ఫోన్ ట్యాపింగ్ గుట్టు.. ప్రభాకర్‌రావుకే ఎరుక!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:32 AM
ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వాంగ్మూలమే కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ)
ఆయన శాసిస్తే.. పాటించామన్న నిందితులు.. ప్రభాకర్‌రావును శాసించిదెవరు??
ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం
ముగిసిన భుజంగరావు, తిరుపతన్న కస్టడీ
రాధాకిషన్‌రావు కస్టడీపై తీర్పు వాయిదా
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వాంగ్మూలమే కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన వాంగ్మూలాల్లో.. ప్రభాకర్‌రావు చెప్పినట్లే చేశామని పేర్కొన్నారే తప్ప.. బీఆర్‌ఎస్ హయాంలో ఫలానా నాయకుడు ప్రధాన సూత్రధారి అనే విషయాన్ని ఇతమిత్థంగా కూడా చెప్పలేదని తెలుస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలియాలంటే ప్రభాకర్‌రావు అరెస్టవ్వడమో.. లొంగిపోవడమో అత్యంత కీలకమని స్పష్టమవుతోంది. భుజంగరావు, తిరుపతన్నను కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు జరిపిన విచారణలోనూ.. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఆపరేషన్స్ గురించి మాత్రమే చెప్పారని తెలుస్తోంది. ప్రణీత్‌రావు కూడా కస్టడీలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రావు చెప్పింది చేశామేతప్ప.. ఏమీ తెలియదని వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చిన గత ప్రభుత్వ పెద్ద ఎవరు? అనేది ప్రభాకర్‌రావు మాత్రమే చెప్పగలరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అరెస్టు సందర్భంగా జరిపిన ప్రాథమిక విచారణలో బెదిరింపులు, నగదు తరలింపు అనే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఆయనను కస్టడీకి తీసుకుని, విచారించినా.. ట్యాపింగ్ వెనక ఉన్నదెవరనేది తెలిసే అవకాశాలున్నట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. భుజంగరావు, తిరుపతన్న పోలీసు కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు రిమాండ్ చేశారు. ఈ నెల 6 వరకు వీరిద్దరి రిమాండ్ కొనసాగనుంది. రాధాకిషన్‌రావు కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు బుధవారానికి తీర్పును వాయిదా వేసినట్లు తెలిసింది. ఇక రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో కొత్తగా వెలుగులోకి వచ్చిన అదనపు ఎస్పీ వేణుగోపాల్‌రావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు నోటీసులిచ్చినట్లు తెలిసింది. వేణుగోపాల్‌రావు ఉమ్మడి సైబరాబాద్‌లో ఎల్‌బీనగర్ ఏసీపీగా, పటాన్‌చెరు ఏసీపీగా, పలు ఠాణాల్లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. సైబరాబాద్‌పై మంచి పట్టు ఉండడం వల్లే.. ఎన్నికల సమయంలో ఆ కమిషనరేట్‌లో ‘స్పెషల్ ఆపరేషన్స్ టీం’ను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.
నా ఫోన్‌ను ట్యాప్ చేశారు: చీకోటి ప్రవీణ్
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని.. డ్రగ్స్ కేసులు పెడతామంటూ బెదిరించారని బీజేపీ నేత చీకోటి ప్రభాకర్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అండతో రాధాకిషన్‌రావు రెచ్చిపోయారని, గజ్వేల్‌లో శివాజీ విగ్రహం వివాదం తలెత్తినప్పుడు తాను అక్కడికి వెళ్తే.. ఆయన ఫోన్‌చేసి, బెదిరించారని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్తే.. తన అనుచరుల వద్ద మారణాయుధాలున్నాయంటూ రాధాకిషన్‌రావు కేసులు బనాయించారని ఆరోపించారు. తన ఫాంహౌ్‌సపై దాడి చేసి, డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారన్నారు. సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.