Share News

టీ తాగితే.. నల్లమందు కిక్కు!

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:31 AM

మీరు రెగ్యులర్‌గా వెళ్లే టీస్టాల్‌లో.. ఒక కప్పు ఛాయ్‌ తాగగానే తలనొప్పి వెంటనే గాయబ్‌ అవుతోందా? డిప్రెషన్‌, తీవ్ర పని ఒత్తిడి వల్ల కలిగే చికాకు.. ఇలా పలు సమస్యల నుంచి తక్షణం

టీ తాగితే.. నల్లమందు కిక్కు!

ఛాయ్‌లో గసగసాల పొట్టు, గడ్డి.. జిలేబీల తయారీలోనూ వినియోగం

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు రవాణా

గసగసాల గడ్డి నుంచి.. హెరాయిన్‌, నల్లమందు తయారీకి చాన్స్‌

ఇద్దరికి బేడీలు..రూ.కోటిన్నర విలువైన ముడిసరుకు సీజ్‌

మంగళ్‌హాట్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): మీరు రెగ్యులర్‌గా వెళ్లే టీస్టాల్‌లో.. ఒక కప్పు ఛాయ్‌ తాగగానే తలనొప్పి వెంటనే గాయబ్‌ అవుతోందా? డిప్రెషన్‌, తీవ్ర పని ఒత్తిడి వల్ల కలిగే చికాకు.. ఇలా పలు సమస్యల నుంచి తక్షణం ఉపశమనం లభిస్తోందా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఆ టీలో నల్లమందు ఉండే ప్రమాదముంది. రాజస్థాన్‌కు చెందిన ముఠాలు నల్లమందు ముడి సరుకు(గసగసాల గడ్డి, పొట్టు)ను హైదరాబాద్‌లోని టీస్టాల్స్‌, జిలేబీ బండ్లు, కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. గోషామహల్‌లో 15 రోజులు నిఘా పెట్టి.. ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.50 కోట్లు విలువ చేసే 160 కిలోల గసగసాల గడ్డిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మియా జిల్లా నుంచి కొన్ని ముఠాలు హైదరాబాద్‌కు నల్లమందు, హెరాయిన్‌ తయారీకి ఉపయోగించే పాపి స్ట్రా(గసగసాల గడ్డి, పొట్టు)ను సరఫరా చేస్తున్నాయి. ఈ ముడి సరుకు నుంచి హెరాయిన్‌, ఒపియం(నల్లమందు)ను తయారు చేస్తారు. అయితే గోషామహల్‌కు చెందిన పరాస్‌ అనే వ్యక్తి గసగసాల గడ్డి, పొట్టును రాజస్థాన్‌ నుంచి తెప్పించి, హైదరాబాద్‌లోని టీస్టాళ్లు, జిలేబీ బండ్లు, కిరాణాలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై ఉప్పందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు తొలుత దేవేంద్ర అనే వ్యక్తిపై నిఘా పెట్టారు. శనివారం అతణ్ని అరెస్టు చేశారు. దర్యాప్తులో దేవేంద్ర తండ్రి పరాస్‌ గసగసాల గడ్డి, పొట్లు సరఫరాలో కీలక నిందితుడని గుర్తించారు. వీరి ఇంట్లో తనిఖీ చేసి, 160 కిలోల గసగసాల పొట్టు, గడ్డిని సీజ్‌ చేశారు. దీన్ని ప్రాసెస్‌ చేస్తే.. విలువ రూ.1.5 కోట్ల దాకా ఉంటుందని ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. ‘‘మరుగుతున్న టీలో గసగసాల పొట్టును కలిపితే.. ఆ ఛాయ్‌ తాగిన వారికి మత్తుగా ఉంటుంది. జిలేబీల తయారీలోనూ గసగసాల పొట్టు, గడ్డిని వాడుతున్నారు. ఒపియం వంటి మత్తుపదార్థాలను తయారు చేస్తున్నారు. ఒక గ్రాము ఒపియం నుంచి 32 మిల్లీ గ్రాముల మార్పిన్‌, హెరాయిన్‌ తయారవుతుంది. 160 కిలోల పాపి స్ట్రా నుంచి 5.5 కిలోల మార్పిన్‌, హెరాయిన్‌ను తయారు చేయవచ్చు’’ అని అధికారులు వివరించారు.

Updated Date - Apr 21 , 2024 | 03:31 AM