Share News

మద్యం బెల్టు దుకాణాలు మూసివేయించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:52 AM

మద్యం బెల్టు దుకాణాలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, తక్షణం వాటిని మూసివేయాలని శాలిలింగోటం గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

మద్యం బెల్టు దుకాణాలు మూసివేయించాలి
శాలిలింగోటం గ్రామంలో మద్యం బెల్ట్‌ దుకాణాలు మూసివేయించాలని పంచాయతీ కార్యదర్శి వేమారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

శాలిలింగోటం గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం

శాలిగౌరారం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మద్యం బెల్టు దుకాణాలతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, తక్షణం వాటిని మూసివేయాలని శాలిలింగోటం గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. శనివారం ఈ మేరకు గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన సమాచారం మే రకు వివరాలిలా ఉన్నాయి. 325 ఇళ్లు, 1300 మంది జనాభా ఉన్న శాలిలింగోటం గ్రామంలో ఆరు మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వీటిని నిర్వహిస్తుండటంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడుతూ, వేధిస్తూ, కొడుతూ, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై కొన్ని కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నమై గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు శనివారం సమావేశమై మద్యం బెల్టు దుకాణాలు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి వేమారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 12:52 AM