Share News

యూరియా కొరత లేదు

ABN , Publish Date - Aug 13 , 2024 | 11:55 PM

జిల్లాలో యూరియా కొరత ఉందనే ఆపోహలకు రైతులు గురికావద్దని, జిల్లాలో వివిధ సంస్థల వద్ద 2135.95 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకు సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ తెలిపారు.

 యూరియా కొరత లేదు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌

వికారాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో యూరియా కొరత ఉందనే ఆపోహలకు రైతులు గురికావద్దని, జిల్లాలో వివిధ సంస్థల వద్ద 2135.95 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరాకు సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ తెలిపారు. అంతే కాకుండా మార్క్‌ఫెడ్‌ వద్ద 4723.160 మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘యూరియా ఏదయా!’ శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి గోపాల్‌ స్పందించారు. ఈ విడతకు సరిపడా యూరియా రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. సన్న యూరియా, దొడ్డు యూరియా పనితనంలో ఎలాంటి తేడా ఉండదని, ఈ రెండు రకాల యూరియాలు పనిచేసే విధానం ఒక్కటేనని ఆయన వివరించారు. ఫర్టిలైజర్‌ దుకాణదారులు తప్పనిసరిగా గరిష్ట చిల్లర ధరలకే ఈపాస్‌ మిషన్‌ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల రైతులకు ఎరువులు విక్రయించకూడదని, ఇతర ఉత్పత్తులతో లింక్‌ చేసి అమ్మకూడదన్నారు. వ్యవసాయాధికారులు వారానికి ఆరు దుకాణాల వంతున తనిఖీ చేసి యాప్‌లో నమోదు చేస్తున్నారని, తనిఖీల్లో లోపాలు వెలుగులోకి వస్తే తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొనుగోళ్లలో ఎలాంటి తప్పిదాలు తమ దృష్టికి వచ్చినా రైతులు సంబంధిత దుకాణదారులపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేస్తే వారు తగిన చర్యలు తీసుకుంటారని గోపాల్‌ స్పష్టం చేశారు.

ధారూరు పీఏసీఎస్‌కు రెండు లారీల యూరియా

ధారూరు: ధారూరు పీఏసీఎ్‌సకు మంగళవారం మార్క్‌ఫెడ్‌ నుంచి రెండు లారీల యూరియా వచ్చిందని సంఘం సీఈవో నర్సింహులు తెలిపారు. పీఏసీఎ్‌సకు 1,120 సంచుల యూరియా వచ్చిందన్నారు. ఇందులో 560 సంచులు నాగారం ఎరువుల కేంద్రానికి తరలించి రైతులకు పంపిణీ చేశామని వివరించారు. ఒక్కో రైతుకు 3 సంచుల చొప్పున అందజేశామని ఆయన తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 11:55 PM