MLA Harish Rao : నల్లగొండ సభ దెబ్బకే.. కేఆర్‌ఎంబీ తీర్మానం!
ABN , Publish Date - Feb 13 , 2024 | 04:12 AM
‘‘సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే రాష్ట్ర సర్కారు నిద్రపోయింది. కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించింది. కానీ, నీళ్ల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మా
ఇది బీఆర్‌ఎస్ సాధించిన విజయం
తీర్మానంపై అభ్యంతరాలు.. అయినా మద్దతు
కృష్ణాజలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉంది
అధికారులపై నెపాన్ని నెట్టి తప్పించుకునే యత్నం
ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై లేఖ రాయాలి
6 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి
అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ‘‘సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే రాష్ట్ర సర్కారు నిద్రపోయింది. కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించింది. కానీ, నీళ్ల వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మా అధినేత కేసీఆర్ నల్లగొండ సభకు పిలుపు ఇవ్వగానే భయపడిపోయింది. బడ్జెట్‌ను పక్కనపెట్టి మరీ కేఆర్‌ఎంబీ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టులను ఇవ్వబోమంటూ కేంద్రానికి లేఖ రాసింది. ఇది బీఆర్‌ఎస్, రాష్ట్ర ప్రజలు సాధించిన విజయం’’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) అనంతరం బీఆర్‌ఎస్ తరపున హరీశ్ మాట్లాడారు. పీపీటీ సత్యదూరంగా ఉందని ఆరోపించారు. అధికారులపై నెపం మోపి వేసి ప్రభుత్వం తప్పించుకుకోవాలని చూస్తోందని విమర్శించారు. 299 టీఎంసీల అంశానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. తమ హయాంలో కేఆర్‌ఎంబీపై రాసిన లేఖలను చూపించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఏపీ ఈఎన్‌సీల మాటలను వినిపించారు. పోతిరెడ్డిపాడుపై అప్పటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెదవులు మూసుకుంటే, తాము పేగులు తెగేదాక కొట్లాడామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన తీర్మానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. అయినా మద్దతు ఇస్తున్నామని హరీశ్ చెప్పారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని ట్రైబ్యునల్‌కు లేఖ రాయలని, ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కాగా, పీపీటీకి తమకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను హరీశ్ కోరారు. అయితే, స్పీకర్ అనుమతివ్వలేదు.
భట్టన్నా ఓపిక పట్టు..
కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే పనులేమీ చేయలేదని హరీశ్ అన్నారు. నిర్వహణ విధానం (ఆపరేషన్ ప్రొటోకాల్) తేలేదాకా ఇవ్వబోమని తేల్చి చెప్పామని, జలాలను 50:50 నిష్పత్తితో పంచాలని 27 దాకా లేఖలు రాశామని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి జోక్యం చేసుకోబోయారు. ‘ఉన్నది అంటే ఉలుకెందుకే భట్టన్న..? ఓపిక పట్టు. నువ్విపుడు ఉప ముఖ్యమంత్రివి. ఓపిక తెచ్చుకో’ అని హరీశ్ వ్యాఖ్యానించారు. కాగా, భట్టి కల్పించుకుంటూ ‘స్మితా సబర్వాల్‌ను తప్పుపట్టడం లేదు. ప్రభుత్వం చెబితేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని ఆమె లేఖ రాశారు’ అని అన్నారు. ఇంతలో ఉత్తమ్ స్పందించి ‘అసెంబ్లీని పంచాయతీ స్థాయికి దిగజార్చొద్దు. పదేళ్లపాటు మాకు 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పి, ఇప్పుడు సభను పక్కదారి పట్టించవద్దు. తెలంగాణకు ద్రోహం చేసింది, మోసం చేసింది బీఆర్‌ఎస్ వారే. అబద్ధాలు ప్రచారం చేస్తే మీపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని హెచ్చరించారు. ప్రాజెక్టులను అప్పగించేది లేదని కేంద్రానికి తేల్చిచెప్పామని, కేంద్రం మినిట్స్‌పై సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ ఉత్తమ్ పుట్టు కాంగ్రెస్ వాది అని, ఆరేడుసార్లు గెలిచినా సీఎం పదవి రాలేదనే అసహనంలో ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు.
రేవంత్ తెలంగాణ ఉద్యమంపై మాట్లాడడమా?
హరీశ్ తన ప్రసంగంలో కేసీఆర్‌పై విమర్శలు, తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించారు. ‘‘రేవంత్‌రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంటది. కేసీఆర్‌ను కరీంనగర్‌లో తరిమితే మహబూబ్‌నగర్‌కు వచ్చిండని చెబుతున్రు. నిన్ను కొడంగల్‌లో తరిమితే మల్కాజ్‌గిరి వచ్చినవా?, ఒక వేలుమమ్మల్ని చూపిస్తే రెండు వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయి. సభలో సీఎం, మంత్రులు గాంధీభవన్‌లోలా మాట్లాడుతున్నారు. ఇదేం భాష? అని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆయన లేనిదే తెలంగాణ లేదు. సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీలో కూర్చునేవారు కాదు’’ అని అన్నారు
11 సీట్లలో చెప్పుతో కొట్టారు.. మీకూ సున్నా వచ్చాయిగా?
కేంద్రానికి లేఖ రాయడం ద్వారానైనా దారికొచ్చారని అనుకుంటే ఫిబ్రవరి 1న కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తామని తెలంగాణ ఈఎన్‌సీ ఒప్పుకొన్నారని హరీశ్ వ్యాఖ్యానించిన సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. నల్లగొండ సభకు వచ్చేముందు ఏపీ సీఎం జగన్ స్టేట్‌మెంట్‌ను చూడాలని కోరారు. మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. బీఆర్‌ఎ్‌సను నల్లగొండ జిల్లాలో 11 సీట్లలో ప్రజలు చెప్పుతో కొట్టారని, కేసీఆర్, హరీశ్, జగదీశ్‌రెడ్డి అన్యాయం చేశారని దక్షిణ తెలంగాణను మోసం చేశారని, నల్లగొండలో కాలుమోపే అర్హత మీకు లేదని, ముక్కునేలకు రాశాకే రావాలని మండిపడ్డారు. హరీశ్ స్పందిస్తూ గతంలో ‘ఆ జిల్లాలో కాంగ్రెస్ సున్నా వచ్చాయి. బండ్లు ఓడలైతయ్.. ఓడలు బండ్లవుతాయ్. రాహుల్ గాంధీని అమేఠీ ప్రజలు చెప్పుతో కొట్టినట్లేనా? రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ పట్ల ఈ విధంగా మాట్లాడతారా?’ అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తొలగించే వరకు మాట్లాడబోమని హరీశ్ చెప్పగా రికార్డుల నుంచి తొలగించనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.