Share News

మిషన భగీరథ నీళ్లు రాక తలెత్తుకోలేక పోతున్నాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:10 AM

గ్రామాల్లో ఒక్క ఇంటికీ మిషన భగీరథ నీళ్లు రావడం లేదు, ఇంటి నుంచి బయటకు వస్తే ప్రజల ముందు తలఎత్తుకొని తిరగలేకపోతున్నాం,

మిషన భగీరథ నీళ్లు రాక తలెత్తుకోలేక పోతున్నాం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన దీపిక

జడ్పీ చైర్‌పర్సన ముందు వాపోయిన ప్రజాప్రతినిధులు

సూర్యాపేట సిటీ, జనవరి 11 : గ్రామాల్లో ఒక్క ఇంటికీ మిషన భగీరథ నీళ్లు రావడం లేదు, ఇంటి నుంచి బయటకు వస్తే ప్రజల ముందు తలఎత్తుకొని తిరగలేకపోతున్నాం, అధికారులు చేస్తున్న తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామంటూ పలువురు జడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జడ్పీ కార్యాలయంలో పలు స్థాయీ సంఘాల సమావేశాలు చైర్‌పర్సన గుజ్జ దీపిక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు ఆమె ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ, నేరేడుచర్ల, నూతనకల్‌ జడ్పీటీసీ సభ్యులు మండలపు కృష్ణకుమారి, రాపోలు నర్సయ్య, కందాళ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ భగీరథ పైపులు ధ్వంసమై రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేయడంలో అధికారులు, అలసత్వం వహిస్తున్నారన్నారు. గ్రామాలకు నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా గ్రామాలను కలిపే బీటీ లింకు రోడ్ల పనులన్నీ ఆగిపోయాయని, గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన పనులను పూర్తి చేయాలని కోరారు. నిధుల కొరతతో మన ఊరు - మన బడి అభివృద్ధి పనులు నిలిచాయని అధికారులు తెలిపారు.

గైర్హాజరు అధికారులకు నోటీసులు: జడ్పీ చైర్‌పర్సన

జడ్పీస్థాయీ కమిటీల సమావేశాలకు హాజరు కాని ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వాలని చైర్‌పర్సన గుజ్జ దీపిక జడ్పీ సీఈవో సురేష్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొన్నిశాఖల ఉన్నతాధికారులు సమావేశాలకు హాజరుకాకుండా శాఖలోని కిందిస్థాయి సిబ్బందిని పంపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా పంపుతున్న శాఖల అధికారుల వివరాలను నోట్‌ చేసుకుంటున్నామని తెలిపారు. ఆరు తడి పంటలు సాగు చేసి ఎస్సారెస్పీ ద్వారా అందిస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె రైతులకు సూచించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:10 AM