మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:11 PM
సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజి, అబ్ట్సెస్ట్రిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కిరణ్మయి అన్నారు.
- ఎఫ్‌వోజీఎస్‌ఐ చైర్మన్ డాక్టర్ కిరణ్మయి
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం), మార్చి 14 : సమాజంలో మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజి, అబ్ట్సెస్ట్రిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పుర స్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మహిళా సాధికారతపై అవగాహన సదస్సుకు ఆమెతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్‌లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సమాజంలో లింగవివక్ష ఉండకూడదని, పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో కొనసాగుతున్నారన్నారు. లింగ సమానత్వం కోసం పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా సాటి మహిళలను ఏ కారణంతోనైనా అగౌరపరిచే చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. ప్రతీ మహిళ తనకు తాను ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నారు. తమ పరిధిలోని కార్యాలయాలు, పనిచేస్తున్న చోట మహిళల పట్ల అసమానతలు చూపినా, వివక్షకు గురిచేసినా, హింసకు పాల్పడినా వెంటనే స్పందించాలని, అలాంటి వారికి శిక్షపడే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు శక్తివంతంగా మారాలని, తమకు ఏదైనా అన్యాయం జరిగితే తక్షణమే ఖండించాలన్నారు. మహిళలు సామాజిక, విద్య, రాజకీయ, ఆర్థికపరంగా ఎదిగిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. ప్రతీ మహిళ అత్యవసర సమయంలో 1091, గృహహింస సమయంలో 181 అనే టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనంతరం నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంకిషన్, జనరల్ ఆసుపత్రి గైనిక్ హెచ్‌వోడీ డాక్టర్ రాధలు మహిళ సాఽధికారతపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీపద్మప్రియ, డాక్టర్ ఆశాజ్యోతి, ఎఫ్‌వోజీఎస్‌ఐ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్, సఖి సెంటర్ నిర్వాహకులు, నర్సింగ్ కళాశాల సిబ్బంది, జనరల్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.