Share News

జిల్లా భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు నోటీసులు

ABN , Publish Date - Aug 14 , 2024 | 10:51 PM

ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో భూసేకరణ అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను జిల్లా భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జీఎన్‌వీ రాజుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

 జిల్లా భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌కు నోటీసులు

జారీ చేసిన కోర్టు

ఈ నెల 30న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

లేకుంటే చర్యలు తప్పవన్న న్యాయస్థానం

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14: ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో భూసేకరణ అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గాను జిల్లా భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జీఎన్‌వీ రాజుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30న హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని కూడా అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్లు.. 166, 420, 492, 512లలో మొత్తం 671.29 ఎకరాలు ఉండగా.. గతంలో 504 మంది పేదలకు ఈ భూములపై అసైన్‌మెంట్‌ పట్టాలిచ్చారు. ఈ భూములనే అప్పటి ప్రభుత్వం టీఎ్‌సఐఐసీ ద్వారా ఏరోస్పేస్‌ పార్కు కోసం భూసేకరణకు పూనుకుంది. 571.29 ఎకరాలకు సంబంధించి 481 మంది రైతుల నుంచి భూసేకరణ చేయాలని నిర్ణయించి 2018లో నోటిఫికేషన్‌ వేశారు. ఎకరాకు రూ.12 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి 2019లో భూసేకరణకు పూనుకున్నారు. కాగా, ఎక్కువ శాతం రైతులు పరిహారం పొందారు. అయితే, తమకు అసైన్డ్‌ పట్టా కన్నా తక్కువ చూపుతూ పరిహారం ఇవ్వచూపుతున్నారని పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాసం-పునర్మిర్మాణం) చట్టం ప్రకారం తమకు పరిహారం అందించాలని కూడా పలువురు రైతులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఇదే కోవలో రైతులు కొట్టంల మల్లయ్య, కొట్టంల నర్సింహ, కొట్టంల భాషాలు తమ అసైన్డ్‌ పట్టాకు అధికారులు విస్తీర్ణం తక్కువచేసి పరిహారం చూపుతున్నారని, పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి మూడు నెలల్లో అవార్డు పాస్‌చేసి పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టు నాయమూర్తి 2023 డిసెంబరులో ఉత్తర్వులిచ్చారు. అయినా, నేటికీ ఆ రైతులకు పరిహారం అందకపోవడంతో వారి తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌రెడ్డి కోర్టులో పిటిషన్‌ వేశారు. దాంతో ఈనెల 30న హైకోర్టుకు హాజరు కావాలంటూ న్యాయమూర్తి కె.శరత్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు ఈనెల 2న నోటీసులు జారీచేసింది. కాగా, మరికొంత మంది రైతులకు సంబంధించి కూడా కోర్టు ఉత్తర్వులు రానున్నట్లు తెలిసింది.

Updated Date - Aug 14 , 2024 | 10:51 PM