66.30% పోలింగ్ శాతం తుది గణాంకాలు
ABN , Publish Date - May 15 , 2024 | 03:34 AM
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతం తుది గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. 17
పోస్టల్ బ్యాలెట్ సహా లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్
ప్రత్యక్ష పోలింగ్ 65.67%.. భునవగిరి 76.78 టాప్
48.48 శాతంతో అట్టడుగున రాజధాని హైదరాబాద్
మొత్తం ఓటింగ్‌లో పాల్గొన్నది 2,20,24,806 మంది
అసెంబ్లీ స్థానాల ప్రకారం నర్సాపూర్ 84.25 ప్రథమం
జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్‌రాజ్
హైదరాబాద్, యాదాద్రి, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ శాతం తుది గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. 17 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ప్రత్యక్ష పోలింగ్ 65.67% నమోదైందని వికాస్‌రాజ్ తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ 3% పైగా పెరిగిందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 66.3 శాతం దాటిందని వివరించారు. జూన్ 4వ తేదీన 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. కాగా, పోలింగ్‌లో భువనగిరి (76.78) ప్రథమ స్థానంలో నిలవగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48% పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే నర్సాపూర్‌లో అత్యధికంగా 84.25 శాతం, మలక్‌పేటలో అత్యల్పంగా 42.76 శాతం నమోదైందన్నారు. కాగా, రాష్ట్రంలో 3,32,16,348 మంది ఓటర్లకు గాను, 2,20,24,806 మంది ఓటు వేసినట్లు పేర్కొన్నారు.
35,809 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,18,14,035 (65.67 శాతం) మంది, పోస్టల్ బ్యాలెట్‌లో 2,10,771 మంది హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు. పోలింగ్ శాతం పెంపునకు క్షేత్రస్థాయు యంత్రాంగం చేసిన కృషికి తగిన ఫలితం దక్కిందన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్ల నుంచి ఈవీఎంలను భద్రతా బలగాల సహకారంతో స్ట్రాంగ్ రూముల్లో చేర్చినట్లు వికా్‌సరాజ్ చెప్పారు. 44 స్ట్రాంగ్‌రూములకు నలువైపులా సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం చూస్తే.. ఆదిలాబాద్ 74.03, భువనగిరి 76.78, చేవెళ్ల 56.50, హైదరాబాద్ 48.48, కరీంనగర్ 72.54, ఖమ్మం 76.09, మహబూబాబాద్ 71.85, మహబూబ్‌నగర్ 72.43, మల్కాజిగిరి 50.78, మెదక్ 76.09, నాగర్‌కర్నూల్ 69.46, నల్లగొండ 74.02, నిజామాబాద్ 71.92, పెద్దపల్లి 67.87, సికింద్రాబాద్ 49.04, వరంగల్ 68.86, జహీరాబాద్ 74.63 శాతం పోలింగ్ నమోదైంది.
భువనగిరిలోనూ మునుగోడు టాప్
భువనగిరిలో గత ఎన్నికల కంటే 2.36 శాతం పోలింగ్ అధికంగా జరిగింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో అత్యధికంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 83.71 శాతం, ఇబ్రహీంపట్నంలో అత్యల్పంగా 66.83 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉన్న ఇబ్రహీంపట్నం కంటే.. పల్లెలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ బాగా జరిగింది.