మీ స్థాయెంత? మీ బతుకెంత?
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:07 AM
‘‘మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ ఏంది? గీదీ ఏంది? అంటరా? మీ స్థాయి ఎంత? మీ బతుకెంత?’’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుగా రేవంత్ వైఖరి
రేవంత్.. నోరు అదుపులో పెట్టుకో
మోదీని విమర్శించడంపై ఈటల
సచివాలయంలో చర్చకు సవాల్
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ ఏంది? గీదీ ఏంది? అంటరా? మీ స్థాయి ఎంత? మీ బతుకెంత?’’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుగా రేవంత్ వైఖరి ఉందని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఎన్ని హామీలిచ్చారు? ఎన్ని అమలు చేశారు? అనే అంశాల మీద అబిడ్స్ చౌరస్తాలోనైనా, సచివాలయంలోనైనా చర్చకు రావాలని రేవంత్‌కు సవాల్ చేశారు. హామీల అమలను ప్రజాక్షేత్రంలో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర వెళ్లి రేవంత్, హామీల అమలుపై పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మహి ళా సంఘాలకు పది లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని హామీ ఇచ్చిన మీరు దానిని నిలబెట్టుకున్నారా? పెళ్లి చేసుకున్న ఆడ బిడ్డలకు తులం బంగారం ఇచ్చారా? బెల్ట్‌షాపులు రద్దుచేస్తామని హామీ ఇచ్చా రు? రద్దు చేశారా? అని నిలదీశారు. 8 నెలలుగా లగచర్లలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ దాచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం తమ భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వారి భూ ములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ రేవంత్ శాడిస్టులా వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాణ కొట్లు కూడా బెల్ట్‌షాపులుగా మారాయని ధ్వజమెత్తారు. పిల్లలు మద్యానికి బానిసలుగా మారుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. గుడి, బడి పక్కనే విచ్చలవిడిగా మద్యంషాపులకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. మూసీకి ఇరువైపులా విలువైనటువంటి భూములను లాక్కొని.. మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాగా ధైర్యం ఉంటే ఎన్ని హామీలు అమలు చేశారనేది సీఎం రేవంత్ చెప్పాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కాకులు పోయి గద్దలు వచ్చినట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని మండిపడ్డారు.
లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్ ఆర్‌సీ)కు ఫిర్యాదు చేసినట్లు ఈటల తెలిపారు. కస్టడీలో పోలీసులు రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నా రు. అధికార పార్టీ నేతలు, పోలీసుల చర్యలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారన్నారు. కమిషన్, ఒక బృందాన్ని లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీనిపై కమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఈటల తెలిపారు.