ఉద్యమకారులకు గౌరవమేదీ ?
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:16 PM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమద్రోహులను అందలం ఎక్కించారే తప్ప, ఉద్యమకారులను ఏనాడైనా గౌరవించారా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
- రాచరికపు చిహ్నాలుండవు : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్
మహబూబ్‌నగ ర్, జూన్ 1 : పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమద్రోహులను అందలం ఎక్కించారే తప్ప, ఉద్యమకారులను ఏనాడైనా గౌరవించారా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా తీసుకుని అందెశ్రీని గౌరవించారని, పదేళ్లలో మీరెందుకు చేయలేదని, ఇప్పుడు చేస్తుంటే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాచరికపు, దొరతనపు చిహ్నాలుండవని, ప్రజాస్వామ్య చిహ్నాలే ఉంటాయని, దీనిపై మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డటం విడ్డూరంగా ఉందన్నారు. కవిత బతుకమ్మ పాటకు ఏఆర్ రహమాన్‌తో మ్యూజిక్ కొట్టించినప్పుడు, ఈ ప్రాంతానికి సంబంధం లేని సమంతను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినప్పుడు, గద్దర్‌కు కేసీఆర్ సమయం ఇవ్వకుండా నిలబెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదని శ్రీనివాస్‌గౌడ్‌ను ప్రశ్నించారు. అప్పు డు లేవని గొంతులు ఇప్పుడు మా ముఖ్యమంత్రిపై మాట్లాడం సరికాదని, మీ సలహాలు తీసుకునే పరిస్థితిలో మేము లేమన్నారు. మీ నాయకుడు కేసీఆర్ జైలుకు పోయే సమయం వచ్చిందని, ఆయన వెంట కొందరు మాజీమంత్రులు కూడా వెళతారని, అలాంటి మీ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ప్రజాపా లన సాగిస్తున్న ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి లేదన్నారు. పదేళ్లలో పాలమూ రులో ఉద్యమకారులకు ఎవరికైనా పదవులు ఇచ్చారా అని, ఉద్యమకారులు నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్ పాల్గొన్నారు.