ఆదిలాబాద్‌ (ఎస్టీ)కు ఆత్రం సుగుణ, మెదక్‌కు నీలం మధును అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను బుధవారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన 8వ జాబితాతో కలిపి ఇప్పటివరకు కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా 209 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బుధవారం సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పార్టీ ఆగ్రనేతలు సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌, అంబికా సోనీ తదితరులు పాల్గొని 25 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 8 సీట్లపై జరిగిన చర్చలో కాం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా పెండింగ్‌లో ఉన్న మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ఈ నెల 31న సీఈసీ భేటీ కానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

సామాజిక సమీకరణాల వల్లే జాప్యం!

రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రె్‌సకు సామాజిక సమీకరణాల దృష్ట్యా అభ్యర్థుల ఖరారు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో రెండు చోట్ల రెడ్డి సామాజికవర్గానికి, ఒకచోట బీసీకి అవకాశం కల్పించింది. ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానంలో గిరిజన మహిళకు టికెట్‌ కేటాయించింది. అయితే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో ఆరు చోట్ల బీసీలను అభ్యర్థులుగా ప్రకటించింది. బీజేపీ సైతం బీసీలకు 5 టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం ఇప్పటివరకు 13 అభ్యర్థులను ప్రకటించగా మూడు స్థానాలకు మాత్రమే బీసీలను అభ్యర్థులుగా నిలిపింది. దీంతో మిగతా పార్టీలు బీసీలకు పెద్దపీట వేయగా కాంగ్రెస్‌ బీసీలకు తక్కువ సీట్లు కేటాయిస్తే బీసీలు దూరమవుతారని భావిస్తున్నట్తు తెలుస్తోంది. తాజాగా, ఖమ్మం స్థానానికి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే చర్చ కాంగ్రె్‌సలో జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు టికెట్ల కోసం సీఎం రేవంత్‌కు ఆయన నివాసం యమున బ్లాక్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం విమానంలో ఢిల్లీ ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్‌ తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సీఎం రేవంత్‌ను కలిసి తన తమ్ముడు ప్రసాద్‌రెడ్డికి ఖమ్మం టికెట్‌ కేటాయించాలని కోరినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌ టికెట్‌ కోసం నరే్‌షజాదవ్‌ టికెట్‌ సీఎంకు విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఓయూ విద్యార్థి ఉద్యమనేతలలో ఒక్కరైన పున్నా కైలా్‌షనేత బీసీ, ఉద్యమకారుల కోటాలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్‌ సీఈసీ భేటీ ముగిసిన అనంతరం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

భువనగిరి నుంచి పోటీ చేయమని రాజగోపాల్‌ కోరారు: యాష్కీ

లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయమని తనను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరినా అంగీకరించలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ తెలిపారు. ఈ మేరకు గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బదిలీలన్నీ కేటీఆర్‌ కనుసన్నల్లోనే జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వందరోజుల పాలన చూసి కేటీఆర్‌ భయపడి పోతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం కేసును తప్పుడు కేసు అని పదేపదే చెబుతున్న కవిత ఒక్కసారి కూడా తాను నేరం చేయలేదని చెప్పడం లేదని అన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 07:19 AM