Share News

ORR Lease : ఓఆర్‌ఆర్‌ లీజు బేస్‌ ప్రైస్‌ రూ.7300 కోట్లు!

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:43 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డును 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయించిన బేస్‌ప్రైస్‌ ఎంత? ఇన్నాళ్లుగా ప్రశ్నార్థకంగా ఉన్న ఈ అంశానికిప్పుడు సమాధానం దొరికింది. గత ప్రభుత్వం దీనికి

ORR Lease : ఓఆర్‌ఆర్‌ లీజు బేస్‌ ప్రైస్‌ రూ.7300 కోట్లు!

ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌ మజార్స్‌ నివేదికే ఆధారం

ఆద్యంతం గోప్యత పాటించిన నాటి ప్రభుత్వం

రూ.7380 కోట్లకు ఒప్పించిన ఐఏఎస్‌ల కమిటీ

వచ్చిన సొమ్ము హైదరాబాద్‌ నగర అభివృద్ధికి,

మౌలికవసతులకు కాకుండా రుణమాఫీకి మళ్లింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డును 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి గత ప్రభుత్వం నిర్ణయించిన బేస్‌ప్రైస్‌ ఎంత? ఇన్నాళ్లుగా ప్రశ్నార్థకంగా ఉన్న ఈ అంశానికిప్పుడు సమాధానం దొరికింది. గత ప్రభుత్వం దీనికి నిర్ణయించిన బేస్‌ప్రైస్‌ రూ.7300 కోట్లు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రక్రియకు అప్పట్లో ఔటర్‌ ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌గా నియమించుకున్న మజార్స్‌ అడ్వైజరీ అనే ఫ్రెంచ్‌ కన్సల్టెన్సీ సంస్థ నివేదికనే ఆధారంగా చేసుకున్నట్లు తెలిసింది. ఆ సంస్థ నిర్ణయించిన బేస్‌ ప్రైస్‌ ఆధారంగానే టెండర్‌ ప్రక్రియను చేపట్టారు. కానీ.. టెండర్‌లో పాల్గొన్న సంస్థలకు కూడా బేస్‌ప్రై్‌సను తెలియజేయలేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఆద్యంతం గోప్యత పాటించింది. బంగారుబాతు లాంటి ఔటర్‌ రింగు రోడ్డును కారుచౌకగా ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లకు లీజుకు అప్పగించడంపై నిరుడు ఏప్రిల్‌ 28న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో.. ‘రాసిచ్చేశారు’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం సృష్టించింది. తాము అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ జరిపిస్తామని టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి అప్పట్లో ప్రకటించారు. సీఎం కాగానే దీనిపై హెచ్‌ఎండీఏ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదిక కోరారు.

టెండర్లు ఆహ్వానించినప్పుడు బేస్‌ప్రై్‌సను ప్రభుత్వం ప్రకటించకపోయినప్పటికీ.. టెండర్‌ వేసిన నాలుగు సంస్థల్లో ఐఆర్‌బీ సంస్థ రూ.7272 కోట్లు, దినే్‌షచంద్ర ఆర్‌ అగర్వాల్‌ ఇన్‌ఫ్రా రూ.7007 కోట్లు, గవర్‌ కన్‌స్ట్రక్షన్‌ రూ.6767 కోట్లు, ప్రస్తుతం టోల్‌ వసూలు చేస్తున్న ఈగల్‌ ఇన్‌ఫ్రా రూ.5643 కోట్ల మేర బిడ్‌లను కోట్‌ చేశాయి. అత్యధికంగా కోట్‌ చేసిన ఐఆర్‌బీ సంస్థను.. ‘మరింత అధికంగా చెల్లిస్తారా?’ అని ప్రభుత్వ వర్గాలు కోరగా రూ.7380 కోట్లు చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌పై ఏటా పెరిగే వాహనాలు, 3 నుంచి 4 శాతం మేర పెరిగే టోల్‌ చార్జీలతో ఏడాదికి కనీసం ఐదు శాతం ఆదాయం పెరిగినా సర్కారుకు భారీగా ఆదాయం పెరుగుతుంది. అయినా.. 30 ఏళ్ల లీజుకు బేస్‌ప్రై్‌సను రూ.7300 కోట్లుగా నిర్ణయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఓఆర్‌ఆర్‌ టీవోటీ ఫైనాన్షియల్‌ బిడ్‌ల ఇనిషియల్‌ ఎస్టిమేటెడ్‌ కన్సెషన్‌ వాల్యూను (ఐఈసీవీ) నిర్ధారించడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారుల కమిటీయే రూ.7380 కోట్ల లీజు చెల్లించడానికి ఐఆర్‌బీ సంస్థను ఒప్పించినట్లు తెలిసింది. ఈ మేరకు.. గత ఏడాది ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌ ప్రైవేటు సంస్థ లీజులోకి వెళ్లగా, 11వ తేదీనే ప్రభుత్వానికి రూ.7380 కోట్ల చెక్కు అందింది. దాన్ని హెచ్‌ఎండీఏ ఖాతాలో 12న జమ చేయగా, మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ సొమ్మును రాష్ట్ర ఖజానాకు మళ్లించారు. ఆ మొత్తాన్ని హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు వాడతామని.. అప్పటి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కానీ, ఆ సొమ్మును రైతు రుణమాఫీకి వినియోగించినట్లు సమాచారం.

Updated Date - Mar 05 , 2024 | 05:43 AM