Share News

KTR : తొందర్లోనే కేసీఆర్‌ను సీఎంను చేద్దాం

ABN , Publish Date - Jan 25 , 2024 | 02:45 AM

తొందరలోనే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

KTR : తొందర్లోనే కేసీఆర్‌ను  సీఎంను చేద్దాం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్య

కాంగ్రెస్‌కు ఓటేసినవారు బాధపడుతున్నారు

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిలింది చిన్న దెబ్బే

తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్‌

విద్యుత్తు సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానీతో డీల్‌

ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో..

ఓటుతో కొడతారో రైతులు ఆలోచించాలి

ఎన్నికల్లో సోషల్‌ మీడియా కీలకం: కేటీఆర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 24: తొందరలోనే కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు కూడా అనుకోలేదని, అందుకే బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీగా ఇస్తామంటూ అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రె్‌సకు ఓటు వేసిన వారంతా ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. బుధవారం కరీంనగర్‌లో నిర్వహించినపార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాధాకరమేమీ కాదని, చాలా చిన్న దెబ్బ మాత్రమే తగిలిందని అన్నారు. ‘‘ప్రజలు మనల్ని ఛీకొట్టలేదు. 39 స్థానాల్లో గెలిచాం. మరో 14 స్వల్ప తేడాతో ఓడాం. ఆ 14 స్థానాల్లో ఇతర పార్టీలు గతంలో రెండు, మూడు, నాలుగుసార్లు వరుసగా పోటీచేసి.. ఒక్కసారైనా గెలిపించాలంటూ ఏడవడంతో ప్రజలు భావోద్వేగాలతో వారికి ఓటేశారు. ఇందులో ఆరేడు స్థానాలు బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఎలా ఉండేది? 1.85 శాతం ఓట్ల తేడాతో మాత్రమే అధికారం కోల్పో యాం’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ను అవమానపరిచే విధంగా మాట్లాడవద్దని పార్టీ శ్రేణులు, సోషల్‌ మీడియా వారియర్స్‌కు సూచించారు. ‘‘కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కరీంనగర్‌, సిరిసిల్ల, హుజూరాబాద్‌లో గెలిచాం. మిగిలిన నాలుగింటిలో కూడా వారు సానుభూతితోనే గెలుపొందారు. అయినా మనకంటే వారికి కేవలం ఐదారు వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చా యి. ఈ ఏడుపు, సానుభూతి ఎప్పటికీ ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.

420 హామీలతో ప్రజలను నమ్మించారు..

ఎన్నికల్లో తప్పుడు హామీలతో రేవంత్‌రెడ్డి ప్రజలను నమ్మించారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలే కాకుండా.. మేనిఫెస్టోలో పేర్కొన్నవన్నీ కలిపి 420 హామీలు ఇచ్చారని, వాటిని ప్రజలకు వివరించి అమలయ్యే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుంటే రోడ్డుపై బట్టలూడదీసి ప్రభుత్వాన్ని నగ్నంగా నిలబెడతామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాను పదునుగా వాడుకొని నరేంద్రమోదీ ప్రధానమంత్రి, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. రైతు భరోసా ఇచ్చామంటూ రేవంత్‌రెడ్డి దావో్‌సలో పచ్చి అబద్ధం చెప్పారని, రైతుబంధు పేరు మార్చారే తప్ప.. డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొడతామంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వాఖ్యలపై కేటీఆర్‌ మండిపడ్డారు. రైతు భరోసా రాని70 లక్షల మంది రైతులు ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో, ఓట్లతో కొడతారో ఆలోచించుకోవాలన్నారు. క్వింటాల్‌ ధాన్యానికి ఇస్తామన్న రూ.500 బోనస్‌ ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. మార్పు కావాలని ఓట్లు వేసిన 6.5 లక్షల ఆటో కార్మికుల కుటుంబాల కొంప కొల్లేరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారికి ఏ అవకాశమచ్చినా కాంగ్రె్‌సకు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎరువులు, విత్తనాల దుకాణాల వద్ద క్యూ కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, మళ్లీ ఆ రోజులు వచ్చాయని విమర్శించారు. బస్సుల సంఖ్యను పెంచకుండా, బస్సుల కండిషన్‌ ఎలా ఉందో తెలుసుకోకుండా అనాలోచితంగా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో బస్సుల్లో వారు కొట్టుకుంటున్నారని తెలిపారు. మరోవైపు డబ్బు లు పెట్టుకొని వెళ్లే పురుషులకు సీట్లు దొరకడం లేదని, ఎవరూ సంతృప్తిగా లేరని అన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కోటి 57 లక్షల మంది మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుంటే తాట తీయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారని అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. తాము ఆ హామీ ఇవ్వలేదని భట్టివిక్రమార్క అన్నారని చెప్పారు.

మతం, దేవుళ్లతో బీజేపీ రాజకీయం..

బీజేపీ ఎంపీలు మతం, దేవుళ్లతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నిత్యం మతం, ధర్మం అంటూ రెచ్చగొడుతూ కరీంనగర్‌లో గెలిచిన బండి సంజయ్‌కుమార్‌ అట్టర్‌ ఫ్లాప్‌ ఎంపీ అని విమర్శించారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట రామాలయానికి మోదీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ఐదేళ్లలో సంజయ్‌ చేసిన అభివృద్ధి ఏంటో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనంటూ కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలుగురు ఎంపీలను ఓడించింది బీఆర్‌ఎస్‌ కాదా? రెండు పార్టీలు ఒకటైతే కామారెడ్డిలో కేసీఆర్‌ ఓడిపోయేవారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ, అదానీ ఒకటేనంటూ రేవంత్‌, రాహుల్‌గాంధీ ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయనతోనే ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో మోదీ, అదానీ తరువాత.. రేవంత్‌ మూడో ఇంజన్‌గా మారారన్నారు. కేసీఆర్‌ సర్కారు పదేళ్లు అదానీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయలేదని, అమిత్‌షా, మోదీ సూచనతోనే అదానీతో రేవంత్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రాజెక్టులు, ఇతర సంస్థలను అదానీకి కట్టబెడతారన్నారు. రేవంత్‌ మరో ఏక్‌నాథ్‌ షిండే అయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని, మైనారిటీలు ఆలోచించాలని సూచించారు.

Updated Date - Jan 25 , 2024 | 02:45 AM