మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలుండవు
ABN , Publish Date - May 09 , 2024 | 05:50 AM
‘‘పొరపాటునో, గ్రహపాటునో మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో 2029లో ఎన్నికలుండవు. రష్యా, చైనా, మాదిరిగా 30 ఏళ్ల పాటు ప్రధానిగా ప్రకటించుకుంటారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ
జూన్4 తర్వాత తెలంగాణ భవన్‌కు తాళమే: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ సిటీ, నల్లగొండ, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘‘పొరపాటునో, గ్రహపాటునో మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో 2029లో ఎన్నికలుండవు. రష్యా, చైనా, మాదిరిగా 30 ఏళ్ల పాటు ప్రధానిగా ప్రకటించుకుంటారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి దాపురించింది. కులాలు, మతాల మధ్య ఘర్షణ తీసుకురావడమే ఎన్డీయే లక్ష్యం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన వేర్వేరు విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్‌ఆర్ కలెక్షన్’’ అంటూ మోదీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. కానీ మోదీ ఈ పదేళ్లలో ఏఏ (ఆదానీ, అంబానీ)లకు దేశ సంపదను దోచిపెట్టారని విమర్శించారు. మోదీని ‘ఏఏ’ అనాలని సూచించారు. ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా ఆయన నెరవేర్చలేదని.. గబ్బర్‌సింగ్ ట్యాక్స్ మాదిరిగా కూరగాయలు మొదలుకుని అన్నింటి పైనా జీఎస్టీ వేస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ దుకాణం బంద్ అయిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని.. రెండు, మూడు స్థానాల్లో డిపాజిట్లు వస్తే గొప్ప అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ గురించి మాట్లాడి సమయం వృథా తప్ప ఏమీ లేదన్నారు.
జూన్ 4 తర్వాత ఆ పార్టీ ఉండదని, తెలంగాణభవన్‌కు శాశ్వతంగా తాళం వేస్తారని, ఆ పార్టీని కేసీఆర్ రద్దు చేస్తారని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్.. రెండు పార్టీలపైనా ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని.. పదేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. తమ వద్ద ఏక్‌నాథ్ షిండేలు లేరని.. రేవంత్ అందర్నీ కలుపుకొని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జూన్5 తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు 25 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న కోమటిరెడ్డి.. ‘వాళ్ళ పేర్లు కూడా చెప్పాలా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై కసితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారని.. లక్ష కోట్లు ఇచ్చినా కూడా కేసీఆర్ దగ్గరకు వెళ్లరని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో సీట్ల సంఖ్య 154కు పెరుగుతుందని.. హైదరాబాద్‌లో 12సీట్లు పెరుగుతాయని తెలిపారు. కాగా.. సచివాలయం నిర్మాణంలో భాగంగా రూ.50 కోట్లతో అయ్యే ఇంటర్నెట్, ఎలక్ట్రిక్ పనులను కేసీఆర్ బంధువుకు అప్పగించి రూ.270కోట్లతో చేశారని, ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ కూడా ప్రచురించిందన్నారు.