Share News

రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jan 22 , 2024 | 11:31 PM

జిల్లాలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు.

రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

- కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 22: జిల్లాలో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం ఉదయం ప్రజావాణి హాల్లో జనవరి 26న గణతంత్ర వేడుకలు, జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... గణతంత్ర వేడుకలను ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించాల న్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందు కు ఆయా శాఖల అధికారులకు బాధ్యతలు అప్ప గిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ పతాకా విష్కరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయా లని నోడల్‌ అధికారిగా ఆర్డీవోకు బాధ్యతలు అప్పగించారు. ప్రముఖులకు, స్వాతంత్య్ర సమర యోధులకు ఆహ్వానం పంపించే విధంగా కలెక్టరేట్‌ ఏవోకు బాధ్యతలు అప్పగించారు. వేదిక, బారికేడింగ్‌, మైక్‌ సిస్టం బాధ్యతలను రోడ్లు భవనాల శాఖ అధికారికి, పారిశుధ్యం, తాగునీటి కోసం మునిసిపల్‌ కమిషనర్‌కు అప్పగించారు. ఆయా సంక్షేమ శాఖల నుంచి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరుల ను ఆకట్టుకునే విధంగా జాతీయ భావం ఉట్టిపడే విధంగా ఉండాలని ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ఓటరు అవగాహన ఫోరం ఏర్పాటు చేసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించేందుకు ఫోరం పని చేయాలని సూచించారు. కొత్తగా ఓటరు నమోదు అయిన వారికి, సీనియర్‌ ఓటర్లకు సన్మానం చేసే విధంగా చూడాలని సూచించారు. అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, తిరుపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 05:12 PM