Share News

బషీరాబాద్‌ పీహెచ్‌సీకి మహర్దశ

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:34 PM

బషీరాబాద్‌ పీహెచ్‌సీకి ఏట్టకేలకు మహర్దశ పట్టుకుంది. ఇకపై మండల ప్రజలకు స్థానికంగా ఆస్పత్రిలో మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి. వైద్యసేవలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగిన పీహెచ్‌సీని తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలోకి బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

బషీరాబాద్‌ పీహెచ్‌సీకి మహర్దశ

- ఆస్పత్రిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌గా మార్పు

- తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి బదిలీ

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

- సీహెచ్‌సీలో ప్రారంభమైన వైద్యసేవలు

బషీరాబాద్‌, జూలై 26: బషీరాబాద్‌ పీహెచ్‌సీకి ఏట్టకేలకు మహర్దశ పట్టుకుంది. ఇకపై మండల ప్రజలకు స్థానికంగా ఆస్పత్రిలో మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి. వైద్యసేవలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగిన పీహెచ్‌సీని తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలోకి బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో వైద్యవిధాన పరిషత్‌ అధికారులు పీహెచ్‌సీని గురువారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు బషీరాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌)గా మారింది. దీంతో శుక్రవారం నుంచి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కింద వైద్య సేవలు కూడా ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు ఇప్పటికే కొత్తగా ముగ్గురు వైద్యులు, 15 మంది స్టాఫ్‌ నర్సులను కూడా నియమించారు. ఈ ఆస్పత్రిని 10 నుంచి 30 పడకలకు సామర్థ్యానికి పెంచుతూ త్వరలో రోగులకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ సీహెచ్‌సీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరై కొత్తగా నిర్మించే వరకు ప్రస్తుత పీహెచ్‌సీ భవనంలోనే వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు.

అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు

ఇకపై సీహెచ్‌సీ(కమ్యూనిటీ హెల్త్‌ సెటర్‌)లో అన్నిరకాల వైద్య సేవలతో పాటు 24గంటలు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఓపీ, గర్భిణుల సేవలు మరింత మెరుగవుతాయి. ఓపీ విభాగాలు, వార్డులు, మార్చురీ, గర్భిణులకు అవసరమైన స్కానింగ్‌ నిర్వహించడం, శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు, ప్రసూతి, పిల్లల విభాగాలకు ప్రత్యేక వైద్యులు, చిన్నచిన్న అపరేషన్లు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికభారం లేకుండా సదుపాయాలు కల్పిస్తారు. ఈ ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్లు, స్త్రీవైద్య నిపుణులు, మత్తు వైద్యుడు, దంత, రేడియాలజీ సర్జన్‌, జనరల్‌ మిడిసన్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ వంటి స్పెషలిస్టులను కూడా నియమించబోతున్నారు. అవసరమైన వైద్యులు, 15నుంచి 20మంది వరకు స్టాఫ్‌ నర్సులకు నియమించనున్నారు. ఈ ఆస్పత్రిలో ఎక్స్‌రేలు, రక్త, మూత్ర ఇతరేత్ర అన్ని రకాల పరీక్షలకు ల్యాబ్‌లు, పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇస్తూ మెరుగైన వైద్యసేవలు అందిస్తారు. వీటితో పాటు శానిటేషన్‌, కట్టుకట్టే సిబ్బంది, నైట్‌ వాచ్‌మెన్లు రానున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:34 PM