లక్ష్యానికి దూరంగా.. ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:25 AM
జిల్లాలో ధాన్యం సేకరణ ముగిసింది. నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. మొదట 3 లక్షల మెట్రిక్ టన్నులు పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా సేకరించాల నుకున్నారు. కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు ధాన్యాన్ని దళారులు, మిల్లర్లకు నేరుగా విక్రయించారు. దీంతో 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు అవుతుందని భావించారు. చివరికి 2 లక్షల 11 వేల 264 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఎట్టకేలకు ముగిశాయి. పౌరసరఫరాల శాఖ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. ధాన్యం సేకరణకు జిల్లాలో మొత్తం 248 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా రూ.490.13 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. మంగళవారం సాయంత్రంతో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మిల్లర్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తూకం ఆలస్యమైంది.
జిల్లాలో సేకరించిన ధాన్యం
వానాకాలం సీజన్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగుకు సంబంధించిన ధాన్యం దిగుబడి 4.37 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనాలు వేసింది. ఇందులో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు స్థానికంగా వినియోగించుకోగా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అందులో 77,885 మెట్రిక్ టన్నులు మిల్లర్లు నేరుగా కొంటారని అంచనాలు వేశారు. మిగిలిన 3 లక్షల మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోళ్లు ఆలస్యమవడంతో రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దే మధ్య వ్యాపారులకు, మిల్లర్లకు నేరుగా అమ్ముకోవడంతో పౌరసరఫరాల శాఖ తన లక్ష్యాన్ని తగ్గించుకుంది. 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు అవుతుందని భావించింది. తగ్గించుకున్న లక్ష్యాన్ని కూడా పూర్తి కాలేదు. పౌరసరఫరాల శాఖ జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారా 2 లక్షల 11 వేల 264 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఐకేపీ ద్వారా 42,991 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 1,60,867 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 4565 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 2840 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ప్రభుత్వం ఈసారి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించినా కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యం తక్కువగానే వచ్చింది. సన్నరకం ధాన్యానికి సంబంధించి 16,300 ఎకరాల్లో సాగు చేశారు. దీని ద్వారా 34,230 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. స్థానికంగా 4230 మెట్రిక్ టన్నుల ధాన్యం వినియోగించుకోగా మార్కెట్‌లోకి 30 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో మిల్లర్లు 5400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే మిగిలిన 24,600 మెట్రిక్ టన్నులు పౌరసరఫరాల కార్పొరేషన్ కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. పౌరసరఫరాల శాఖ 6057 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో ఐకేపీ ద్వారా 1228 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 4109 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ 508 మెట్రిక్ టన్నులు, మెప్మా 211 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
రైతుల ఖాతాల్లో రూ.484.64 కోట్లు జమ
జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 37,398 మంది రైతుల నుంచి రూ.490.13 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యానికి సబంధించి రైతుల ఖాతాల్లో 484.64 కోట్లు జమ చేశారు. జమ చేసిన వాటిలో ఐకేపీకి సంబంధించి రూ .99.53 కోట్టు, సింగిల్ విండోలకు సంబంధించి రూ. 367.96 కోట్లు, డీసీఎంఎస్‌కు సంబంధించి రూ.10.55 కోట్లు, మెప్మాకు సంబంధించి రూ.6.51 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.